సజ్జల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ అధికారంలో ఉండగా సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కళ్లు, నోరుగా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సజ్జల చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా, చంద్రబాబు నాయుడి నివాసంపైనా జరిగిన దాడుల వెనుక సూత్రధారిగా సజ్జల పేరే ప్రముఖంగా బయటకు వస్తోంది. ఆ దాడుల కేసుల్లో నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిలో చాలా మంది ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలా పరారీలోకి వెళ్లిన వాళ్లలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. నందిగం సురేష్ అరెస్టు కావడానికి సజ్జల ద్వారా ఆయన కదలికల గురించి వచ్చిన లీకులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది వేరే సంగతి. మొత్తానికి నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసి మంగళగిరి తీసుకువచ్చి విచారించారు. ఆ విచారణలో నందిగం సురేష్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. 
తెలుగుదేశం కార్యాలయంపై దాడి ఉద్దేశమే తనకు లేదనీ, కానీ అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదేశాల మేరకే తాను అక్కడకు వెళ్లాననీ, దాడికి పాల్పడటం సమంజసం కాదని భావించి వెనుదిరిగాననీ నందిగం సురేష్ విచారణలో పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అంతే కాకుండా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడులకు మందిని సమీకరించడం నుంచి దాడి చేసేలా రెచ్చగొట్టడం వరకూ వెనుకున్నది సజ్జలేనని నందిగం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు, పరారీలో ఉన్నమాజీ మంత్రి జోగు రమేష్ కూడా అజ్ణాతంలోనే ఉన్నారు. అయితే ఆయన అజ్ణాతంలోకి వెళ్లడానికి ముందు దాడికి సంబంధించి తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
అప్పటి ముఖ్య సలహాదారు సూచన మేరకే చంద్రబాబు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. జగన్ ను ప్రతిపక్షం విమర్శస్తుంటే మౌనంగా ఎలా ఉంటారు అంటూ తమను సజ్జల అప్పట్లో రెచ్చగొట్టారని పలువురు వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి. 
మొత్తంగా తెలుగుదేశం కార్యాలయంపైనా, చంద్రబాబు నివాసంపైనా జరిగిన దాడుల వెనుక సజ్జల ఆదేశాలు, మార్గదర్శనమే ఉందని వైసీపీ వర్గాలే గట్టిగా చెబుతున్నాయి. విచారణలో కూడా అదే నిర్ధారణ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో సజ్జల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది.