అరటిపండుతో ఇలా ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి.. ముఖం మెరిసిపోతుంది..!
అమ్మాయిలు చర్మ సంరక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో చాలా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఫేస్ ప్యాక్ లు. కొందరు శనగపిండి, పసుపు, పెరుగు వంటి వంటింటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేస్తుంటారు. మరికొందరు పండ్లతో ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేస్తుంటారు. పండ్లతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని వేసుకోవడం వల్ల ముఖ చర్మానికి పోషణ లభిస్తుంది. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. అరటి పండుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడితే అద్బుతమైన ఫలితాలు ఉంటాయట. అరటిపండుతో ఎన్ని రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవచ్చు? వాటిని ఎలా తయారు చేసుకోవాలంటే..
అరటిపండు- తేనె ఫేస్ ప్యాక్..
అరటిపండును బాగా గుజ్జులాగా చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత కడిగెయ్యాలి. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మానికి బాగా నప్పుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిచేలా చేస్తుంది.
అరటిపండు- పెరుగు..
బాగా పండిన అరటిపండులో రెండు చెంచాల పెరుగు వేయాలి. దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం మీద మచ్చలు తగ్గిస్తుంది. చర్మాన్ని టోన్ చేస్తుంది.
అరటి పండు- ఓట్స్..
అరటిపండు, ఓట్స్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. పండిన అరటిపండులో 2 చెంచాల ఓట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా కూడా మారుతుంది.
అరటిపండు-అలోవెరా..
అరటిపండు, అలోవెరా ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం చికాకులు తగ్గిస్తుంది. పండిన అరటిపండులో రెండు చెంచాల అలోవెరా జల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పేస్ ప్యాక్ వేసుకుని 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
అరటిపండు- పసుపు..
అరటిపండు, పసుపు ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మం మీద మచ్చలను తగ్గిస్తుంది. పండిన అరటిపండులో అరటీస్పూన్ పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
అరటిపండు- బాదం..
ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి చాలా మంచిది. చర్మానికి పోషణ ఇస్తుంది. పండిన అరటిపండులో నానబెట్టి తొక్క తీసి మిక్సీ వేసిన బాదం పేస్ట్ వేయాలి. లేదంటే పండిన అరటిపండుతో కలిపి నానబెట్టిన బాదం ను మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
*రూపశ్రీ.