ఆరోగ్యకరమైన జుట్టు కోసం చాలా రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. తలకు పెట్టుకునే నూనె నుండి, షాంపూ, కండీషనర్ వాడటం వరకు.  విడిగా తమకంటూ టవల్ ఉపయోగించడం  నుండి.. తల స్నానం తరువాత జుట్టును ఆరబెట్టడం వరకు.. ఇలా ప్రతి దశలో చాలా కేర్ తీసుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవారు దువ్వెన విషయంలో మాత్రం పప్పులో కాలు వేస్తుంటారు. ఉపయోగించే దువ్వెన కూడా జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు చెక్క దువ్వెనలు వాడుతున్నారు.  ఇవి కూడా మేలు రకం చెక్కతో, ఆయుర్వేదం సూచించిన కలపతో తయారుచేసినవి ఉపయోగిస్తుంటారు.  ఇంతకీ చెక్క దువ్వెనలు ఉపయోగించడం వల్ల జరిగేదేంటంటే..

 ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువసేపు రబ్ చేసినప్పుడు అందులో నుండి విద్యుత్ పుట్టడం గమనించే ఉంటాం.  ప్లాస్టిక్ దువ్వెనలు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి.  ప్లాస్టిక్ దువ్వెనతో తలలో దువ్వెటప్పుడు అవి ఉత్పత్తి చేసే విద్యుత్ కారణంగా జుట్టు, తల చర్మం దెబ్బ తింటుంది. ఇది జుట్టు బలహీనం కావడానికి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. కానీ చెక్క దువ్వెనలతో ఈ సమస్య ఉండదు.  పైగా చెక్క దువ్వెనల దంతాలు పెద్దవిగా ఉండటం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది.

చెక్క దువ్వెన ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. ఇది తలలో తేమ నిలిచి ఉండటానికి సహాయపడుతుంది.

చెక్క దువ్వెన వెడల్పుగా, పెద్దగా ఉన్న దంతాలు కలిగి ఉంటుంది.  దీంతో దువ్వుడం వల్ల తలకు తేలిక పాటి మసాజ్ చేసినట్టు ఉంటుంది. అంతే కాదు.. జుట్టు చిక్కులను కూడా సులువుగా వదిలిస్తుంది. ఈ కారణంగా ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్, చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

చెక్క దువ్వెనలు జుట్టుకు సహజ నూనెలు సమాంతరంగా పంపిణీ అయ్యేలా చేస్తాయి.  ఇది జుట్టు ఆరోగ్యంగా, షైనింగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

చెక్క దువ్వెనలో ఎలాంటి రసాయనాలు ఉండవు.  ఇవి కొన్ని ఆయుర్వేదం సూచించిన కలపతో తయారవుతాయి. కాబట్టి ఇవి తల చర్మానికి మేలు చేస్తాయి తప్ప చర్మాన్ని దెబ్బతీయవు.  కాబట్టి అలర్జీలు వచ్చే అవకాశం తక్కువ.

ఆయుర్వేదంలో చెక్క దువ్వెనకు చాలా ప్రాముఖ్యత ఉంది.  పైగా చెక్క దువ్వెనలు ఉపయోగించడం పర్యావరణానికి కూడా మంచిది. ప్లాస్టిక్ దువ్వెనతో పోలిస్తే చెక్క దువ్వెనలు చాలా కాలం మన్నిక వస్తాయి.


                                          *రూపశ్రీ.