బాహుబలి టికెట్లు... `బొక్కింగ్`
on Jul 9, 2015
బాహుబటి టికెట్ల మానియా.. న భూతో న భవిష్యత్త్ అన్నట్టుగా తయారైంది. ఏ నలుగురు కలుసుకొన్నా... బాహుబలి టాపిక్కే. నీకు టికెట్ దొరికిందా... దొరికిందా? అంటూ ఆరాలు తీసుకొంటున్నారు. `పొరపాటు`న టికెట్ దొరికితే... అదేదో వరల్డ్ రికార్డు సృష్టించినట్టు ఫేస్ బుక్‌లోనూ, ట్విట్టర్లలోనూ పోస్ట్ చేస్తున్నారు. బాహుబలి టికెట్ దొరకడం ఇప్పుడు వింతల్లోకల్లా వింతైపోయింది. సినిమా చూసే అభిమానులేం సడన్‌గా పెరగలేదు. థియేటర్లూ తగ్గలేదు. మరి టికెట్ల కోసం ఎందుకింత కొట్టాట?? తెర వెనుక ఏం జరుగుతోంది??
ప్రపంచ వ్యాప్తంగా 4 వేల ధియేటర్లకు పైనే బాహుబలి విడుదలవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 1400 థియేటర్లలో బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. ఇది టాలీవుడ్ రికార్డ్. విడుదలకు నాలుగు రోజుల ముందే అడ్వాన్సు బుకింగ్ పెట్టారు. ఆన్‌లైన్లో బుకింగ్ తెరిచిన 5 నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయని చూపిస్తోంది. దాంతో సగటు సినీ అభిమానికి నిరాశే ఎదురైంది. కేవలం 20 శాతం టికెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. మరో 20 శాతం థియేటర్ యజమానుల చేతుల్లో ఉంటాయి. మిగిలిన అరవై శాతం నిర్మాతలు, డిస్ట్యుబ్యూటర్లు హ్యాండొవర్ చేసుకొన్నారని సమాచారం. ఎప్పుడూ లేనిది... వాళ్లకెందుకన్ని టికెట్లు అని ఆరా తీస్తే... తెర చాటు భాగోతాలు బయటపడుతున్నాయి. ఈ సినిమాని అందరూ అత్యధిక రేట్లకు కొనుకొన్నారు. దాదాపుగా డబుల్ , ట్రిపుల్ డబ్బులిచ్చి బాహుబలిని సొంతం చేసుకొన్నారు. మరి అవన్నీ రాబట్టాలంటే ఏం చేయాలి?? బెనిఫిట్ షోల పేరిట దండుకోవాలి. లేదంటే.. టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవాలి. ఇప్పుడు ఆ దందానే నడుస్తోంది. హైదరాబాద్ మొత్తమ్మీద దాదాపుగా 15 థియేటర్లలో బెనిఫిట్ షోలు నిర్వహించడానికి అనుమతులు అందుకొన్నారు. టికెట్ విలువ రూ.15 వందల రూపాయల నుంచి 2వేల 5వందల వరకూ ఉంది. శుక్రవారం ఉదయం ఆట నుంచి ఆదివారం వరకూ ఏ షో చూడాలన్నా టికెట్ ధర 500 రూ. అంటున్నారు. ఆన్ లైన్‌లో కూడా ఎప్పుడూ లేని విధంగా టికెట్ ధర 500 చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే టికెట్లు రేట్లు అమాంతం పెంచేసి, పెట్టిన పెట్టుబడి మూడు రోజుల్లోనే రాబట్టుకోవడానికి వేసిన ప్లాన్ ఇది. టికెట్లు లేవంటూ ఈ సినిమాకి ముందే ఓ హైప్ క్రియేట్ చేసి, ఎంతిచ్చినా సరే బాహుబలి టికెట్ సంపాదించాలి అనుకొనేలా చేసి, వంద రూపాయల టికెట్‌ని ఐదు వందలకు అంటగట్టే ప్లాన్ వేశారన్నమాట.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో టీఆర్ ఎస్ నేతలు టికెట్ల కోసం భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మల్టీప్లెక్స్‌లలో ప్రతి షోకీ ఇన్ని టికెట్లు తమకు కేటాయించాలంటూ ముందే నిర్మాతల్ని అడిగేశారట. వాళ్లకు ఇచ్చిన తరవాతే... టికెట్లు అమ్ముకోవాలట. పాలక పక్షమే డిమాండ్ చేస్తే నిర్మాతలు చేసేదేముంది? అందుకే వాళ్లకంటూ కొన్ని టికెట్లు తీసిపెట్టారు. పోలీస్ డిపార్ట్ మెంట్‌కూడా ఏం తక్కువ తినలేదని, వాళ్ల వాటా టికెట్ల రూపంలో వెళ్లిపోతోందని తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌కి తోడు... ఈ దండుకోవడం కూడా కలిసి టికెట్ల కొరతకు దారి తీశాయి. అందుకే తొలి మూడు రోజుల టికెట్లు దొరకడం గగనమై.. సామాన్యుడికి బాహుబలి అందకుండా పోయింది.