శీతాకాలంలో చుండ్రు పెరుగుతోందా...ఈ మిస్టేక్స్ చేస్తున్నట్టే..!

జుట్టు ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు ఏదైనా ఉందంటే అది చుండ్రు. చుండ్రు తల చర్మాన్ని చాలా ఇర్రిటేట్ చేయడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలహీనం కావడానికి, హెయిర్ ఫాల్ కావడానికి కారణం అవుతుంది. అంతేకాదు చుండ్రు ఉన్నప్పుడు జుట్టు పెరుగుదల కూడా సాధారణం కంటే కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టును చాలా దెబ్బతీయడంలో చుండ్రు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాంటి చుండ్రు సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో విజృంభిస్తుంది. హెయిర్ ఫాల్ చలికాలంలో ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే చలికాలంలో చుండ్రు పెరగడానికి రోజువారీ చేసే మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఈ మిస్టేక్స్ కారణంగా చుండ్రు పెరిగి జుట్టు నాశనం కావడానికి దారి తీస్తుంది. చుండ్రు పెరగడానికి కారణమయ్యే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే..
చల్లగాలి..
శీతాకాలం గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. తలపై చర్మపు తేమ వేగంగా తగ్గుతుంది. ఇది చర్మం రక్షణ పొరను బలహీనపరుస్తుంది. మలాసెజియా ఫంగస్ చురుగ్గా పెరుగుతుంది. దీని వల్ల మందపాటి పొరలు ఏర్పడతాయి. ఇదే చుండ్రు.
వేడి నీటి స్నానం..
శీతాకాలంలో వేడి నీటి స్నానం చాలా మందికి ఊరటగా అనిపిస్తుంది. కానీ అది తలపై చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. దీని ఫలితంగా దురద, ఎరుపు, ఫంగస్ పొరలు పెరగడం వంటివి జరుగుతాయి.
తక్కువ తల స్నానం..
చలికాలంలో తలస్నానం చేయడం తగ్గిస్తుంటారు. దీనివల్ల నూనె పేరుకుపోతుంది, చర్మం మృతకణాలు పేరుకుపోతాయి, ఫంగస్ పెరుగుతుంది.
నూనె వాడకం..
శీతాకాలంలో బరువుగా ఉన్న నూనెలు రాయడం వల్ల ఫంగస్ పెరుగుతుంది. ఫలితంగా దురద ఎక్కువగా రావడం, మందంగా పొలుసులు రావడం, చుండ్రు తగ్గినట్టే తగ్గి తిరిగి రావడం జరుగుతుంది.
హెయిర్ క్యాప్..
చలి భరించలేక చాలామంది తలకు టోపి లేదా క్యాప్ లాంటివి ధరిస్తుంటారు. ఇవి ధరించినప్పుడు వేడి, చెమట పేరుకుపోతుంది. ఫంగస్ పెరగడానికి ఇది కారణం అవుతుంది.
ఎక్కువ వేడి..
చలికారణంగా తేమ తక్కువగా ఉన్నప్పుడు.. ఆ చలి నుండి ఉపశమనం కోసం చాలామంది వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడుతుంటారు. దీనివల్ల మరింత పొడిబారి ఫంగస్ పెరుగుతుంది.
హెయిర్ స్టైలింగ్ మిస్టేక్స్..
బ్లో డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు తల చర్మం నుండి తేమను తొలగిస్తాయి. దీని వలన చుండ్రు పెరుగుతుంది.
కండిషనింగ్ మిస్టేక్స్..
చాలామంది తలకు కాకుండా కేవలం జుట్టుకు మాత్రమే కండిషనింగ్ చేస్తారు. దీనివల్ల తల చర్మం మరింత ఎండిపోతుంది.
తక్కువ నీరు త్రాగడం..
శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం, తల చర్మంలో తేమ తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారి చుండ్రు పెరుగుతుంది.
విటమిన్ డి లోపం..
శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా తలపై చర్మ రోగనిరోధక శక్తి బలహీనపడి ఇన్ఫెక్షన్ త్వరగా పెరుగుతుంది.
*రూపశ్రీ.



