వర్మను యూట్యూబ్ ఆపలేదా..?
on Dec 18, 2017
నిత్యం వివాదాలను రాజేస్తూ.. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. గత కొంత కాలంగా ట్విట్టర్లో సైలెంట్ అవ్వడంతో నాగార్జున సినిమాతో బిజీగా ఉన్నాడేమోనని సినీ జనాలు భావించారు. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా బాంబు పేల్చాడు. రాయలసీమ రెడ్లను టార్గెట్ చేసి.. అసలు ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఏం జరిగింది..? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది..? అన్న అంశాన్ని ఆధారంగా తీసుకొని "కడప" పేరుతో ఇంటర్నేషన్ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు వర్మ. అలా చెప్పిన కొద్ది గంటల్లోనే కడప ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
"రాయలసీమ మగోళ్లు అమ్మ కడుపులో నుంచే కత్తి పట్టుకుని పుడతారు" అంటూ ఆర్జీవీ వాయిస్‌తో ట్రైలర్ స్టార్టవుతుంది. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవిలు ఫ్యాక్షనిజం గురించి చెప్పిన డెఫినేషన్లను ఉదహరిస్తూ.. ట్రైలర్‌ను నడిపించాడు. మాములుగానే వర్మ సినిమాల్లో కంటెంట్ అంతా హింస, సెక్స్ చుట్టూ తిరుగుతుంది.. ఇక డైలాగ్స్ సంగతి చెప్పేదేముంది. తాజా ట్రైలర్ నిండా కూడా ఒళ్లు గగురుపడిచే హింసాత్మక సన్నివేశాలు, సెక్స్ కంటెంట్‌తో నింపేశాడు. ట్రైలర్ స్టార్టింగ్‌లోనే ఒక వ్యక్తి కాలు నరికే సీన్‌తో తన ఉద్దేశం ఏమిటో వర్మ చెప్పకనే చెప్పేశాడు.
సినిమాల విషయానికి వచ్చేసరికి రక్తపాతం, హింస, సెక్స్ కంటెంట్ హద్దులు దాటితే దానిని సెన్సార్ సమయంలో సెన్సార్ బోర్డు కట్ చెబుతుంది. కానీ యూట్యూబ్ విషయంలో అలా ఉండదు. మితిమిరిన బోల్డ్ సీన్స్‌ను మాత్రమే యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేయగలదు.. బూతు డైలాగులు, ఓ మాదిరి రక్తపాతాన్ని ఆ సాఫ్ట్వేర్ అడ్డుకోలేదు. అందుకనే వర్మ రెచ్చిపోతున్నాడు. కులానికి, మతానికి, ప్రాంతానికి, సెన్సార్ బోర్డుకి భయపడి తాను చెప్పాల్సిన ఎన్నో విషయాలను చూపించలేకపోయానని.. ఇప్పుడు తనకు ఎలాంటి భయం లేదని వర్మే స్వయంగా చెప్పుకొచ్చాడు. మరి రామ్‌గోపాల్ వర్మ లాంటి వారిని అడ్డుకోవడానికి యూట్యూబ్ ఏమైనా చేస్తుందా..? అన్నది వేచి చూడాలి..?