ప్రతి మనిషి వినాయకుడి నుండి నేర్చుకోవలసిన విషయాలు
posted on Sep 6, 2024 9:30AM
ఏకార్యాన్నైనా ప్రారంభించే ముందు ప్రథమంగా వినాయకుణ్ణి పూజించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించమని మానవులే కాదు దేవతలు కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారని పురాణాలు పేర్కొన్నాయి. వినాయకుణ్ణి పూజించడం వల్ల 'మహా' విఘ్నాత్ ప్రముచ్యతే మహా దోషాత్ ప్రముచ్యతే...' 'మహా విఘ్నాలన్నీ తొలగిపోతాయి, మహా దోషాలన్నీ అంతమై పోతాయి' అని 'గణపతి అథర్వశీర్ణోపనిషత్తు' వివరిస్తోంది.
మదిలో తలచిన వెంటనే విఘ్నాలను తొలగించే దేవుడు. వినాయకుడు. అందువల్ల 'తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా దలచితినే హేరంబుని, తలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్' అంటూ వినాయకుణ్ణి ప్రార్థిస్తాం. ఎవరు ఏది కావాలని కోరుకుంటారో వారికి దాన్ని ప్రసాదించే సులభ ప్రసన్నుడు వినాయకుడు. సకల ఐశ్వర్యాలను కోరుకునేవారికి 'లక్ష్మీగణపతి'గా, సిద్ధులను కోరుకునేవారికి 'సిద్ధగణపతి'గా విద్యలను కోరుకునే వారికి 'అక్షర గణపతి'గా... ఇలా గణపతిని ఏయే రూపాల్లో ఉపాసిస్తే ఆయా ఫలితాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
విద్యార్థులకు ప్రియతముడు వినాయకుడు. అందుకే జ్ఞానప్రదాత అయిన వినాయకుడు విద్యార్థులకు అత్యంత ప్రియతముడయ్యాడు. విద్యార్థులు వినాయక చవితి రోజున వినాయకుని ప్రతిమ ముందు పుస్తకాలను ఉంచి, తమకు విద్యాబుద్ధులను ప్రసాదించమని 'కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి. గణాధిప నీకు మ్రొక్కెదన్' అంటూ భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి ప్రార్థిస్తారు. అయితే మనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని అక్షర గణపతిని ప్రార్థిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. కానీ ఆ జ్ఞాననిధిని వృద్ధి చేయడానికి మన వంతు కృషి చేయాలి.
ఏకాగ్ర చిత్తం..
ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ జ్ఞానాన్ని శీఘ్రంగా పొందాలంటే ఏకాగ్ర చిత్తంతో అధ్యయనం చేయాలి. ఏకాగ్రత లేని మనస్సుతో ఎన్ని గంటలు శ్రమించినా, ఎన్ని రోజులు కృషి చేసినా అది వేడి పెనం మీద పడిన నీటి చుక్కలా వెంటనే ఆవిరైపోతుందే కానీ ఎంతోకాలం నిలవదు. మనస్సును ఒక విషయంపై ఒక్క క్షణమైనా ఏకాగ్రం చేయలేకపోతున్నవారు ఏకాగ్రత అంటే ఎలా ఉండాలో వినాయకుని జీవితంలోని ఓ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు.
మహాభారత కథను ప్రపంచానికి అందించాలన్న ఆలోచన వ్యాసుడికి కలిగింది. 'నేను చెబుతుంటే ఈ మహాగ్రంథాన్ని వ్రాయగల సమర్థులెవరైనా ఉన్నారా?' అని బ్రహ్మను అడిగాడు. 'నీ సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే' అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. వెంటనే వ్యాసుడు వినాయకుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తన విన్నపాన్ని తెలిపాడు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కానీ వ్యాసుడు, 'గణనాథా! నేను భారత కథను చెబుతూ ఉంటాను. మీరు ఆగకుండా వ్రాస్తూ ఉండాలి' అని షరతు పెట్టాడు. అందుకు వినాయకుడు కూడా "నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే నా ఘంటం ఆగదు. కాబట్టి అలా ఆగకుండా కథను చెప్పాలి" అని షరతు పెట్టాడు. అందుకు వ్యాసుడు, 'నేను చెప్పినదాన్ని అర్థం చేసుకుంటూ 'వ్రాయాలి' అని వినాయకునికి మరో షరతు పెట్టాడు. ఒకరి షరతులకు మరొకరు అంగీకరించిన తరువాత వ్యాసుడు మహాభారత కథను చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాశాడు. ఆ విధంగా 'పంచమ వేదం'గా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం మనకు లభించింది. వ్యాసుడు నిర్విరామంగా చెప్పిన భారత కథను అర్థం చేసుకుంటూ, నిరాటంకంగా వ్రాసిన వినాయకుని ఏకాగ్రతాశక్తి అనితర సాధ్యమైనది.
ప్రశాంత చిత్తం..
జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రచిత్తం అవసరమే.. అయితే మనస్సును ఏ విషయంపైన అయినా ఏకాగ్రం చేయాలంటే ప్రశాంతత అవసరం. అలజడితో అల్లకల్లోలమైన చిత్తాన్ని ఏ విషయం పైనా నిమగ్నం చేయలేం. చంచలమైన మనస్సుతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం.
దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీ పరమేశ్వరులు సంకల్పించారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి.. వీరిద్దరిలో ఎవరు సమర్థులో తెలుసుకోవాలని 'ముల్లోకాలలోని పుణ్యతీర్థాలను సందర్శించి, ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తాను' అని శివుడు ఓ పోటీ పెట్టాడు. ఈ విషయాన్ని విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై పయనమయ్యాడు. కానీ మూషిక వాహనంపై ముల్లోకాలను సందర్శించి రావడం వినాయకునికి అసాధ్యం. వినాయకుడు తన అసహాయతకు అలజడి చెందకుండా, మనోనిశ్చలతను కోల్పోకుండా ప్రశాంతంగా పరిష్కారాన్ని ఆలోచించాడు. 'తల్లితండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాల్లోని పుణ్యతీర్థాలను సందర్శించిన ఫలితం లభిస్తుంది. అన్న ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన వినాయకుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేశాడు. ఆదిదంపతులు వినాయకుని బుద్ధి కుశలతకు సంతసించి, గణాధిపతిగా నియమించారు.
పరిశుద్ధ చిత్తం..
మనస్సు ఏకాగ్రతను సాధించాలంటే ప్రశాంతచిత్తంతో పాటు పరిశుద్ధచిత్తం అవసరం. అందుకు మనస్సులో ఎలాంటి వికారభావాలూ కలగకుండా జాగ్రత్త వహించాలి. అది బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం వల్లనే సాధ్యమవుతుంది.
ఒకసారి వినాయకుడు చిన్నప్పుడు ఆడుకుంటూ పిల్లిని కొట్టాడు. పిల్లికి ముఖంపై గాయమైంది. ఆట ముగించుకొని వినాయకుడు తన తల్లి పార్వతి దగ్గరకి వెళ్ళాడు. ఆమె ముఖంపై గాయాన్ని చూసి ఆశ్చర్యంతో 'అమ్మా! నీ ముఖంపై ఈ గాయం ఎలా అయ్యింది?' అని అడిగాడు. అందుకు పార్వతీదేవి, 'నాయనా! సర్వజీవుల్లో ఉన్నది నేనే. నువ్వు పిల్లి ముఖాన్ని గాయపరచడం వల్ల నా ముఖానికి కూడా గాయమైంది' అని చెప్పింది. సర్వజీవుల్లోనూ తల్లి పరమేశ్వరి కొలువై ఉందని తెలుసుకొన్నాడు వినాయకుడు. అలా సర్వజీవుల్లోనూ తల్లినే దర్శించిన వినాయకుని మనస్సులో ఎలాంటి అపవిత్ర భావాలూ కలిగేందుకు తావే లేదు.
జ్ఞానసముపార్జనకు ముఖ్య సాధనాలైన ఏకాగ్ర చిత్తం, ప్రశాంత చిత్తం, పరిశుద్ధ చిత్రాలను ఆ వినాయకుడే ప్రసాదించగలడు. కాబట్టి ఆయన్ను శరణు వేడాలి.
*నిశ్శబ్ద.