ఎన్నేళ్లొచ్చినా యూత్ లాగా కనబడాలా? చియా గింజలను ఇలా వాడడండి..!

 

వయసు పెరిగే కొద్దీ యవ్వనం తగ్గిపోవడం కామన్.   కానీ ప్రజలు మాత్రం అందం మీద  ఆశ, దానికోసం పడే ఆరాటం మాత్రం వదలరు. ఇందుకోసం వందలు, వేల రూపాయలను పోసి క్రీములు, థెరపీలు తీసుకోవడం నుండి  ఇంటి చిట్కాలను పాటించడం వరకు ప్రతిదీ ఫాలో అవుతారు. అయితే వయసు పెరిగినా యూత్ లాగా కనబడాలంటే మాత్రం చియా గింజలు చక్కని ఆప్షన్. చియా గింజలను ఇలా ఉపయోగిస్తే యవ్వనంగా ఉండే చర్మం సొంతమవుతుంది.

చియా గింజలు పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, కాల్షియం,  మాంగనీస్ మొదలైనవి ఈ గింజల్లో ఉంటాయి. చియా సీడ్స్‌ను ముఖానికి సరిగ్గా వాడితే చర్మం మచ్చలు లేకుండా మెరుస్తూ ఉండటమే కాకుండా చర్మం యాంటీ ఏజింగ్ గుణాలను కూడా పొందుతుంది.

చియా విత్తనాలు, తేనె ఫేస్ ప్యాక్..

 చియా గింజలు, తేనె,  పెరుగు సమకూర్చుకోవాలి. అన్నింటిలో మొదటిది, చియా విత్తనాలను నీటిలో కలపాలి. ఈ గింజలు ఉబ్బినప్పుడు, వాటిని విడిగా గిన్నెలో ఉంచాలి. ఈ గింజలకు తేనె,  కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం కాంతివంతంగా మారుతుంది.


చియా గింజలు, కొబ్బరినూనె..

చియా గింజలు,  కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇందు కోసం, రెండు పదార్థాలను కలపాలి.  మందపాటి పేస్ట్ తయారుచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్ లా కూడా అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్ చేయడానికి ముందుగా నీళ్లతో ముఖాన్ని తడిపి, తర్వాత ఈ పేస్ట్‌ను ముఖంపై సర్క్యులేషన్ మోషన్‌లో 2 నిమిషాల పాటు రుద్దాలి.  తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే  డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడం ప్రారంభమవుతుంది.


చియా సీడ్స్  అలోవెరా..

 ఈ ఫేస్ ప్యాక్‌తో చర్మం చియా విత్తనాలతో పాటు కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  హైడ్రేటింగ్ లక్షణాలను పొందుతుంది. ఒక చెంచా నానబెట్టిన చియా గింజల్లో ఒక చెంచా అలోవెరా జెల్ కలపాలి. అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం నుండి ముడతలు, గీతలు తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.


                                              *నిశ్శబ్ద.