మహేష్27కి రెండు ప్రొడక్షన్ హౌస్‌లు ఎందుకంటే?
on May 30, 2020
మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వం వహించనున్న సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. గత కొన్ని సినిమాల నుండి మహేష్ పారితోషికం తీసుకోకుండా.... శాటిలైట్, డిజిటల్ హక్కులు తీసుకుంటున్నారు. అందుకని, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పేరు కూడా పోస్టర్ల మీద ఉంటోంది. మహేష్ తండ్రి, సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (మే 31) ఉదయం 9.09 గంటలకు అధికారికంగా సినిమాను ప్రకటించనున్నారు. ఆల్రెడీ సినిమాకి ‘సర్కారు వారి పాట’ టైటిల్ ఖారారు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే... ఈ సినిమాకి రెండు ప్రొడక్షన్ హౌస్‌లు కలవడం వెనుక ఆసక్తికరమైన కథ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
మహేష్‌తో సినిమా అవకాశం రాకముందు అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో దర్శకుడు పరశురామ్ ఒక సినిమా ప్రకటించారు. ఈలోపు మహేష్–వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ కావడం, హీరో నుండి పిలుపు రావడంతో ఆ సినిమాను పరశురామ్ పక్కన పెట్టారు. తమకు చేయాల్సిన సినిమాను పక్కనపెట్టిన కారణంగా ఈ సినిమాలో 14 రీల్స్ ప్లస్‌కి ప్రొడక్షన్‌లో షేర్ చేసుకొనే అవకాశం వచ్చింది. ఇక, మహేష్‌తో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్సు ఇచ్చింది. ఇటు దర్శకుడి దగ్గర కూడా వాళ్ల అడ్వాన్సు ఉంది. అందుకని, 14 రీల్స్ ప్లస్‌ను, మైత్రీని మహేష్ కలిపారట. అదీ సంగతి!