టానింగ్ తొలగించే సూపర్ సోప్.. ఇంట్లోనే ఇలా చేస్కోండి..!

 

వేసవి కాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు టానింగ్ గురించి ఆందోళన చెందుతారు. మండే ఎండలు చర్మాన్ని చాలా దెబ్బతీస్తాయి. దీని కారణంగా టానింగ్,  వడదెబ్బ వంటి సమస్యలు మొదలవుతాయి. టానింగ్ వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. దీన్ని తొలగించుకోవడానికి,  టానింగ్ సమస్య నుండి బయటపడటానికి చాలా చిట్కాలు,  మార్కెట్ ఉత్పత్తులు వాడతారు.  కానీ కొన్ని ఇంట్లోనే ఉన్న పదార్థాల సహాయంతో ఇంట్లోనే సబ్బును తయారు చేసుకుని టానింగ్ సమస్య నుండి బయటపడవచ్చు.   టానింగ్ సమస్య నుండి బయటపడటానికి ఇంట్లో సబ్బును ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే..

టానింగ్ సోప్ తయారీకి అవసరమైన పదార్థాలు..

గ్లిజరిన్ సబ్బు బేస్ - 1 కప్పు

నిమ్మరసం - 2 టీస్పూన్లు

పసుపు పొడి - 1 టీస్పూన్

అలోవెరా జెల్ - 2 టీస్పూన్లు

పచ్చి పాలు - 3 టీస్పూన్లు

గంధపు పొడి - 1 టీస్పూన్

రోజ్ వాటర్ - 1 టీస్పూన్

బాదం లేదా కొబ్బరి నూనె - 1 టీస్పూన్

నారింజ తొక్కల పొడి - 1 టీస్పూన్

సబ్బును ఎలా తయారు చేయాలంటే..

సబ్బు తయారు చేయడానికి ముందుగా గ్లిజరిన్ సబ్బు బేస్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కరిగించాలి. సోప్ బేస్ కరిగించడానికి డబుల్ బాయిల్ పద్దతి ఉపయోగించాలి.  అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు మరిగాక అందులో మరొక ఖాళీ గిన్నె పెట్టి అందులో సోప్ బేస్ వేసి ఆ వేడి మీద కరిగించాలి.  అది కరిగిన తర్వాత దానికి నిమ్మరసం, పసుపు, కలబంద జెల్, పాలు, గంధపు పొడి, రోజ్ వాటర్, కొబ్బరి నూనె,  నారింజ తొక్కల పొడి మొదలైనవి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి.  ఇప్పుడు దానిని సిలికాన్ మౌల్డ్ లేదా ప్లాస్టిక్ అచ్చులో పోయాలి. స్టీల్ గిన్నెలలో అయినా వేసుకోవచ్చు.  తరువాత 5 గంటలు అలాగే ఉంచండి. సబ్బు పూర్తిగా చల్లారిన తర్వాత, దానిని బయటకు తీయాలి. ఇది అచ్చం మార్కెట్లో కొన్న సోప్ లాగే కనిపిస్తుంది.  ఇందులో ఉపయోగించినవి అన్నీ సహజమైన పదార్థాలే.. పైగా చర్మానికి ఎంతో మేలు చేసేవి. కాబట్టి ఈ సోప్ ఉపయోగించడం వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి ముఖంపై సహజమైన మెరుపు కనిపిస్తుంది. ఈ సోప్ ను రెగ్యులర్ గా వాడుతూ ఉంటే చర్మం ఎంతో మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

                              *రూపశ్రీ.