'సరిలేరు నీకెవ్వరు' మూవీకి మహేశ్ మైండ్ బ్లాక్ రెమ్యూనరేషన్!
on Feb 14, 2020
సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఒక్క ఓవర్సీస్ మినహా మిగతా అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు లాభాలు అందించినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. కాగా ఈ సినిమాకు మహేశ్ అందుకున్న పారితోషికం విలువ ఇప్పటివరకూ దక్షిణాదిన ఏ హీరో అందుకోలేదని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ ద్వారా ఆయనకు ఏకంగా రూ. 82 కోట్లు అందాయని ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మహేశ్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు దిల్ రాజు కూడా వ్యాపార భాగస్వామే. సాధారణంగా రెమ్యూనరేషన్ తీసుకొని నటించే మహేశ్, ఈ సినిమాకు ముందుగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. దానికి బదులుగా నాన్-థియేట్రికల్ రైట్స్ రాయించుకున్నాడని సమాచారం. ఆ హక్కుల విలువ ఏకంగా రూ. 82 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. సౌత్‌లోనే ఇప్పటిదాకా ఏ హీరోకూ ఒక సినిమాకు సంబంధించి ఈ స్థాయి ఆదాయం లభించలేదని చెప్పుకుంటున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' మూవీని రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి, థియేట్రికల్ రైట్స్‌ను రూ. 100 కోట్లకు అమ్మారు. అంటే నిర్మాతలకు మంచి లాభమే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్లు కూడా లాభాలు ఆర్జించారు. ప్రధానంగా నైజాం బయ్యర్ దిల్ రాజు భారీ లాభాలు గడించారు. ఇక నాన్-థియేట్రికల్ హక్కులైన టీవీ, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ వంటివి మహేశ్‌కు అనూహ్యమైన స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించి పెట్టాయి. దీంతో దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో మహేశ్ ముందు వరుసలో ఉన్నట్లయ్యింది.