జుట్టు బాగా రాలిపోతోందా...ఈ నాలుగు వాడితే సెట్!

నేటి కాలంలో చాలామంది  జీవనశైలి దారుణంగా తయారైంది.  బయటి ఆహారం,  పానీయాల కారణంగా  శరీరంలో ప్రతి భాగం ఊహించని ప్రతికూలతలు ఎదుర్కొంటుంది. ఇలా ప్రతికూలతలు కలిగే వాటిలో జుట్టు మరీ ముఖ్యమైంది. జుట్టు తెల్లబడటం, రంగు మారటం, చిన్నవయసులోనే బట్టతల, జుట్టు సామర్థ్యం తగ్గడం, పలుచగా మారడం ఇలా చాలా విధాలుగా జుట్టు దెబ్బతింటుంది.  ఇక జుట్టు రాలడం, తలలో చుండ్రు వంటి సమస్యల గురించి చెప్పక్కర్లేదు.  జుట్టు ఎక్కువగా రాలడం వల్ల బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆడవారిలో కూడా కనిపించడం చాలా విచారించాల్సిన విషయం.  దీని కోసం ప్రజలు అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్ లు తీసుకుంటారు.  కానీ ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ప్రభావం కనిపించడం లేదు. అయితే  శరీరం అంతర్గతంగా పోషకాలను పొందినప్పుడు మాత్రమే జుట్టు బలంగా ఉంటుంది.

 శరీరానికి ఏయే పదార్థాలు లభిస్తే జుట్టు బలంగా ఉంటుంది. వేటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుంటే వాటిని ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన, ధృడమైన జుట్టును పొందవచ్చు. అవేంటంటే..

క్యారెట్

విటమిన్ ఎ క్యారెట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లను బాగా  ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు హైడ్రేటెడ్ గా,  ఆరోగ్యంగా మారుతుంది. క్యారెట్ తినడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది.

గుడ్లు

గుడ్డులో ఉండే ప్రొటీన్లు జుట్టును లోపలి నుండి దృఢంగా మార్చుతాయి. గుడ్లలో కూడా బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టుకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. మీ జుట్టు రాలుతున్నట్లయితే, విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం  ఉంటుంది.

అవకాడో

అవకాడోలో పొటాషియం, బి విటమిన్లు,  ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు  జుట్టును మందంగా చేస్తాయి.కాబట్టి ఆహారంలో అవోకాడోను చేర్చడానికి ప్రయత్నించండి.

                                         *నిశ్శబ్ద