చిరంజీవి తొలిచిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ మృతి
on Feb 15, 2020
మెగాస్టార్ చిరంజీవి కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం 'పునాదిరాళ్లు' దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ అనారోగ్యంతో శనివారం ఉదయం మృతిచెందారు. ఆయనకు కూడా ఇది మొదటి సినిమా. 'పునాది రాళ్లు'కు ఐదు నంది అవార్డులు రావడం విశేషం. అటువంటి దర్శకుడు, నిర్మాత రాజ్‌కుమార్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసి ఇటీవలే చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
ఆ మధ్య పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్‌కుమార్ ఒంటరివాడు అయ్యారు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూనే శనివారం ఉదయం కన్ను మూశారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరుకు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.
నియంతృత్వంతో, క్రూరత్వంతో ఒక గ్రామాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అరాచకాలు చేస్తోన్న సర్పంచికి వ్యతిరేకంగా అభ్యుదయ భావాలున్న అతని కొడుకే, కొంతమంది స్నేహితులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, ఎలా తిరుగుబాటుచేసి, తండ్రికి బుద్ధిచెప్పాడనే కథతో రాజ్‌కుమార్ రూపొందించిన 'పునాది రాళ్లు' అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో సర్పంచిగా గోకిన రామారావు, ఆయన కొడుకుగా నరసింహరాజు నటించగా, అతని స్నేహ బృందంలో చురుకైనవాడుగా చిరంజీవి నటించారు. సర్పంచి భార్యగా మహానటి సావిత్రి కనిపించడం విశేషం. సర్పంచి అత్యాచారానికి బలై, పిచ్చిదానిలా మారిపోయిన యువతిగా రోజారమణి, సర్పంచి కొడుకు పోరాటానికి మద్దతు ఇచ్చిన టీచరుగా కవిత ఉన్నత స్థాయి నటన ప్రదర్శించారు. మొదటి సినిమాతోటే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజ్‌కుమార్.
Also Read