అమ్మాయిల అందాన్ని పెంచే రహస్య చిట్కాలు!

పండు పండు పండు ఎర్ర పండు యాపిల్ దీని పేరు.. అని నాగార్జున పాడతాడు. యాపిల్ పిల్లా నీవెవరో.. ఐస్ క్రీమ్ చెలియా నీవెవరో అని ఇంకొక హీరో అందుకుంటాడు.. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ అని సంథింగ్ చేంజ్ చేస్తాడు రవితేజ.. మొత్తానికి ఫ్రూట్స్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఫ్రెష్ గా తాజాగా ఉన్నట్టు అమ్మాయిలు కూడా ఎంతో తాజాగా ఉండాలి. అప్పుడే వారిలో ఆరోగ్యం  కూడా బహుబాగుగా ఉంటుంది. అయితే అమ్మాయిలు ఎండిపోయిన పండ్లలా కనిపిస్తే ఏం బావుంటుంది. ఏడ్చినట్టు ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అందరూ కిందా మీదా పడిపోనక్కర్లేదు..

ఈ చలికాలం అధిరిపోయే గిఫ్ట్ తీసుకొచ్చింది అమ్మాయిలకు. ఎక్కడ చూసినా కమలా పండ్లు కనులకు విందు చేసున్నాయి, వీటి లోపలి పండు తినడానికి పనికొస్తే వీటి తొక్క భలే మంచి స్కిన్ ప్రొటక్షన్ ఐటమ్ గా పనికొస్తుంది. ఇంతకూ కమలా పండ్లతో బ్యూటీ పెంచుకోవడం ఎలా.. అంటే ఇదిగో ఇలా..

ఇంతకూ కమలా పండ్లను చర్మ ఆరోగ్యం కోసం ఎందుకు ఉపయోగిస్తారు అంటే....

కమలా పండ్లలో విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కారణంగా ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. 
ఏముంటాయంటే...

కమలా పండ్లలో కాల్షియం, విటమిన్ ఎ, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫైబర్, ఖనిజ లవణాలు అయిన పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇంతేకాకుండా థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్ వంటి ఇతర అంశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా సిట్రస్ అని పిలుచుకునే విటమిన్ సి పుష్కలంగా నిండి ఉన్న పండు ఇది. శరీరంలో తేమ స్థాయిలను పట్టి ఉంచుతుంది. చర్మాన్ని, చర్మం మీద మచ్చలు, మొటిమలు మొదలైన వాటిని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి కమలా పండు మహిళల అందాన్ని మెరిపిస్తుంది. 

కమలా పండుతో అద్భుతమైన చిట్కాలు..

సాదారణంగా కమలాపండును తినేటప్పుడు తొక్కలు తీసి పడేస్తాం. అయితే ఆ తొక్కలను శుభ్రమైన ప్రదేశంలో ఎండబెట్టుకుని పొడిచేసుకోవచ్చు. ఇలా సహజంగా చేసుకునే పొడి మంచి ఫలితాలను ఇస్తుంది.

కమలా పండు రసం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు మంచి చర్మ రక్షణ కారకంగా కూడా పనిచేస్తుంది. కమలా పండు రసానికి వేపాకు పొడి లేదా వేపాకు రసం జతచేయాలి, ఇందులో కాసింత శనగపిండి వేసుకుని పేస్ట్ లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటివి ఈ ప్యాక్ వల్ల  తొలగిపోతాయి.

కమలా పండు తొక్కను పొడి చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ పొడి బెస్ట్ ట్యాన్ రిమూవర్ గా పనిచేస్తుంది. కమలా పండు తొక్కల పొడిని లేదా రసాన్ని స్నానం చేసేటపుడు నీటిలో కొద్దిగా వేసి ఆ నీటితో స్నానం చేస్తే చెమట వల్ల కలిగే చెడు వాసన పోతుంది. శరీరం మంచి రిలాక్స్ గా కూడా అనిపిస్తుంది.

కమలా పండు తొక్కలను ఉడికించి, చల్లారిన తరువాత ఆ నీటిని ఒక స్ప్రే బాటల్ లో వేసుకుని ఫేస్ క్లెన్సర్ గా ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు, మృతకణాలు తొలగిపోయి ముఖ చర్మం యవ్వనంగా మారుతుంది. 

ఇలా కమలా పండు తొక్కలు ఎంతగానో చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయి. ఇకపోతే వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే…

                                       ◆నిశ్శబ్ద.