ఎండ వల్ల చర్మం కందిపోయిందా...ఇలా చేయండి..!
ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళితే చాలు.. ఎండ మిట్టమధ్యాహ్నం కాస్తున్నట్టు ఉంటుంది. సూర్యుడి కిరణాలు మండుతున్న అగ్నిగోళంలా శరీరాన్ని తాకుతాయి. చాలా వరకు సున్నితమైన చర్మం ఉన్నవారు సూర్యుడి వేడి కిరణాల వల్ల చాలా ఇబ్బంది పడతారు. చర్మం ఎండ వేడికి కందిపోయి ఎర్రబడుతుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది వివిధ చిచ్కాలు ఫాలో అవుతుంటారు. అయితే ఎండ వేడికి కందిపోయిన చర్మానికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఈ కింద చిట్కాలు పాటించాలి.
కలబంద జెల్..
కలబంద చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్, చర్మానికి ఊరట ఇస్తుంది. ఎండలో కందిపోయిన ప్రదేశంలో తాజా కలబంద జెల్‌ను పూయడం వల్ల చికాకు తగ్గుతుంది, చర్మం చల్లబడుతుంది. దీన్ని రోజుకు 2-3 సార్లు అప్లై చేయాలి. దీని వల్ల చర్మం చల్లగా మారడమే కాకుండా చర్మం మీద టాన్ కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది.
చల్లని పాలు..
చల్లటి పాలలో ఒక గుడ్డను నానబెట్టి ఎండలో కందిపోయిన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. నిజానికి పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. సరిపడినన్ని పాలు లేకపోతే పాలలో కాస్త నీరు లేదా రోజ్ వాటర్ వంటివి మిక్స్ చేసుకోవచ్చు.
పెరుగు, పసుపు ప్యాక్..
పెరుగులో పసుపు కలిపి చర్మానికి అప్లై చేయాలి. ఈ పెరుగు, పసుపు ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుంది. పసుపు వాపును, ఎరుపును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. పెరుగు చర్మానికి మాయిశ్చరైజర్ లా మృదుత్వాన్ని ఇస్తుంది.
దోసకాయ రసం..
దోసకాయ చర్మానికి చాలా మేలు చేస్తుంది. వడదెబ్బ నుండి బయటపడటానికి, దోసకాయను పలుచని ముక్కలుగా కోసి, ఎండలో కందిపోయిన ప్రదేశంలో ఉంచాలి. లేదంటే దసకాయ రసాన్ని తీసి చర్మంపై పూత లాగా పూయవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం చల్లగా ఉంటుంది.
కొబ్బరినూనె..
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఎండలో కందిపోయిన ప్రదేశంలో కొబ్బరి నూనెను తేలికగా రాయాలి. ఇది చర్మం తేమను కాపాడుతుంది, చికాకును తగ్గిస్తుంది. దీనితో పాటు సన్‌బర్న్ లేదా టాన్‌ను తొలగించడానికి బేకింగ్ సోడా, ఓట్ మీల్, గ్రీన్ టీని కూడా ఉపయోగించవచ్చు.
*రూపశ్రీ.
