ప్రతి ప్రశ్నకీ జవాబు ఉండదని ఆమెకి తెలిసినా, మిత్ర విషయంలో సైతం  ఇలాంటి చనువు తీసుకోగల యువతి ఆమె.    

 

     బయటి  ప్రపంచానికి చాలా ముభావంగా కనిపించే వనిత మిత్ర ముందు  నిర్మొహమాటంగా మాట్లాడగలదు.

 

    " మీరు జవాబు చెప్పలేదు మిత్రా!"

 

    " మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను కదూ!"

 

    " ఏ  విషయంలో?"

 

    క్షణం నిశ్శబ్దం తరువాత అన్నాడు.

 

    "అమ్మకోసం ఓనర్స్ ని అరేంజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను."

 

    " ఏం? నేను సపర్యలు చేయడంలో ఫెయిలవుతున్నానా?"

 

    "అహ...మీ చేత సేవలు చేయించుకోవడం సమంజసంగా అనిపించడం లేదు."

 

    "ఇది సరికొత్త స్టేట్ మెంట్ కాదు."

 

    " వనితా.... మేం మీ యింటి అడుగు పెట్టింది యాచకుల్లా...."

 

    "ప్లీజ్!" అరింపులా అనలేదామె. గొంతులో కొద్దిపాటి కోపం ధ్వనించింది. "అలా మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను!"

 

    " కావచ్చు . కాని ఇది వాస్తవం."

 

    " మీరూ మా ఫ్యాక్టరీస్ కోసం కాని, మా ఆశ్రమం కోసం కాని చాలా శ్రమపడుతున్నారుగా? ఒకవేళ నా తల్లే ఆమె స్థితి లో ఉంటే?"

 

    "అదికాదు వనితా..."

 

    " పోనీ ఓ పని చేయకూడదూ?"

 

    "చెప్పండి"

 

    "పెళ్ళి చేసుకోరాదూ?" ఎప్పుడూ లేనిది    ఈ రోజు ఆమె హఠాత్తుగా యిలాంటి ప్రసక్తి తెచ్చింది.  " మరేంలేదు. అలా అయితే మీకు భార్య రావడమేకాక, కోడలిగా మీ అమ్మగారికీ సేవ చేస్తుందిగా."

 

    వాతావరణాన్ని తేలిక పరుస్తున్నట్టు మృదువుగా నవ్వేశాడు. "చెప్పండి. ఎవరన్నా అమ్మాయుందా?"

 

    " ఏం.... మీ జీవితంలో ఎవరూ లేరా?"

 

    ఉలికిపాటుగా చూశాడు.  మేనక విషయం ఇంతదాకా ఆమెతో ఏనాడూ ప్రస్తావించలేదు.

 

    "ఫర్వలేదు మిత్రా!మీరు అడిగితే ఏ అమ్మాయి కాదనదు."

 

    "ఇక పడుకుందామా?"

 

    "వాక్య ప్రయోగం బాగోలేదు."

 

     అప్పుడు బోధపడింది తన వాక్యంలోని పొరుపాటు. " నా ఉద్దేశం ఎవరికి వాళ్ళం రిలాక్సవుదామని."

 

    "తెలుసుమిత్రా! మీ కారెక్టర్ మీద నాకు చాలా నమ్మకం వుంది."

 

    ఆమెకు వారం రోజుల క్రితం  జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది.

 

     ఉదయం టబ్ లో స్నానం చేసి బయటికి  వస్తూ నేలమీదున్న సోప్ పైన కాలుంచి జారిపడింది అప్పుడు ఆమె పెట్టిన కేకకి అసంకల్పితంగా బాత్ రూంలో అడుగుపెట్టిన మత్ర ఆమె నగ్నంగా ఉందన్న విషయం సైతం గమనించకుండా చేతులతో పైకెత్తి బెడ్ పైన పడుకోబెట్టాడు.

 

     ఆ తరువాత రిలాక్సిల్ నడుముకు రాయబోతూ   ఆగిపోయాడు. డాక్టర్ కిఫోన్ చేస్తానంటూ వెళ్ళబోయాడూ. కాని, వారించింది అవసరం లేదంటూ.మూడు రోజులపాటు తన కళ్ళలోకి చూడలేకపోయాడు.

 

     "మిత్రా!" ఆ సంఘటనను మననం చేసుకుంటూ  అంది. "నేను అందంగానే ఉంటాను కదూ?"

 

      తల పంకించాడు మొహమాటంగా.

 

    "అలాంటప్పుడు  నగ్నంగా ఉన్న నన్ను తీకీ మీరు రియాక్ట్ కాలేదు.ఎట్లీస్ట్ రియాక్టయినట్టు కనిపించలేదు. ఎస్ మిత్రా.... వయసులో ఉన్న అమ్మాయితో అలాంటి అనుభవం  ఎదురయ్యాకకూడా మీలా నిగ్రహాన్ని  ప్రకటించాలి అంటే- అయితే నపుంసకుడన్నా అయ్యుండాలి, లేదా తాత్వికుడు అననుగాని మరో అమ్మయికోసం పవిత్రంగా మిగిలిపోవాలి అన్న భావమయినా  మిమ్మల్ని డామినేట్ చేసి ఉండాలి  కదూ?"

 

    " వనితా! ఇప్పుడదంతా దేనికి?"

 

    "కావాలి. మిత్రా ఇన్నాళ్ళూ మీతో చనువుగా ఉంటూ మీగురించి చాలా తక్కువ తెలిసిన నేను,ఇప్పుడు చాలా మాట్లాడాలి. మాట్లాడాలనుకుంటున్నాను కూడా."

 

    నిరుత్తరుడైచూస్తున్నాడు.

 

    " వనితా!"

 

    " ఈ రోజు  మేనక అనే ఓ.ఐ.పి.యస్, ఆఫీసరు మీ దగ్గరకు వచ్చిందికదూ?"

 

     నిశ్సబ్దం.

 

    "ఆమె వచ్చింది ఎందుకయినా నీ గురించి -అంటే మీ ఇద్దరి  గురించేకాక నాకు తెలీని మీ వ్యక్తిగతమయిన జీవితం గురించి చాలా తెలిసిపోయింది.సభ్యత కాకపోయినా అంతా విన్నాను మిత్రా!"

 

    అతని నుదుటి పైన స్వేదం.

 

    "తొలిసారి తెలిసింది మీరూ ఎస్కేపిస్టని."

 

    "నో.... ఇది ఎస్కేపిజంకాదు.కసి. నిన్న నాకు, నా కుటుంబానికి జరిగిన పరాభవానికి నేను తీసుకుంటున్న ప్రతీకారం!"

 

    " తీసుకుంటున్నది ఎవరిపైన? వ్యక్తిపైనా, వ్యవస్థపైనా?"

 

    "వ్యవస్థలోని కొందరు వ్యక్తులపైన."

 

    " అందుకోసం మీరూ వాళ్ళ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు."

 

    "తప్పదు! చట్టంద్వారా దెబ్బతిన్న నేను ఆ చట్టంద్వారా వాళ్ళపైన దెబ్బతీయాలనుకుంటున్నాను."

 

    " అంటే?" నిర్లిప్తంగా నవ్వేసింది. "నేరవ్యవస్థను ఢీకోటానికి మీరూ నేరవ్యవ స్థలో చిక్కుకున్నారు. మిధ్యావాదం."

 

    "నో!"

 

    " పోనీ మధ్యతరగతి మనస్తత్వం" మృదువుగా అంది. మిత్రా! నేరవ్యవస్థ ఓ వలలాంటిది. చాలా చిన్నవాడు ఆ రంధ్రాల్లో నుంచి దూరిపోతాడు. బలవంతుడు వలనిచించి బయటపడుతుంటాడు. మీరున్నది అదేస్థితిలో కదూ?"

 

    "వనితా!" టక్కున ప్రసక్తి మార్చాడు. " మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు?"