వేసవి కాలంలో ముఖ సౌందర్యాన్ని చెక్కు చెదరనివ్వని కొరియన్ బ్యూటీ టిప్స్!
ఈ మధ్యకాలంలో కొరియన్ అమ్మాయిల అందం వైపు ప్రపంచమంతా దృష్టి సారిస్తోంది. కొరియన్ అమ్మాయిల ముఖం గాజు లాగా మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి అందం కోసం రకరకాల ప్రయోగాలు చేసే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకునే అయిదు బ్యూటీ టిప్స్ ఫాలో అయితే అచ్చం కొరియన్ అమ్మాయిల్లా యవ్వనంగా, మచ్చలేని గాజు లాంటి చర్మం సొంతమవుతుంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..
డబుల్ క్లెన్సింగ్ ..
కొరియన్ చర్మ సంరక్షణలో డబుల్ క్లెన్సింగ్, సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్ కీ పాయింట్స్. డబుల్ క్లెన్సింగ్ అంటే ముందుగా ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ని, తర్వాత నీటి ఆధారిత క్లెన్సర్‌ని ఉపయోగించడం. ఇలా చేయడం ద్వారా మీ చర్మాన్ని పొడిబారకుండా మలినాలను, మేకప్‌ను, అదనపు నూనెను తీసివేయడం సులువుగా ఉంటుంది. భారతీయుల చర్మం ఎక్కువగా కాలుష్యానికి, నూనె, మలినాలకు గురవుతూ ఉంటుంది. అందుకే ఈ రకమైన చర్మానికి డబుల్ క్లీన్సింగ్ బాగా పనిచేస్తుంది. చర్మాన్ని పొడిగా లేదా చికాకు కలిగించకుండా శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్స్‌ఫోలియేషన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్‌ని వదిలించుకోవడానికి, చర్మం తాజాగా కనిపించేలా చేయడానికి ముఖ్యమైన దశ.
స్కిన్ హైడ్రేషన్..
ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం రంగు కావాలంటే చర్మానికి హైడ్రేషన్ కీలకం. తేలికైన, హైడ్రేటింగ్ ఉత్పత్తులైన ఎసెన్స్‌లు, సీరమ్‌ల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కొరియన్లు ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులలో సోయాబీన్ పదార్దాలు, బియ్యం నీరు, గెలాక్టోమైసెస్ వంటి పులియబెట్టిన పదార్ధాలు ఉంటాయి. ఇవి మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం మీద హెవీగా లేకుండా, జిడ్డు కలిగించకుండా లోతుగా చొచ్చుకుపోతాయి. బయో-రీమోడలింగ్, హైడ్రోస్ట్రెచ్ థెరపీ వంటి అధునాతన పద్ధతులు తేమ నిలుపుదలని మరింత మెరుగుపరుస్తాయి. ముఖం మీద గీతలను, ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు..
వాతావరణ కాలుష్యం కారణంగానూ, జీవనశైలి కారణంగానూ ఎదురయ్యే అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు తరచుగా విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్, నియాసినామైడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంటాయి. ఈ పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి, మంటను తగ్గించడానికి, చర్మం రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి.
షీట్ మాస్క్‌లు..
షీట్ మాస్క్‌లు కొరియన్ చర్మ సంరక్షణ అలవాట్లలో ఒక ముఖ్యమైన భాగం. హైలురోనిక్ యాసిడ్, కొల్లాజెన్, గ్రీన్ టీ, దోసకాయ, రాయల్ జెల్లీ, బొగ్గు, ముత్యాలు వంటి సహజ పదార్ధాలు ఇందులో ఉపయోగించబడతాయి. షీట్ మాస్కులు ఇన్స్టంట్ అందాన్ని కూడా ఇస్తాయి.
లేయరింగ్ పద్ధతులు
కొరియన్ బ్యూటీ పద్దతులలో లేయరింగ్ పద్దతి ముఖ్యమైనది. ముందుగా టోనర్‌లు, ఎసెన్స్‌లు, సీరమ్‌లు, క్రీమ్‌ల వంటి మందమైన తేలికపాటి ఉత్పత్తులను లేయరింగ్ చేయడం ద్వారా చర్మాన్ని యంగ్ గా ఉంచుకోవచ్చు. దీని వల్ల ముఖ చర్మం యవ్వనంగా, డీహైడ్రేట్ కాకుండా తేమతో కూడి ఉంటుంది.
*రూపశ్రీ.