ముఖం మీద నల్ల మచ్చలు తగ్గించే ఫేస్ ప్యాక్ లు..!

 

 

మచ్చలేని ముఖ సౌందర్యం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇది చాలామందికి సాధ్యం కాదు.  జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల సమస్యలు అన్నీ కలిసి అమ్మాయిల ముఖం మీద మచ్చలు ఏర్పరుస్తాయి. వీటిని తొలగించుకోవడానికి చాలామంది వివిధ రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు.  అయితే ముఖం మీద మచ్చలు తొలగించడంలో కొన్ని ఫేస్ ప్యాక్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని ఇంటి పట్టునే ట్రై చేయవచ్చు కూడా.. ముఖం మీద నల్ల మచ్చలు పోగొట్టే ఆ ఫేస్ ప్యాక్ లు ఏంటో తెలుసుకుంటే..


శనగపిండి ఫేస్ ప్యాక్..


చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో చర్మంలోని మృతకణాలను తొలగించడంలో,  ముఖాన్ని అందంగా మార్చడంలో శనగపిండి  మంచి ప్రభావం  చూపుతుంది. దీనికోసం 2 చెంచాల శనగపిండి, ఒక చెంచా మిల్క్ క్రీమ్,  కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు.


పసుపు, పెరుగు..
 
మచ్చలను తగ్గించుకోవడానికి పసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్  ఉపయోగించవచ్చు. దీనికోసం 2 చెంచాల సాదా పెరుగు తీసుకుని అందులో ఒక చెంచా పసుపు కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. చర్మంపై మెరుపు ఉంటుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి.  పసుపులోని లక్షణాలు మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

కలబంద,  పసుపు..


కలబంద, పసుపు ఫేస్ ప్యాక్  ప్రభావం ముఖంపై బాగా  కనిపిస్తుంది. ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌లో అర టీస్పూన్ పసుపు కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. అలోవెరా చర్మానికి హైడ్రేటింగ్ ను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

తేనె  నిమ్మరసం..

 
2 చెంచాల తేనె,  ఒక చెంచా తాజా నిమ్మరసం రెండూ కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని  ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. మచ్చలను తగ్గించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,  నిమ్మకాయలోని ఆస్ట్రింజెంట్ గుణాలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తాయి.

ముల్తానీ మట్టి,  రోజ్ వాటర్..


మచ్చలను తగ్గించడానికి 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని తగినంత రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు ముఖంపై ఉంచి తర్వాత కడిగేయాలి. ముల్తానీ మట్టి ముఖంలోని అదనపు ఆయిల్ ను, మలినాలను తొలగించి చర్మానికి మెరుపును తెస్తుంది.


                                             *రూపశ్రీ.