విరాటపర్వం లుక్: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
on Dec 14, 2019
రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ‘విరాటపర్వం’లో అతడి లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖానికి ఎర్రటి కర్చీఫ్ కట్టుకున్న లుక్ విడుదల చేశారు. రానా కళ్ళలో ఓ ఇంటెన్సిటీ ఉంది. విప్లవానికి ఎరుపు రంగు సూచిక. అలాగే, మావోయిస్టుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కనుక ఈ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ‘రివల్యూషన్ ఈజ్ ఎన్ యాక్ట్ లవ్’ కాప్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ పోస్టర్‌తో రానాపై వస్తున్న రెండు పుకార్లకు చెక్ పెట్టారు.
‘విరాటపర్వం’ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. రానా అమెరికా వెళ్ళడంతో సాయిపల్లవిపై సన్నివేశాలు తెరకెక్కించారు. ఆరోగ్య సమస్యలతో రానా అమెరికా వెళ్ళాడని, ఇప్పట్లో షూటింగ్ చేయలేడని పుకార్లు వచ్చాయి. రానా లుక్ విడుదల చేయడంతో అతడు షూటింగ్‌కు అటెండ్ అవుతున్నాడనేది అర్థమవుతోంది. పుట్టినరోజు కూడా కొంత సమయం షూటింగ్ చేశాడు. రానా మళ్ళీ సెట్స్‌కి రావడానికి టైమ్ పుడుతుందనే పుకారుకు దీంతో సమాధానం చెప్పారు. అలాగే, అతడు అమెరికా వెళ్ళడంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కాక... దర్శకుడు వేణు ఊడుగుల అసంతృప్తితో ఉన్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపించాయి. సినిమా నుండి రానా లుక్ ముందుగా విడుదల చేయడంతో ఆ పుకారుకూ చెక్ పెట్టారు. ఆరోగ్య సమస్యలకు, సినిమాల సంబంధించి వస్తున్న పుకార్లకు ఈ ‘విరాటపర్వం’ లుక్‌తో రానా అండ్ టీమ్ చెక్ పెట్టింది.