ఓహో.. జగన్ టూర్ వాయిదా ఇందుకా?

మామూలుగా అయితే జగన్ ఈపాటికి లండన్‌లో విహరిస్తూ వుండాలి. కానీ అలా జరగలేదు. ఈనెల 3 నుంచి 25 వరకు లండన్‌కి వెళ్ళిరావడానికి సీబీఐ కోర్టు నుంచి జగన్ పర్మిషన్ తీసుకున్నారు. నిజానికి ఆయన మాటమాటకీ లండన్ ఎందుకు వెళ్తున్నారోగానీ, ఈసారికి మాత్రం కుమార్తె పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నట్టుగా పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ వచ్చిన దగ్గర్నుంచి సామాను సర్దుకునే పనిలో వున్న జగన్, మిగతా విషయాలేవీ పట్టించుకోకుండా ప్రయాణం మీదే దృష్టిపెట్టారు. కేసులు ముంచుకొస్తున్నా, తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నా, తాను తిరిగి వచ్చేసరికి పార్టీ మొత్తం ఫినాయిల్ వేసి కడిగినట్టు క్లీన్ అయ్యే అవకాశాలు వున్నాయని అర్థమవుతున్నా ఎంతమాత్రం పట్టించుకోకుండా, నివారణ చర్యలేవీ చేపట్టకుండా లండన్ గురించే ఆలోచిస్తున్నారు. అలాంటి జగన్ మూడో తారీఖున లండన్‌కి చెక్కేయాల్సి వున్నా ఆ పని చేయలేదు. ఇదేంటబ్బా అనుకుంటే, ఆయన భజన బ్యాచ్ ఒక పాయింట్‌ని ప్రచారం చేయడం ప్రారంభించారు. విజయవాడ వరదల్లో మునిగిపోయింది కాబట్టి వాళ్ళని పరామర్శించి, ఆదుకోవడానికే జగన్ లండన్ టూర్‌ని వాయిదా వేసుకున్నారు అని చెప్పుకుంటూ తిరిగారు. పోనీలే, వరద బాధితులను ఆదుకుంటారేమో అని కొంతమంది అమాయకులు అనుకున్నారు. జనాన్ని పరామర్శించడం అనే పేరుతో బయటకి వచ్చిన జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విషం కక్కడం మినహా చేసిందేమీ లేదు. మూడో తారీఖు అయిపోయింది.. నాలుగో తారీఖు అయిపోయింది.. ఐదో తారీఖు కూడా అయిపోయింది. రోజులు గడిచిపోతున్నాయిగానీ, జగన్ లండన్ వెళ్ళడం లేదు. తాను లండన్‌కి వెళ్తే పార్టీ ఖాళీ అయిపోతుందన్న భయంతో జగన్ లండన్‌కి టూర్ రద్దు చేసుకున్నారా అనే సందేహాలు కలుగుతున్న నేపథ్యంలో అసలు విషయం బయటకి వచ్చింది.

అదేంటంటే, జగన్ పాస్‌పోర్టు రద్దయింది. ఇంతకాలం జగన్‌కి ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాట్ పాస్‌పోర్టు వుండేది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి డిప్లొమాట్ పాస్‌పోర్టు రద్దయింది. జగన్ మళ్ళీ సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగన్‌కి సంవత్సరం చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీని మీద జగన్ అప్పీల్ చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు రావాలి.. ఆ తర్వాత పాస్‌పోర్టు రావాలి. అప్పుడే జగన్ టూర్ వుంటుంది. మరి ఈ వ్యవహారం మొత్తం పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో... అప్పటికి సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతి గడువు పూర్తి అవుతుందేమో అనే సందేహాలు కూడా వున్నాయి.