కృష్ణలంక రిటైనింగ్ వాల్ పై వైసీపీ కాకమ్మ కబుర్లు.. వాస్తవమేంటంటే?

ఓ వైపు బెజవాడ నగరం మొత్తం వరద ముంపునకు గురై అల్లాడిపోతోంది. లక్షలాది మంది నిలువ నీడ లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది. అధికార కూటమి నేతలూ, కార్యకర్తలూ కూడా యధాశక్తి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రజల కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా... ప్రకృతి విపత్తును చంద్రబాబు పాలనా వైఫల్యం ఖతాలో వైసేసి పోలిటికల్ మైలేజీ పొందాలని తహతహలాడుతోంది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతం వారద ముంపు బారిన పడకుండా ఉండడానికి జగన్ హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాలే కారణమని గప్పాలు కొట్టుకుంటోంది. 3.44 కిలో మీటర్ల పొడవైన ఈ రిటైనింగ్ వాల్ మొత్తాన్ని జగన్ తన హయాంలోనే నిర్మించేశారని చెప్పుకుంటూ  తమ భుజాలను తామే చరిచేసుకుంటున్నారు.

 అయితే వాస్తవమేమిటంటే.. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చంద్రబాబు హయాంలో డీపీఆర్ సిద్ధమైంది. ఆయన హయాంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా ఆరంభమైంది. ఈ రిటైనింగ్ వాల్ ను మూడు దశలలో నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవైన ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మొదటి దశలో  రామలింగేశ్వర్ నగర్, రాణిగారి తోట వరకూ, రెండో దశలో రాణిగారి తోట నుంచి కనకదుర్గ వారధి వరకూ, మూడో దశలో కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకూ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మూడు దశలలో తొలి రెండు దశల నిర్మాణం చంద్రబాబు హయాంలోనే పూర్తి అయిపోయింది. అంటే మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవైన రిటైనింగ్ వాల్ లో తొలి రెండు దశలలో 2.28 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణం చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యింది. కృష్ణలంకను వరద ముంపు నుంచి కాపాడడానికి తలపెట్టిన ఈ రిటైనింగ్ వాల్ లో తొలి రెండు దశల నిర్మాణం చాలా సంక్షిష్టమైనది. చంద్రబాబు హయాంలో  ఈ సంక్షిష్ట నిర్మాణం పూర్తఅయిపోయింది. వాస్తవానికి మూడో దశ కూడా ఆయన హయాంలోనే పూర్తి కావలసి ఉంది. అయితే వైసీపీ ఇక్కడ తన మార్క్ రాజకీయానికి తెరలేపింది.  

అప్పటికి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మూడో దశ రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే స్థానికులను రెచ్చగొట్టింది. వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ, నష్టపరిహారం ఇస్తామని బాబు సర్కార్ హామీ ఇచ్చినా వారు అందుకు అంగీకరించకుండా చేయడమే కాకుండా కోర్టులలో కేసులు వేసేలా వారిని పురిగొల్పింది. దాంతో బాబు హయాంలో మూడో దశ నిర్మాణం పూర్తి కాలేదు. 

ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణలంక రిటైనింగ్ వాల్ మూడో దశ నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పట్లో విపక్షంలో ఉన్న తెలుగుదేశం.. ఆ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కృష్ణలంక వరద ముంపు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడుతుంది కనుక నిర్మాణాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని భావించింది.   2019 ఆగస్టులో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలలో కృష్ణ లంక సురక్షితంగా ఉండడానికి రిటైనింగ్ వాలే  కారణం. అది వేరే సంగతి. 

ఇప్పుడు వైసీపీ కృష్ణలంక వరద ముంపు నుంచి సురక్షితంగా ఉండడానికి తాము నిర్మించిన రిటైనింగ్ వాలే కారణమని చెప్పుకుంటోంది. రిటైనింగ్ వాల్ మూడు దశల నిర్మాణం తమ హయాంలోనే పూర్తయ్యిందని చెప్పుకోవడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. గత రెండు రోజుల నుంచీ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం ఘనత అంతా జగన్ ఖాతాలో వేసేయడానికి గత రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా నానా రకాలుగా తంటాలు పడుతోంది. 2019 జూన్ లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ 2019 ఆగస్టు నాటికి కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేశారని చెప్పుకుంటూ జనాలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే జగన్ తన ఐదేళ్ల కాలంలో బటన్ నొక్కడం వినా మరో పని చేయలేదన్న సంగతి జనాలను స్పష్టంగా తెలుసు. సొంత సోషల్ మీడియాలో ఎంతగా గప్పాలు కొట్టుకున్నా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.  అయినా కూడా ప్రస్తుత వరదల సమయంలో కూడా ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సొంత డబ్బా వాయించుకోవడానికి జగన్ పార్టీ పడుతున్న ప్రయాసను చూసి జనం చీదరించుకుంటున్నారు.