తోడేళ్లు పగబడతాయా.. ప్రతీకారం తీర్చుకుంటాయా?

తోడేళ్లు పగబడతాయా? ప్రతీకారం తీర్చుకుంటాయా? కక్షగట్టి వెంటాడి, వేటాడి మరీ ఉసురు తీస్తాయా? అంటే ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో జరుగుతున్న వరస సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ ఔననే అంటున్నారు అటవీ శాఖ అధికారులు.  ఇంత కాలం మనం పాములు పగబడతాయనే విన్నాం. అయితే పాములు పగబట్టడం అన్నది ఉట్టి మూఢనమ్మకమేననీ అందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవనీ తేలిపోయింది. ఇక జంతువులు పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయన్న మాటే ఇప్పడి దాకా మనం వినలేదు. కానీ అటవీ అధికారులు మాత్రం తోడేళ్లు పగబడతాయనీ, అందుకు బహ్రైచ్ లో తోడేళ్లు జరుపుతున్న వరుస దాడులే నిదర్శనమనీ చెబుతున్నారు. 

తోడేళ్లు కూడా మనుషుల్లాగే సామూహికంగా జీవనం సాగిస్తాయనీ, వాటి మధ్య మనుషులకున్నంతగా గాఢమైన మమతానుబంధాలు పెనవేసుకుని ఉంటాయనీ చెబుతున్నారు. అటువంటి తోడేళ్ల గుంపులోని ఓ రెండు పిల్ల తోడేళ్లు ఓ ట్రాక్టర్ గుద్దడంతో చనిపోయాయి. ఆ సంఘటన జరిగి ఆరు నెలలు దాటింది.

సరిగ్గా ప్రమాదంలో రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచీ అంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయి. గత ఆరు నెలలుగా తోడేళ్లు తమ ప్రతీకార దాడులతో ఆరడజను మందిని చంపేసి పీక్కు తిన్నాయి. మరో 36 మందిని తీవ్రంగా గాయపరిచాయి. అటవీ అధికారులు గ్రామాన్ని  తోడేళ్ల బెడద నుంచి విముక్తి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.   బహ్రైచ్ గ్రామంపై దాడులు చేసి మనుషుల ప్రాణాలు తీస్తున్న తోడేళ్ల గుంపును కాల్చి చంపేందుకు యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.