మన న్యాయ వ్యవస్థ పవర్ ఇది!

మన భారతీయ న్యాయ వ్యవస్థ చలా గొప్పది. అపరాధులను వదిలిపెట్టదు. నిర్దోషులను శిక్షించదు. న్యాయం విషయంలో తన, పర భేదం చూపించదు. ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ వున్న దేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వించాలి. మన న్యాయ వ్యవస్థ మీద మనకున్న గౌరవాన్ని మరింతగా పెంచే సంఘటన బిహార్‌లో జరిగింది. 34 సంవత్సరాల క్రితం 20 రూపాయల లంచాన్ని డిమాండ్ చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ని వెంటనే వెతికి అరెస్టు చేయాలని గౌరవనీయులైన న్యాయమూర్తి గారు ఆదేశించారు. నేరం అనేది చిన్నదా.. పెద్దదా అనేది ముఖ్యం కాదు.. నేరం చేసిన వారికి శిక్ష పడాలి. ఇది ముఖ్యం. 

అసలేం జరిగిందంటే, 1990లో.. అంటే 34 సంవత్సరాల క్రిందట బిహార్‌లోని సహర్సా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించే సురేష్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ ప్లాట్‌ఫామ్ మీద కూరగాయల మూటతో వున్న సీతాదేవి అనే మహిళని ఆపాడు. తనకు 20 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె అతనికి 20 రూపాయలు ఇస్తున్న సమయంలో రైల్వేస్టేషన్ ఇన్‌ఛార్జ్ చూశాడు. కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు. 1999లో సురేష్ ప్రసాద్ బెయిల్ మీద బయటకి వచ్చి పరారయ్యాడు. దాంతో అతని బెయిల్ రద్దు చేసి అరెస్టు వారెంట్ జారీ చేశారు. సురేష్ ప్రసాద్ తప్పు అడ్రస్ ఇవ్వడంతో అతని ఆచూకీ దొరక్క పోలీసులు ఇప్పటికీ అతని కోసం వెతుకుతూనే వున్నారు.

ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసు గౌరవనీయ న్యాయస్థానం దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచాలని డీజీపీని ఆదేశించింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న కేసుల పరిష్కరించాలన్న సదుద్దేశంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ నిందితుడు సురేష్ ప్రసాద్ దొరకాలి. అతని నేరానికి తగిన శిక్ష పడాలి.