పాదాలు బాగా పగిలి ఇబ్బంది పెడుతున్నాయా... అయితే మీకోసమే ఈ టిప్స్!
మహిళలు ఆరోగ్యం కంటే ఎక్కువగా అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. జుట్టు, ముఖం, పెదవులు, కనుబొమ్మలు, గోళ్లు ఇలా చాలా విషయాల్లో ఎన్నెన్నో టిప్స్ పాటిస్తారు. అయితే ఇన్ని టిప్స్ ఫాలో అయ్యే మహిళలు తమ పాదాల సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. ఏ చెప్పుల షాపుకో వెళ్ళినప్పుడు, పట్టీలు వంటివి దరిస్తున్నపుడు తప్ప కాళ్ళ వైపు చూసేవారు కూడా తక్కువే అనుకోవచ్చు. ఈ కారణంగా మహిళల్లో పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఇది పాదాలు పొడిబారడంతో మొదలయ్యి మడమలు పగుళ్లు, కాల్లస్‌లకు దారితీస్తుంది. పగిలిన మడమల వల్ల అంతగా ఆందోళన చెందాల్సిన పని లేకపోయినా అవి ఎబ్బెట్టుగానూ, కొన్నిసార్లు నొప్పి పుట్టి ఇబ్బందిని కలిగిస్తాయి.
పాదాల పగుళ్లు సాధారణం కంటే లోతుగా ఉన్నప్పుడు నడవడం కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది. కొందరి పాదాలు ఎంతో సుకుమారంగా, అందంగా ఎలాంటి పగుళ్లు లేకుండా ఉంటాయి. అది అందరికీ సాధ్యం కాదేమో అని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. పాదాల పగుళ్లు తగ్గి, ఆరోగ్యంగా మారేందుకు మూడే మూడు చిట్కాలు పాటిస్తే చాలు.
స్నానం చేసిన తరువాత పాదాలను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఉదయం రాత్రి రెండు పూటలా పాదాలకు కూడా మాయిశ్చరైజర్ రాయాలి. మాయిశ్చరైజర్ వల్ల సరిపడినంత మృదుత్వం లభించడం లేదని అనిపిస్తే వెజిలైన్ లేదా ఇతర వైట్ పెట్రోలియం జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. దీన్ని రోజూ క్రమం తప్పకుండా పాటిస్తుంటే తొందరలోనే మిగిలిన పాదాలు సాధారణ స్థితికి వస్తాయి.
బాగా పొడిబారి, పగిలిన మడమల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన సాక్స్‌లను ఉపయోగించవచ్చు. వీటిని మాయిశ్చరైజింగ్ సాక్సులు అంటారు. వీటిలో కలబంద, విటమిన్ ఇ, షియా బటర్ వంటి పదార్థాలు ఉంటాయి, ఇవి పాదాల చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచగలుగుతాయి.
కాలి పగుళ్లు నయం అయిన తర్వాత, పాదాలకు పెడిక్యూర్ చేసుకోవాలి. ఇది బ్యూటీపార్లర్లలోనే లభిస్తుందని అనుకుంటే పొరపాటే. వారంలో ఒకసారి అయినా ఇంటి పట్టున ఉన్నప్పుడు పెడిక్యూర్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం తక్కువ ధరలోనే కావలసిన పదార్థాలు లభిస్తాయి. వీటన్నింటికి బదులుగా పాలు, తేనె మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు .పాదాలను నానబెట్టిన తరువాత , ప్యూమిస్ స్టోన్ ను ఉపయోగించడం వల్ల పాదాలను నునుపుగా మార్చవచ్చు.
సాధారణమైన ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే చర్మసంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలాటి సమస్యలు ఎదురవుతాయి. మిగిలిన పాదాల చర్మాన్ని చేత్తో లాగడం చేయకూడదు. పాదాల సంరక్షణకు ఓపిక చాలా ముఖ్యం కాబట్టి మొదట్లో ఓపికగా పగుళ్లను నివరించుకుంటే.. ఆ తరువాత దాన్ని కాపాడుకోవడం సులువు అవుతుంది.
◆నిశ్శబ్ద.