జుట్టును స్మూత్ గా మార్చే అలోవెరా సీరమ్.. ఇలా తయారుచేసేయండి..!
కలబంద ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఉంటుంది. మొక్కలు పెంచుకోవడానికి స్థలం లేనివారు చిన్న కుండీలలో అయినా సరే అలోవెరా మొక్కను పెంచుతూ ఉంటారు. చాలామంది దీన్ని పెంచడమే తప్ప దేనికి ఉపయోగించరు. కానీ అమ్మాయిలు మాత్రం బ్యూటీ చిట్కాలలో కలబందను విరివిగా వాడేస్తుంటారు. ముఖ సౌందర్య చిట్కాలలోనూ, జుట్టు సంరక్షణలోనూ కలబందను చాలా ఎక్కువగా వాడుతారు. జుట్టు స్మూత్ గా సిల్కీగా ఉండాలంటే అలోవెరాను వాడటం మంచిది. అలోవెరాలో కేవలం మూడు పదార్థాలు కలిపితే చాలు ఇంట్లోనే అలోవెరా సీరమ్ తయారైపోతుంది. దీనికోసం ఏం కావాలో.. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
తాజా అలోవెరా జెల్.. 1 స్పూన్..
రోజ్ వాటర్.. 2 స్పూన్లు..
బాదం నూనె.. 1 టీస్పూన్..
టీ ట్రీ ఆయిల్.. 4-5 చుక్కలు
పై పదార్థాలను అన్నింటిని ఒక కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మరీ జిడ్డుగా, చిక్కగా ఉండకూడదు. అలా అనిపిస్తే మరికాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ ను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు జుట్టు మూలాలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే సాధారణ నీటితో జుట్టును కడిగేయాలి. ఈ సీరమ్ ను కొన్ని రోజులపాటూ వాడుతుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
అలోవెరా సీరమ్ ప్రయోజనాలేంటంటే..
అలోవెరా జెల్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. తల చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. ఈ సీరమ్ ను అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. చీలిపోయిన జుట్టు చివర్లను రిపేర్ చేస్తుంది. ఇందులో రసాయనాలు ఏమీ ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి హాని కలిగించదు. పైపెచ్చు జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.