ముందుచూపేది?

దహనమౌతున్న కలలు అనుక్షణం రగులుతున్న ఆశలు నిప్పులసెగలు గక్కుతున్నయ్ రహస్యమేమిలేదనుకున్నా రంగులుమారుతున్న కాలమిది ఇంతలా ఉరిమి ఉరిమి పూరిగుడెసెలపై పిడుగులు ఊరి పొలిమేరలు దాటిన మహమ్మారి ఊపిరాడకుండా చేసి ఊరుదాటిస్తుంది ఊగుతూ తూలిపడుతున్న శవాల గుట్టలు హెచ్చరించినా ఎదకు చేరలేదు ప్రజలకు పాలితులకు ముందుచూపులేక బలైతున్న బతుకులు గాలి కరువై తనువు బారమై అణువణువునా డొల్లతనం పేదోలందరు శవాలదిబ్బలైతున్న దృశ్యం ఆసుపత్రిలో పడకలసలే లేవు ప్రాణవాయువుకు కరువొచ్చే నేతలంతా ఎక్కడిదొంగలక్కడే పట్టపగలు నట్టనడివీదిలో పిట్టల్లా రాలుతున్న సామాన్యులు ఈ సమయంలో ఎవరికెవరు కాపలా?? దిక్కుతోచని దీనస్థితి  ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులెందుకుండవో? చేతకాని నేతలకు ముందుచూపులేకనే జరుగుతున్న మరణమృదంగమిది అసలు ప్రజలను రక్షించేదెవరో? స్వాతంత్ర్య భారతానికి ఎన్నాళ్లీ పరిస్థితి? ఎన్ని తరాలిలా రాలే సమిధలౌతారో? ఇప్పుడిదో కొత్త ప్రపంచం అర్థంకాని రసాయనశాలైంది కట్టండి కట్టండి సామాన్యులకు ఆసుపత్రులను కరోనా వంతెన దాటేందుకు కన్నీళ్ల జీవనం ముగిసేందుకు ఎప్పుడు ఎవరో ఒకరు ఉన్నట్టుండి తప్పపోతున్న తరుణమిది!!   సి. శేఖర్(సియస్సార్)

ఉదయపు కల...

ఇవాల ఉదయం కల కన్నా... పాతదే... ఐనా కొత్తగా ఉంది.. ఈ రోజులా మునుపెన్నడూ లేదు నిన్న నన్ను ధ్వంసం చేసిన ఆ క్రియాశీలకాలు ఆ కలలో దగ్ధం అయినట్టుగా ఉంది అందుకనేమో ఈ రోజు నిన్నటి విధ్వంసంలా లేదు.. మలిదశకు చేరుకున్న కర్మలను తొలిశతాబ్ధపు ఆనావాళ్ళుగా చెప్పుకునే కర్తలను బహుముఖ ప్రజ్ఞాశాలులుగా వర్ణించాలో ఏమో ఇప్పుడు... ఉదయం బోరున ఏడుస్తుందేమో మొట్టమొదట నుండి చిట్ట చివర వరకూ కల కంటే నా పిచ్చి కలలతో ఈ ఉదయం ఎందుకు కనుమరుగైందో ఏమో.. మళ్ళీ అదే రణరంగం.. అదే ప్రస్తుతం... కళ్ళు తెరిచి చూస్తే అదే పాత ప్రపంచం... కనీసం కలలోనైనా కొత్త ప్రపంచం కల కనాలి తర్వాత ఎప్పుడైనా...   - Malleshailu    

దోపిడి

ధనవంతుడికి పేదవాడికి మధ్యన నింగికి నేలంతా దూరం వాడు ఆకాశమై ఆనందంగా! వీడు అగాధమై ఆవేదనగా!! పేదవాడి రక్తాన్ని  జలగలా పీల్చి  శిఖరమై శాసిస్తాడు ఉన్నోడి పాదాలకింద నలిగిపోతూ ఎండిన డొక్కలతో అలమటిస్తాడు ఎదురుతిరిగితే వెన్నుపూసలిరిచి ఎంగిలిసిరేస్తాడు ఏదైనా చేసేస్తాడు వంగిన నడుము వణుకుతు తలెత్తడమే మరుస్తడు  జరిగే మోసం పసిగట్టలేడు ఎదురుతిరిగే సత్తా లేనోడు జీవన చదరంగంలో వాడెప్పుడు రాజే జీవన పోరటంలో వీడెప్పుడైన బంటే చమటంత చిందించి అన్నం పండిస్తడు కానీ.. ఎప్పుడూ కడుపునిండదు బీదరికానికి చిరునామా పండిందేదైనా తనే హక్కై నిలబడతాడు అప్పుడే ఎగరేసుకుపోయే రాబందై వాలిపోతాడు కష్టపడుతూ  కాలం గడపుతాడు పేదవాడు కష్టానికింత వెలకట్టి కోట్లెనుకేసుకుంటాడు  ఎర్రటెండలో కాగిపోతూ ప్రపంచాన్ని నిర్మిస్తాడు! ఏ సి గదిలో విలాసాలబోతూ విశ్వాన్నంతా శాసిస్తాడు!! నాయకులెవరైనా వీరిచేతిలో కీలుబోమ్మలే డబ్బిసిరేసి దెబ్బకొడతారు ధనవంతులై తరతరాలకు కూడబెడతరు శాసించడమే తెలుసు ధనవంతుడికి ఆశించడమే మ బాగా తెలుసు పేదవాడికి మందుకు బానిసలు పేదవాళ్ళు మత్తులో చిత్తై ఓట్లనమ్ముకుంటరు డబ్బెంతైన వెదజల్లి అధికారం లాక్కుంటరు   సి. శేఖర్(సియస్సార్)

దేశం- సర్వస్వం

బానిసగా బతకాలని ఏ జీవి కోరుకోదు భవిష్యత్తు అంధఃకారం నింపుకోవాని కోరికేదేశానికుండదు మనదేశం మాత్రమెందుకో ఎందరెందరో పరాయిపాలకుల ఏలుబడిలో కాలమెల్లదీసిందెందుకో? అష్టదిక్కులనుండి అంతా ఆక్రమించి వచ్చిన ప్రతివాడిచేతిలో దోపిడికి చిరునామయ్యింది సర్వసంపదలకు నిలయం నా దేశం పచ్చని పంటలతో అన్నపూర్ణగా అవనికెక్కింది అఖండ భారతావని ఎందరో వీరులకు పుట్టినిల్లు అలాంటి నా దేశం మువ్వన్నెల జెండా నీడలోకి వచ్చిన చరిత్ర చూస్తే ప్రతి భారతీయుడు ఐక్యతమత్మ్యం అనే నినాదం గుండెనింపుకుని సాగాలనేదే మనదేశ అశోకచక్రంలో గుర్తుకు సార్థకత మనలో మనకు భేదాలొద్దు  భారతీయతే మనందరికి ముద్దు జనగనమణ వందేమాతరం దేశభక్తి గీతాలే ఐక్యతరాగాలు సోధరభావం సమరసబావం పోరాడి తెచ్చిన స్వతంత్ర్యానికి బలం అది అమరుల త్యాగఫలం ఎప్పుడు వాడిపోనిదై దేశమాత కీర్తి నిలపగా మనమంతా కలిసి నిలువగా     - సి. శేఖర్(సియస్సార్)

ఆన్నదాత సుఖీభవ !

యేరువాక దారికేసి అడుగుల్ని కదిపితే మాగాణి  మురిసి మైమరుస్తుంది నదిలా కదిలి నారుకు నీరు పెడితే పైరు ప్రపంచానికి పచ్చని ప్రమిధై రేపటి వెలుగులకు ఉషోదయమై నిలుస్తుంది పైరంతా ఎదిగి,ఎదిగి పంట చేతికొస్తే ఆశలు రివ్వున ఎగిరే పాలపిట్టలౌతాయి అప్పుడప్పుడూ ఆశలు నిరాశలై ఆకాశమంత దిగులు గుండె గూడును చిధ్రం చేస్తాయి ఎన్నో కలల్ని కంటి పాపపై నింపుకొన్నాక గాలో,అకాల వర్షమో పంట చేతికి అందే సమయంలో ప్రళయ ఘర్జనలతో బ్రతుకుని అతలా కుతలం చేస్తుంది దారంటూ ఒకటి ఎంచుకొన్నాక ముల్లున్నా , రాళ్ళున్నా ఈతి భాధలున్నా, ఆర్థికంగా చితికినా ఎదురొడ్డి నిలిచి నడిచే మహా ఋషి అతను అన్నదాత శుఖీభవా అని దీవించడమే మన ముందున్న కర్తవ్యం...!!   మహబూబ్ బాషా చిల్లెం  

మనిషి-మానవత్వం

మనిషి-మానవత్వం   ఏ వ్యక్తిని పలకరించిన హృదయతలపులు తెరచుకోవడం లేనేలేదు పనివుంటే వింత పలకరింత లేని చిరునవ్వు పులుముకుని కళ్ళలో ఓ కాంతిని వెలిగించి ఆ క్షణం మమకారం పరోపకారం మమత మానవత్వం వెలిగిపోతుంటది కోటి నక్షత్రాలు కాంతులతో అవసరం మనిషిని మరోలా మార్చేస్తుంది  ఎంతవారైనా తీరం దాటేదాకా తలవంచాల్సిందే  తట్టుకుని నెట్టుకురావాల్సిందే సంతోషం సంబరంగా మారాలంటే జీవనగమనంలో గమ్యం చేరాల్సిందే పదిమందికి దారికావాలంటే పరీక్షలనెన్నో నెగ్గాల్సిందే మరోచరిత్ర సృష్టించాలంటే మనిషిని మనిషిగా గౌరవించాల్సిందే ఓపిక మంత్రం జపిస్తూ  సహాయపడుతూ సాగాలి సౌజన్యం నిండగ  ఐక్యతతో మెలగాలి అడుగుల్లో జంకులేక ముందుకు సాగాలి అవనినంత వెలిగించగ అలుపులేక గెలుపుకై సాగగ పుడమినంత మొలిపించగ మానవత్వ కుసుమాలు పరిమళాలు వెదజల్లగ   - సి. శేఖర్  

కరోనా..ఓ కరోనా

  కరోనా..ఓ కరోనా ఓ మహామ్మారి కరోనా..!! బూచోడమ్మ బూచోడంటూ బుల్లి వైరస్ చుట్టూరా చుట్టి ఎక్కడి నుండో ఎగబాకి ప్రపంచం ముంగిట్లో క్లబ్ డాన్స్ చేస్తుంది.. భరత నాట్యం..కథాకేళి..ఒడిస్సి అన్నీ నర్తనాలు నీవే ఇపుడు..నీతోనే..!! నిను తలవని రోజు .. నిను పిలవని నోరు లేదు.. కలలో కూడ నీ నామ స్మరణమే.. పీడ కలలని రేపిన చీడ పురుగువి.. కనికట్టు చేసావో..కల్లోలమే రేపావో.. ఏం మాయ చేసావో..ఇన్ని హృదయాలను కూల్చేశావు..పాడు కరోనా..!! మోముకు ముక్కెరెంత అందమో..  నాసికని ఏ గాలి సోకనివ్వక మాస్కుల్లో ముంచేసావు.. సున్నితమైన హస్తాలకు సానిటైజర్ ఇచ్చి రుద్ది రుద్ది బిగుసుకు పోయేలా చేసావు.. దూరం అయితే బంధాలు దగ్గరవుతాయని సామాజిక దూరమనే కొత్త  రూల్ ని సృష్టించి ఓటు వేసావు..!! న్యాయమా నీకిది..ఓ కరోనా.. బడులన్నీ బంద్ చేసి..గుడులన్నీ లాక్ చేసి కాలం నీదని రెక్కలు విరిచేసి ఏ గూటి పక్షులను ఆ ఇంటి పంజరాల్లో బంధించావు.బంధాలకు అర్థం తెలిపావు..!! ఎంతగా జీవితాలను చిత్తడి చేసావంటే ఏ ఇత్తడితో నిన్ను కరిగించలేము.. పుత్తడి  కూడ దరిదాపుల్లోకి  తొంగిచూడదు.. భూత వైద్యానికో లొంగేదే అయితే మంత్ర తంత్రాలతో తరిమి కొట్టేవాళ్ళం.. మూఢ నమ్మకం అనుకుంటే క్షుద్రపూజలతో నీ పని పట్టే వాళ్ళం..!! నువ్వు దగ్గుతో ..తుమ్ముతో నీ ఆటని నెట్టుకొస్తున్నావు..!! మహిళా మణుల బాధ వర్ణనాతీతం కొన్న చీర ..తెచ్చిన నగ.. కట్టడానికి లేక పెట్టుకునే తీరిక లేక ఇంట్లో పనిలో .. వంటింటి బిజీ లో రోజులు ఎంత భారంగా గడిచాయో.. తలిస్తే గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరుగెడుతున్నాయి..!! లాక్ డౌన్లో  వీధంతా కాలిగా ఒక్కతే.. పిల్లలంతా నిద్రపోయాక ఆకాశం ఒంటరై పోయినట్టు..!! దేవుడు ఎక్కడో లేడు వైద్యో నారాయణ హరి రూపంలో కనిపించాడు..!! ప్రతి చెయ్యి అన్నం పెట్టే అన్నదాతయ్యాడు.. కన్న వారిని కోల్పోయిన క్షణాలలో మాత్రం గుండెలన్నీ తడిసిన చెరువులయ్యాయి.. వ్యాక్సిన్ కోసం కళ్ళు కాయలు కాసేలా  కాపు కాసి తీరా దగ్గరి కొచ్చాక అంతా సద్దుమణిగి అణిగి మణిగి ఉంటే వీఐపీలా సెకండ్ వేవ్ అంటూ చెయ్యి ఊపుతుంది.!! పాఠమే నేర్పిందో..గుణ పాఠమై జీవితాలను తాకిందో.. ఓ మనిషిగా నేర్చుకున్న జీవిత సత్యాల ముందు ఏ వైరస్ తాకదు.. కరోనా నిను తరిమే రోజు ముందుంది.. స్టే హోమ్...స్టే సేఫ్.. గెలుపు మాది .. ఓటమి ఎప్పటికైనా నీదే.. కరోనాదే జాగ్రత్త..ఓ మై కరోనా.. - స్వప్న మేకల  

ఉగాది

ఉగాది   వీడ్కోలంటోంది శార్వరీ విపత్తులనామ సంవత్సరంగా చరిత్రలో స్థానాన్ని సంపాదించి.. ఉప్పెనలాంటి కష్టమొస్తే ఎదిరించడమెలాగో.. ఒంటరిగా జీవిచడంలోని వేదనను సాంప్రదాయాల గొప్పతనాన్ని చూపించి వెళుతోంది.. అనుభవాలలో మరిన్ని పాఠాలు కాసుల రాశులతో సైతం కదలని కష్టాలెన్నో ఉంటాయని జీవన గతులను అందరికీ పరిచయం చేసేసి.. భవితను శుభాలతో ప్రారంభించగా వస్తోంది ప్లవనామ సంవత్సరం గతపు విషాదాలను మరిపించగా.. నేర్చుకున్న పాఠాలను ఆచరించి చూపించి భవితకు ఆదర్శమవమంటూ షడ్రుచుల సమ్మేళితమైన ఖేదమోదాలను అంగీకరించమంటూ జీవితాన్ని మరో ఉగాది కోయిలపాటలా..తీయగా పచ్చని తోరణాల సద్భావనలతో ప్రారంభించి కొనసాగమంటూ.. ప్రకృతికి ప్రణమిల్లుతూ అడుగేయమంటోంది... స్వచ్చంగా స్వాగతిద్దాం... స్నేహబంధాలను పెనవేసుకుంటూ..!! - అనుశ్రీ గౌరోజు  

పండుగలే పట్టుకొమ్మలు

పండుగలే పట్టుకొమ్మలు పట్నం కోడలు పిల్లని పండక్కి వెంటబెట్టుకు రమ్మని ఉద్యోగం పేరుతో వలసబోయిన కన్నబిడ్డకు పల్లెతల్లి కబురంపగానే పక్షిరెక్కల విమానానికి పైకంగట్టి పిల్లపాపలతోటి వచ్చి వాలిపోయె తనయుడు ఉన్నపళంగా కొత్త ఉగాది ఉషస్సులా...! కట్టుకోక తప్పదంటూ పతిదేవుడు ప్రాధేయపడి ప్రేమతో పట్టుకొచ్చిన పట్టుచీరను భారంగా చుట్టుకుని ఆరురుచులకై ఎదురుచూస్తున్న సపరివారాన్ని మెప్పించక తప్పక ఉగాది పచ్చడిని నేర్పించమంటూ ఇల్లాలు గూగుల్ తల్లిని అర్థించె పాట మరచిన శరత్ కోయిలలా...! పళ్ళెంలోని చిల్లుగారెను ఆరగించ అరచేతి వేళ్ళను విస్మరించి ముళ్ళచెంచాలతో కుస్తీపడుతున్న మనుమలను చూసి విస్తుపోయె తరాలను తరచి చదివిన తాత ! తల్లిపాల తీపి ఎరుగని తరానికి అంతర్జాలానికి అంకితమైన బాల్యానికి వరసలు కలుపలేని వింత అజ్ఞానానికి పండుగలే కదా సంస్కృతి పట్టుకొమ్మలు ఉగాదులే కదా సాంప్రదాయపు సిరిమువ్వలు ! - లావణ్య లహారి  

వస్తోంది ప్లవం

వస్తోంది ప్లవం   వికార ,శార్వరులను నెట్టుకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ ప్రవాహం లా వస్తోంది ప్లవం ఒక ఒరవడి ఇది చైతన్య స్రవంతి చైత్రరథాన్ని ఆరోహించి ఉత్సాహంగా, ఉల్లాసంగా వస్తోంది ప్లవం పుడమితల్లిని పులకరింపచేస్తూ పూలపరిమళాలను వెదజల్లుతూ ఆశయాలను అంకురింపచేసి ఆశలను పండించటానికి పరుగులిడుతూ వస్తోంది ప్లవం వికారి వికారాలను పోగొట్టి శార్వరి కరోనా భయాలను అరికట్టి ఆనందోత్సాహాలను కలిగించ ఒక ఒరవడియై వస్తోంది ప్లవం జీవిత గ్రంథంలోని గతపేజీలను కంట కానరాకుండ తిప్పేసి సరికొత్త ఆశలతో పరిగెత్తుకుంటూ వస్తోంది ప్లవం మల్లెల మొల్లలతో, కోయిల కుహుకుహుగానాలతో సహజ ప్రకృతి సొగసులతో పచ్చపచ్చని పైరుల చేలాంచాలతో తుమ్మెద ఝంకారాల సవ్వడులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, వస్తోంది ప్లవం భవితకు చక్కని బాట వేస్తూ వస్తోంది ప్లవం పలుకుదాం స్వాగత వచనాలు ప్లవానికి పండుగుల ఆదికి, సంవత్సరాదికి ప్లవనామ ఉగాదికి స్వాగతం, సుస్వాగతం. - డాక్టర్ కమలాదేవి

మానవ వికాసం

మానవ వికాసం   మనిషి ప్రయత్నమే కదా ఈనాటి అభివృద్ధి! జంతు దశ నుండి నిరంతరం దినదినవికాసంతోనే  అడుగడుగునా అవరోధాలెన్నెదురైనా తట్టుకుంటూ నెట్టుకుంటూ కటికచీకటిని సైతం పారద్రోలే నిప్పును కనిపెట్టి వెలుగులోకి అడుగెట్టడమే కాదు ఛక్రాన్ని కనిపెట్టి  జగతి గతిని ప్రగతిని మరోస్థాయిలోకి  విశ్వమ్మొ త్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ప్రతి అడుగులో మానవప్రయత్నాన్ని కాదనలేం కదా!! వికాసంతోపాటు  మంచితో పాటు చెడుకూడా తనవెంటే కదిలి తన వినాశనానికి  రూపం దాల్చింది అభివృద్ధి పేరుతో  పచ్చని ప్రకృతిని  నాశనంచేసి  మనిషికి మనుగడ  లేకుండా చేస్తున్నడు!! అంతరిక్షంలో అడుగెట్టినా అద్దాలమేడల్లో ఆకాశహార్మ్యాల్లో నివాసమున్నా.. సాటిమనిషిని ఆదరించని నేటి నాటు మనిషికి మానవత్వం వికాసం చెందితేనే మానవప్రయత్నంతో సాధించిన అభివృద్ధికి సార్థకత!!!   సి. శేఖర్(సియస్సార్)

మండే ఎండలు

మండే ఎండలు ఎండులు చూస్తుంటే గుండెలదురుతున్నయ్ కళ్ళుకూడ చూడలేనంత కాయం తట్టుకోలేనంత కాలు బయటపెట్టలేనంత నిప్పులు కక్కుతూ సూర్యుడు నిలువెల్ల దహిస్తున్నడు నీళ్ళెన్ని తాగిన క్షణంలో ఆవిరైపోతున్నయ్ ఎండకెళ్ళె ధైర్యం లేక  ఎవరు బయటకురాలేరు ఎక్కడివాల్లక్కడే  వడగాలులైతే వడివడిగా వీస్తున్నయ్ వడదెబ్బకు బలైపోయే బతుకులెన్నో? మనిషి బతుకిలావుంటే మూగజీవాల పరిస్థితేంటి? విచక్షణ మరచిన మనిషి ప్రకృతిని తనిష్టానికి అనుగుణంగా నాశనం చేస్తూనేవున్నడు చెట్టు మొత్తం నరికేసి కర్మాగారాల నిర్మాణాలతో కాలుష్యాన్ని బహుమానమిస్తున్నడు సాంకేతికంగా అభివృద్ది చెంది అంతరిక్షం చేరినా నివాసానికనువైన భూమిపై తన ఆగడాలకు అడ్డుకట్టలులేవు కల్తీ రాజ్యానికి అధిపతౌతున్నడు ఓజోన్ పొర తరిగిపోయే తరువయ్యింది ఎండలకు మనుషులే పిట్టల్లా రాలిపోతుంటే  పక్షులు జంతువుల మాడిమసైపోతున్నయ్ నెర్రెలిచ్చే నేలలో నీటిశాతం అడుగంటి ఆగమవుతున్న స్థితి జలంలేని జగతి గతితప్పి  జనం అల్లాడిపోక తప్పదు పచ్చదనంలేని పుడమి స్వచ్ఛమైన సంతోషంలేని అనాథౌతుంది తస్మాత్ జాగ్రత్త!!!!     సి. శేఖర్(సియస్సార్)  

హోలీ

హోలీ      సప్తవర్ణాల కలయిక  ఒక్క తీరు గా  రంగులలో  కలిసి మెలిసి పోయే సుదినం  జాతి, మత, కుల విష రంగులేవి  అంటని స్వచ్చమైన ప్రేమకు సంకేతం  రాధా మాధవుల వసంతోత్సవ  క్రీడలకు నిదర్శనం ... తొలకరి జల్లుల వర్షం లో  తడిసి ముద్ద అయ్యే భావం  కాముడి దహనాల మధ్య  పౌర్ణమి  వెలుగుల్లో  వెల్లువిరిస్తున్న స్నేహాలు  ఒకరికొకరు పంపుకునే ప్రేమ  సందేశాల తో నిండినది  ప్రాంతాలు వేరయినా  మనుషులు ఒక్కటే అంటూ  వెలిసిపోని మమతల  రంగులతో ముందుకు సాగాలి .. ఇప్పుడు  రంగులు  ఎగిరే పక్షులాంటివి  కాలాల తో పాటు గా కొంచెం కొంచెం  ప్రపంచం మొత్తం గా చుట్టి వస్తు  శాంతి కపోతాలు గా  కొత్త పండుగ తో ముందుకు వస్తున్నాయి   - పుష్యమి సాగర్   

ఆమె "అనంతం"

  అవనికున్నంత "ఓపిక" ఆమెకే సొంతం పుట్టినప్పటినుండి "ఇంటిలో" వెలుగౌతుంది పెరుగుతున్నపుడు "ప్రేమానురాగాలకు" చిరునామవుతుంది ఆమె మాటలు మనసుకు "ఓదార్పునిచ్చే వెన్నెలవుతది" మార్యదకు మారుపేరవుతుంది చదువుసంధ్యల్లో  మేటిగా నిలిచి "తననుతానే" నిర్మించుకుని ఆదర్శమౌతుంది వేసే అడగడుగులో వెనక్కిలాగే "గాలాలను" తొలగించుకుంటూ "విజయశిఖరాలనదిరోహిస్తది" ఆధిక్యత ఆధిపత్యాన్ని తట్టుకుంటూనే  "అజరామరమైన అవకాశాలు" అందుకుంటూ  "ఏ రంగంలోనైన" రాణించగల నేర్పరితనాన్ని అద్దుకుంటుంది "అణిచివేతల చట్రంలోంచి" అంతరిక్షంలోకెగిరింది కుటుంబ "భారం" మోస్తూనే "సంప్రదాయలను" నిలబెడతది అవనినంత మోసే "అనంతశక్తి మహిళ" సృష్టిలో ప్రతిపనిలో మహిళమణులెందరో...! అందుకోండి మా సలామ్!! లోకమంత మీకెపుడు గులాం!!! సి. శేఖర్(సియస్సార్)