వేసవి ట్యానింగ్ ను మంత్రించినట్టు మాయం చేసే ఫేస్ మాస్క్..

 

ట్యానింగ్ అమ్మాయిలకు చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇక వేసవికాలంలో అయితే దీని  ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. వేసవి ఎండకు జస్ట్ అలా బయటకు వెళ్లి రాగానే చర్మం రంగు మారిపోయి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పక్కపక్కనే పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యానింగ్ తొలగిపోయి ముఖం సాధారణ రంగులోకి రావాలన్నా.. ముఖ చర్మం చల్లగా ఉండాలన్నా ఈ కింద చెప్పుకునే మ్యాజికల్ ఫేస్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది. అదేంటో ఓ లుక్కేస్తే..

గుడ్డు శరీరానికి మంచి పోషణ ఇవ్వడమే కాదు.. సౌందర్య సాధనంగా వాడితే చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.  వేసవిలో ఎదురయ్యే ట్యానింగ్, పిగ్మెంటేషన్ కు గుడ్డు బెస్ట్ ఆప్షన్. బంగాళాదుంప ఎగ్ మాస్క్ వేయడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

ఎగ్, బంగాళాదుంప ఫేస్ మాస్క్..


పచ్చి బంగాళాదుంపను తురమాలి. దీన్ని వడగడితే బంగాళాదుంప రసం వస్తుంది్. ఈ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గుడ్డును తీసుకుని దాన్ని పగలగొట్టి దాన్నుండి తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. తెల్లసొనను బంగాళాదుంప రసంలో వేసి బ్లెండర్ సహాయంతో బాగా గిలక్కొట్టాలి. ఇది బాగా గిలక్కొట్టాక మెత్తని పేస్ట్ లాగా తెల్లని క్రీమ్ లాగా మారుతుంది.


మొదట ముఖాన్ని శుభ్రమైన నీటితో కుడుక్కుని తుడుచుకోవాలి. శుభ్రం చేసుకున్న ముఖం మీద గుడ్డు పేస్ట్ ను ప్యాక్ లాగా వేసుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటూ అలాగే ఉంచి  ఆ తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖ చర్మం మెరుస్తుంది. ట్యానింగ్ మంత్రించినట్టు మాయమవుతుంది.


                                                 *నిశ్శబ్ద.