అదిరే అదరాల కోసం..
ఎవరి ముఖమైనా చూడగానే మొదట కనిపించేది పెదాలు...ఎర్రని పెదవుల మధ్య నుంచి చిరునవ్వులు చిందించగానే ఎదుటివారికి అదో ఆత్మీయ పలకరింత. పెదాలు అందంగా ఉంటేనే మొహం అందంగా కనిపిస్తుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా పెదాలు అంద విహీనంగా ఉంటే ఉపయోగం లేదు. అదే ముఖం నల్లగా ఉన్నా పెదాలు ఎర్రగా ఉంటే ఆ కళే వేరు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పెదాలను మరింత అందంగా ఉంచుకోవటానికి ముఖ్యంగా అమ్మాయిలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. మార్కెట్లో కొత్తగా వచ్చిన లిప్‌బామ్‌లు, లిప్‌స్టిక్‌లు పూయడమే పనిగా పెట్టుకుంటారు...వీటి వల్ల అందం పెరగటం మాట అటుంచితే ధీర్ఘకాలంలో పెదవుల సౌందర్యం పాడయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువల సాయంతోనే పెదాలను అందంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం..
* బీట్‌రూట్ రసం తీసుకుని, దానికి మీగడ కలిపి పెదాలపై రుద్దాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో దానిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా అవ్వడంతో పాటు ముడతలు పోతాయి.
* మరీ పోడిబారిన చర్మతత్వం ఉన్నవారు ఒక చెంచా సెనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాల దగ్గర రాసి ఆరిన తర్వాత కడిగేయొచ్చు. నెమ్మదిగా సమస్య తగ్గుముఖం పడుతుంది.
* నిమ్మరసాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనే కలిపి రాసిన ప్రయోజనం ఉంటుంది.
* తాజాగా తీసిన కలబంద గుజ్జుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా ఉంచి తెల్లారి కడిగేయటం వల్ల పెదాల తగ్గుతుంది.
* పెదాలు రంగు మారడంతో పాటు తరచూ పగులుతుంటే రాత్రి పోడుకునే ముందు నెయ్యితో మర్ధన చేసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది.
* గులాబీ రెమ్మలను పేస్ట్‌గా చేసి, ఆ పేస్ట్‌కు కాసిన్ని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ వర్ణంలోకి మారి అందంగా ఉంటాయి.
* తరచూ నాలుకతో పెదాలను తడుపడం మానండి..దీని వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది.
* నీరు, తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.