హ్యాపీ బర్త్‌డే టూ సూపర్‌స్టార్ మహేశ్
on Aug 9, 2016
సూపర్‌స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి..ఇపుడు కృష్ణగారి అబ్బాయి మహేశ్ అన్న స్టేజ్ నుంచి మహేశ్ వాళ్ల నాన్న కృష్ణ అనే స్థాయికి ఎదిగారు. మహేశ్ ఈ స్థాయికి రావడం రాత్రికి రాత్రే జరిగిపోలేదు. సూపర్‌స్టార్ కొడుకు అన్న ట్యాగ్ లైన్ ఫ్లాట్‌ఫాం మీదకు రావడానికే సరిపోయింది. ఇక అక్కడి నుంచి తనను తాను నిరూపించుకోవాలి. కెరిర్ ప్రారంభంలోనే నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఈ సమయంలోనే సినిమా కష్టాలు అంటే ఎంటో పూర్తిగా తెలిసొచ్చింది. అప్పటి నుంచి పరిస్థితులకు తగ్గట్టు మారిపోయారు. నడక, నడత, డ్యాన్స్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ అంతా మార్చేశారు. ఒక నటుడిగా అన్ని రకాల వెరియేషన్స్ని చూపించారు. మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ సూపర్‌స్టార్ కొత్తగా కనిపించిన సినిమాల్లో కొన్ని మీ కోసం.
ఫాంటసీ-మురారి
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, మహేశ్ కాంభినేషన్లో వచ్చిన ఈ సినిమా మహేశ్‌లోని నటుణ్ణి తొలిసారిగా పరిచయం చేసింది. అమ్మవారి దేవాలయం, రెండు కుటుంబాల చుట్టు ఉన్న చిన్న మనస్పర్థ దాని చుట్టు అల్లుకున్న ప్రేమ వీటన్నింటి కలబోతగా మురారి అప్పట్లో ఫ్యామిలీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని "అలనాటి రామ చంద్రుని" అనే పాట..తెలుగునాట ప్రతి పెళ్లి సందడిలో వినిపించాల్సిందే.
ఫ్యాక్షన్-ఒక్కడు
అప్పటి వరకు సాదాసీదా విజయాలు దక్కించుకుకున్న మహేశ్‌కు అసలు సిసలు విజయం ఎలా ఉంటుందో రుచి చూపించిన సినిమా ఒక్కడు. ఫ్యాక్షన్ సినిమాలు జోరు మీదున్న టైంలో రిలీజైన ఈ సినిమా..అటు ఫ్యాక్షన్, ఇటు స్టూడెంట్ వార్, ఈ రెండింటి మధ్యలో అందమైన ప్రేమ కథ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. కబడ్డీ ఆటగాడిగా, ప్రేమికుడిగా మహేశ్ అద్బుతమైన నటన కనబరిచారు.
పరిపూర్ణమైన నటుడు-నిజం
మహేశ్ నట విశ్వరూపానికి నిలువెత్తు నిదర్శనం నిజం. అమాయకుడైన మధ్యతరగతి యువకుడిగా, తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునే పాత్రలో మహేశ్ జీవించాడనే చెప్పుకోవచ్చు. సినిమా పరాజయం పాలైనా మహేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అంతేకాకుండా ఆ ఏడాది ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్-అతడు
మహేశ్‌ను సరికొత్త లుక్‌లో చూపించిన సినిమా అతడు. అటు సస్పన్స్, ఇటు ఫ్యామిలీ, లవ్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల వెరియేషన్స్ ఉన్న సినిమాలో కేవలం లుక్స్‌తోనే సినిమాను నడిపించాడు మహేశ్. అందుకే మరోసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ వరించింది.
యాక్షన్-పోకిరి
క్లాస్ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న మహేశ్‌ను పోకిరిగా మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్ దుమ్ములేపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేశ్ పలికిన డైలాగ్స్ బుల్లెట్ల లాగా పేలాయి. అప్పట్లో 40 కోట్ల కలెక్షన్లతో మహేశ్ కెరిర్తో పాటు తెలుగు సినీ చరిత్రలో అల్‌టైమ్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది పోకిరి.
కామెడీ-దూకుడు, ఖలేజా
సీరియస్, యాక్షన్, ఫ్యామిలీ అన్ని ట్రై చేశాడు కానీ కామెడీ పండించలేదే అని అభిమానులు బాధ పడుతున్న టైంలో తనలోని కామెడీ కోణాన్ని ప్రజేంట్ చేశాడు మహేశ్. ఒక వూరిని కాపాడటానికి ఒక కుర్రాడు చేసే ప్రయత్నమే ఖలేజా. ఈ సినిమాతో నేను కామెడీ పండించగలనని నిరూపించిన మహేశ్, "దూకుడు" సినిమాతో ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రై చేశాడు. నేమ్ కార్డ్ పడిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు నవ్వుల పువ్వులు పూయించాడు.
ఎక్స్పరిమెంట్స్- నాని, వన్ నేనొక్కడినే
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేశ్ తండ్రి నుంచి స్పూర్తి పొందారు. అందుకే కెరిర్ మొదట్లోనే "నాని" సినిమాతో ఎక్సిపెరిమెంట్స్ ట్రై చేశాడు ప్రిన్స్. పదేళ్ల బాలుడు ఊహించకుండా 25 ఏళ్ల కుర్రాడు అయితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఆ తర్వాత "వన్ నేనొక్కడినే" అంటూ మరోసారి ప్రయోగాల బాట పట్టాడు మహేశ్. హాలీవుడ్ తరహా స్క్రీన్‌ప్లేను తెలుగు ప్రేక్షకులకు అందించాడు ప్రిన్స్.
ఫ్యామిలీ - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
తన సినిమాల్లో కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే మహేశ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామాలో నటించారు. అంతేకాకుండా తెలుగునాట మరుగున పడిన మల్టీస్టారర్ చిత్రాలకు వెంకటేశ్‌తో కలిసి మళ్లీ ప్రాణం పోశాడు.
మేసేజ్- శ్రీమంతుడు
ఊరిని, ఊరు గొప్పదనాన్ని తెలిపే సినిమా శ్రీమంతుడు. తన సొంత ఊరిని బాగు చేయడం కోసం అన్ని సుఖాలూ వదులుకుని, ఆ ఊరి రూపురేఖల్ని మార్చి , జనం జీవితాల్లో సంతోషాన్ని నింపే యువకుడి పాత్రలో మహేశ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా నుంచి స్పూర్తి పొంది చాలా మంది సొంతవూళ్లను దత్తత తీసుకున్నారు.