గజిబిజి నాయకులం

వస్తున్నాం... వస్తున్నాం  మీ సంపద దోచుకోవడానికి వస్తున్నాం మీ ఓట్ల కోసం వస్తున్నాం  మీ ఓట్లతో రాజ్యాధికారంలోకి వస్తున్నాం.  కంపెనీల పేరు చెప్పి మీ భూమిని లాగేస్తున్నాం  అభివృద్ధి కావాలంటే?  మీ భూములు మాకు ఇవ్వాలె ! ఉద్యోగాలు కావాలంటే?  ఉన్నదంతా ఇచ్చేయాలి..!  మీరు అడుక్కోవాలె ..! మేము అధికారం అనుభవించాలె..!  దిక్కు మొక్కు లేదు, మీకు మేమిద్దరం తప్పా ..!  వాడు కాకపోతే మేము, మేము కాకపోతే వాడు   ఇద్దరం ఒక్కటే ? దోపీడిదారులం..మీరంతా మా బానిసలు,  మీరు మాకు వేసేది ఓటు ... మేము మీకు పొడిచేది పన్నుపోటు  మేము  మిమ్మలను, రాష్ట్ర సౌభాగ్యాన్ని తాకట్టు పెట్టేస్తాం  దొరికిన సంపదనెల్ల దోచేస్తాం...! మిగిలి ఉంటే మీకు ఇచ్చేస్తాం.  ముద్దుపేరు సంక్షేమం, రాష్ట్రానికి సంక్షోభం . ఏ దారి లేదు మీకు,.. వాడు రాకపోతే మేము , మేము కాకపోతే వాడు  దిక్కు ముక్కు లేని జనం మీరు, మీరు  మారరు మేము మారం  ఇది ముమ్మాటికి నిజం.  ఇదేరా ప్రజాస్వామ్యం అంటే ? స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ లేడు గణతంత్రం తర్వాత రాజ్యాంగం లేదు  ఉన్నదల్లా మేమే దోపిడీదారులం  మీ ఓటు మాకు , రాజ్యాధికారం మాకు  రాజ్యం మాదే - భోజ్యం మాదే ,  మీరంతా మా బానిసలు  ఇదేరా ప్రజాస్వామ్యం అంటే ? కులం మాటున కొట్టుకుందాం. మతం మాటున చంపుకుందాం. ఒకరినొకరిని నిందించుకుందాం.   మీరు మారరు మేము మారం.  ఉన్నదల్లా ధనస్వామ్యమే ! ఇంకెక్కడి ప్రజాస్వామ్యం!  నిలువెల్లా దగాధనస్వామ్యం!  జైహింద్   మీ... మధు,  నేతాజీ కలం

రగ్గుల నడకలు!!

అంతరంగంతో పెన వేసుకొని  అలనాటి మా ఊరి జ్ఞాపకాలు అందమైన హేమంత ప్రభాత వేళల్లో   అదిరించు చలిలో రగ్గుల నడకలు! విశ్వంభర దేవి  రేతిరి మేని ముసుగు తీసి  తెలి మంచు వన్నెతో వెలుగొందుతున్న    సుప్రభాత వేళల్లో అలనాటి మా పల్లెల్లో! మాస్టారి ప్రైవేటుకు రగ్గులతో మా తోబుట్టువులతో వెడుతుంటే  మా మిత్రులు త్రోవలో రగ్గులతో  మా చుట్టూ ఎన్నో రగ్గుల నడకలు! ఆలమందల ఆలనా పాలనలో కొన్ని చేనుకి సాగుకై వెళుతూ కొన్ని  పాల కేంద్రమునకు లైనుకట్టి కొన్ని చెరువు నీళ్లకు బిందెలతో మరికొన్ని! రోళ్ళ దగ్గర దంచుతూ కొన్ని చలిమంటల చెంతన కొన్ని కల్లాపి చల్లుతూ కబుర్లతో కొన్ని  ముగ్గులేస్తూ ముచ్చట్లలో మరికొన్ని! రచ్చబండన పొగలొదులుతూ కొన్ని హరి నామ కీర్తనలతో కొన్ని  కాటి కాపరి వేషములతో కొన్ని  డూడూ బసవన్నలతో మరికొన్ని! ఆకుపచ్చని పొలాలేమో చిరు ముత్యపు తుషారపు రగ్గు కౌగిలిలో ఉషోదయం సఖుని కొనిపోవునేమోనని  కించిత్ విరహ వేదనతో! — రవి కిషోర్ పెంట్రాల

హృదయస్పందన.. జనగనమన

ఒంటిపై కప్పుకోడానికి బట్టల్లేక చలికి వణికే అనాథ పిల్లలు.. ఒంటిపైనున్న బట్టలు ఏ మానవ మృగం లాగుతుందోనన్న భయంతో ఆడపిల్లలు... ఆహరం లేక, ఆక్సిజన్ అందక చనిపోయేవాళ్లు కొందరు.. ఆహరం, ఆక్సిజన్ తో వ్యాపారం చేస్తూ బ్రతికేవాళ్లు కొందరు... మానవత్వాన్ని మరిచి సాటి మనిషికి సాయం చేయని మనుషులు.. మతం మత్తులో, కులం కుళ్ళులో మనిషిగా బ్రతకడం మరచిన మనుషులు... ఇది నా దేశం.. దేశ గౌరవాన్ని మువ్వన్నెల జెండాకి పరిమితం చేసిన ప్రదేశం... ఇది నా దేశం.. మంచితనం, మానవత్వమని మాటలు చెప్పడంలో ముందున్నాం.. ఆచరణలో వెనక పడుతున్నాం... ఇది నా దేశం.. "నా ఉచ్వాస నిశ్వాసలు.. జాతీయ జెండా రెపరెపలు నా హృదయ స్పందన.. జనగణమన" అని ఘనంగా చెప్పుకుందాం.. అంతకన్నా ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకుందాం.. దేశ గౌరవాన్ని నిలబెడదాం. -గంగసాని

దిష్టిబొమ్మల సమూహాలు!!

దిష్టిబొమ్మల సమూహాలే రూపాల్లో పడమట సంధ్యకు ఒరిగిన జనుల గుంపులన్నీ బాన పొట్టలతో బరువైన హృదయాలతో ఊసిపోయిన జుట్టుతో అలసిపోయిన కళ్ళతో జారిన బహువులతో ఎండిన కన్నీటి చారలతో! బ్రతుకుబండిని గమ్యంవైపుకు నడిపిస్తూ విశ్రాంతి లేక వడలిపోయి కొందరు వారసత్వ సంక్రమణ ఆరోగ్య అవలక్షణాలు  వృత్తి వ్యవహార ఒత్తిళ్ళతో నలిగి నీరసించి మరికొందరు! జీవితంలో లోటనేది దరిదాపుల్లో లేకపోయినా ఇంకేదో లోటని తెగ వెదుక్కుంటూ కొందరు లెక్కలేనంత సంపద సొంతమయినా ఇంకేంటో సంపాదించాలని తపనతో మరికొందరు! లెక్కకుమించి అభిమానులను పొందినా ఇంకేవో అవార్డులు కోసం ఎదురుచూస్తూ కొందరు అత్యున్నతస్థాయి అధికారపీఠం దక్కించుకున్నా మరేదో ప్రైజ్ కావాలని ఆశిస్తూ ఆందోళనలో మరికొందరు! సమాజం ఎందుకు పరుగెడుతుండో తాము దేనికోసం ఆరాటపడాలో అర్థంకాక కొందరు గుంపుతో పాటు శక్తికి మించి పరిగెడుతూ  జీవన సాగర ఆటుపోట్లను తట్టుకొంటూ మరికొందరు! వాసంత వయసు కలలసాగుకు కాడిదించేసి ఓటమికి నిర్లిప్త రంగు నిలువెల్లా అద్దుకొని కొందరు ఆశయ సాధన దిశలో అలసినా  జీవన సమరంలో ఆగక  పోరాడుతూ మరికొందరు! వెరసి  దిష్టిబొమ్మల సమూహాలే రూపాల్లో పడమట సంధ్యకు ఒరిగిన జనుల గుంపులన్నీ బాన పొట్టలతో బరువైన హృదయాలతో ఊసిపోయిన జుట్టుతో అలసిపోయిన కళ్ళతో జారిన బహువులతో ఎండిన కన్నీటి చారలతో! —రవి కిషోర్ పెంట్రాల 

 శ్రీ రామ మార్గయానము!

జయం జయం జయం దశరథ రామ జయం పితృవాక్యపరిపాలకా జయం మాతృహృదయ పరితోషకా జయం శత్రువర్గ సమ్మోహితా జయం మిత్రదళ సర్వశ్రేస్ఠా జయం నీ త్రోవలో నడయాడితే ఓ రామా  మాకిక జయమే జయమే జయమే! వరం వరం వరం  కౌసల్య రామ వరం మందహాసా వరం  మధురవచనా వరం  మనోహరుడా వరం నీవంటి పుత్రిని  పొందగలిగితే ఓ రామా  మాకది వరమే వరమే వరమే! ఫలం ఫలం ఫలం  వశిష్ఠ రామ ఫలం శిష్యచూడామణీ ఫలం భవ్య సుగుణాలగనీ ఫలం  నిత్య సన్మార్గవర్తీ ఫలం  నీ వినయ విధేయతలు  వీసమైనా వరిస్తే ఓ రామా  మా సుకర్మలన్నీ  సఫలమే సఫలమే సఫలమే! శుభం శుభం శుభం  సీతారామ శుభం ఆజానుబాహుడా శుభం  అరవిందాక్షుడా శుభం ఆనందకారకుడా శుభం నీ సౌశీల్య సౌందర్యాలు  సుంతైనా సొంతమైతే ఓ రామా  మాకంతా శుభమే శుభమే శుభమే! విజయం విజయం విజయం  కోదండ రామ విజయం గుణవంతుడా విజయం రణతంత్రుడా విజయం స్థితప్రజ్ఞుడా విజయం నీ సందర్భ సహిత సంభాషణలు  అనుసరిస్తే ప్రయత్నమేదైనా ఓ రామా  సదా విజయమే విజయమే విజయమే! -- రవి కిషోర్ పెంట్రాల

అప్పుడప్పుడు!

 అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కాల ప్రవాహాన్ని ఎదురీది గడచిన మజిలీలకు మళ్ళీ చేరాలని మార్పు చేర్పులేవో చెయ్యాలని కాదుగానీ  ఇంకొన్నిసార్లా మధురిమల్ని ఆస్వాదించాలని!  మళ్ళీ బుజ్జాయినయిపోతే బాగుండని ఉయ్యాలతొట్లో జాలిగా ఊగాలనో  గుర్రుపెట్టి నిద్దురోవాలనో కాదుగానీ  పాపాయిగా నేనుపెట్టే కేరింతలకు  అమ్మనవ్వే నవ్వులు ఇంకోసారి చూడాలనీ తప్పటడుగులేస్తూ నాన్న వేలుపట్టుకొని  మరొక్కసారి తనతో నడవాలనీ!   పిల్లాడై బడికెళ్ళగలిగితే బాగుండని బాధ్యతలు తప్పించుకోవాలని కాదుగానీ  బ్రతుకుసేద్యంలో చెట్టుకు పుట్టకొకరైన  అలనాటి ప్రియ మిత్రులతో  ఇంకాస్త ఎక్కవ సమయం గడపాలనీ! తొలి కొలువు చేసిన నెలకి  తిరిగి వెళ్ళగలిగితే బాగుండని తక్కువ పనులతో తిరగాలని కాదుగానీ  మొదటి జీతం తీసుకున్న ఆనందం  ఇంకొక్కసారి అనుభవంలోకి తెచ్చుకోవాలనీ! కన్న పిల్లలు ఇంకొన్ని రోజులు పసిపాపల్లా ఉండిపోతే బాగుండని తొందరగా పెరిగేస్తున్నారని కాదుగానీ బుడినడకల బుడతలైతే  మరికొన్నిరోజులు వాళ్ళతో ఆడుకోవచ్చనీ!  - రవి కిషోర్ పెంట్రాల  

ఓం శాంతి! శాంతి! శాంతిః!!

ఓ బొజ్జ గణపయ్య  నీ భక్తులమ్మేమయ్య  చవితి చంద్రున్ని చూస్తిమేమోనయ్య సతమతమవుతూ సాగుతుంటిమయ్య! ఆ నీలాపనిందలతో  గిల్లికజ్జాలైతే  గింజల నింపుతున్న గోతాన్ని  ఎత్తికుదేసి నింపితే చక్కగా ఒదిగినట్లు  వదులుగానున్న బంధాలన్నీ  వదులుకోనంత బిగుసుకుంటయయ్య ! ఆ నీలాపనిందలతో  ఉప్పూనిప్పైతే  తిప్పలెక్కువయ్యి  తిక్కలెక్కువయ్యి  చక్కనయిన స్నేహాలెన్నో  అక్కరకురాని అనుబంధాలుగా  చెదురుమదురై చిట్లిపోతయయ్య ! ఆ నీలాపనిందలతో  కొరివీచమురైతే  అగ్గి ఆరిపోదదయ్య  అలవిగాదదయ్య  అణచ వీలుకాదదయ్య అంతా ఆహుతేనయ్య! ఆ నీలాపనిందలతో  శత్రుఘ్నుల శత్రుత్వమైతే  మిస్సైల్ల పలకరింపులైతే  డ్రోన్ల దాడుల దర్శనాలైతే  మానవత్వమే మృగ్యమయ్య మనిషితనమే బ్రతకదయ్య మనిషి మనుగడే ఉండదయ్య! ఆ నీలాపనిందలు నిలువరించవయ్య మిక్కిలి తక్కువతో తిప్పలు తప్పించవయ్య విశ్వశాంతిని కాపాడవయ్య  దయతో శాంతిని ప్రసాదించవయ్య ఓ విఘ్నేశ్వరా సర్వవిఘ్నోపశాంతయే  ఓం శాంతి! శాంతి! శాంతిః! - రవి కిషోర్ పెంట్రాల 

తెలుసునా మిత్రమా!!

తెలుసునా మిత్రమా  మనమెందుకు ఒంటరైనామో  నడకకు జతలేక  పయనానికి దిక్కులేక! కలల గమ్యం వేటలో  ఆశల రహదారిలో  సొగసైన సవారీతో   పరిగెత్తించిన కోర్కెల గుర్రాలు హఠాత్తుగా అపరిచితులైనట్టు  తమదారి తాము చూచుకొని  ఒక్కటొక్కటిగా అదృశ్యమై  ఏ దూరాలకు పారిపోయాయో  ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా?  ఉచ్ఛ్వాస నిశ్వాసములకే ఉనికై  ఊపిరికే ఊపిరై ప్రాణములో ప్రాణమై  యదపొదరింట్లో కొలువై  అతిప్రీతిపాత్రమైన ప్రియకామన  ఉసురుదీసి జీవచ్ఛవాన్నిజేసి  ఎడంగా ఎందుకు వెళ్లిపోయిందో ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా? జీవితసాఫల్యతీరం దిశకు భద్రంగా పయనించు జీవననావ  నడిసంద్రపు సంధ్యలో  తొట్రుపాటుతో ముందుకు సాగనంటూ గమనమెటో తేల్చుకొమ్మంటూ  బ్రతుకునెందుకు  డోలాయమానస్థితికి లంగరేసిందో ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా? అంతటికీ కారణం  మస్తిష్కపు ఆలోచనా తరంగాల్లో అమాసనిశానిరాశల వత్తిళ్ల ప్రభావమనీ  ప్రయత్నపు పోరాట పున్నమి వెలుగుల్ని అలుపెరగక అధైర్యపడక ఆహ్వానిస్తే   వెన్నెల వెలుగుల ధైర్యమావహించి  కోరుకున్న ఆశల గమ్యానికి  నడకకు దశ దిశ తోడు దక్కేనని ఇప్పటికైనా ఆలోచించావా?? — రవి కిషొర్ పెంట్రాల

విశ్వావసు ఉగాది

కృషీవలురకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు  బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు! పెరుగు పైరుకు ఆయువవ్వు  పదును చేనుకు పంటనివ్వు  మకిలి మేనుకు బుద్ధినివ్వు మంచి మనిషికి మేధనివ్వు! తపనబ్రతుకుకు దారినివ్వు  ఒంటరి నడకకు తోడువవ్వు  బడుగు హెచ్చునకు నిచ్చెనవ్వు తలచిన గమ్యం చేరనివ్వు! ఎడదల కలతలని తరగనివ్వు  మనసుల మమతలని పెరగనివ్వు  మనముల వగపులని తొలగనివ్వు  మనుషుల సమతలని ఎదగనివ్వు! ఆపన్నుల కన్నీటికి కట్టవవ్వు సౌభాగ్యాల ఆనందపు సంద్రమవ్వు  ముంచుకొచ్చు ప్రళయాలే భస్మమవ్వు సౌజన్యుల జీవితాలు ప్రదీప్తమవ్వు! — రవి కిషొర్ పెంట్రాల

మా చిన్ననాటి సంక్రాంతి!!

హరిదాసు హరినామ సంకీర్తనలతో జంగమదేవర శంఖపు రవళులతో మా ఊరి ఆస్థాన విద్వాంసులు  నాయీ బ్రాహ్మల మంగళవాద్యమంత్రాలతో  హేమంతసిరుల మకర సంక్రాంతి మొదలు! ముత్యాలముగ్గుల గొబ్బిళ్లు ఇంటా బయటా   బంతిపూల తోరణాలతో  సింగారపు ద్వారాలు! గంగిరెద్దోళ్ళూ పిట్టలదొరలూ పగటేషగాళ్ళూ ఇంటింటినా పండగజరిపి త్వరగా గూడుజేరాలని  వడివడిగా వీధులన్నీ తిరిగేస్తూ సందడిజేస్తూ! మా మాష్టారికీ పూజారికీ చిరువ్యాపారికీ పాలూ కూరగాయలతో పండగ పలకరింపులు! ఊరంతా వంటల సువాసనల నెత్తావులు  తెలిమంచు పొరలతో పోటీగా నోరూరిస్తూ క్రొత్తపంటల పెద్దపండుగ తొలిపొంగళ్ళు! మా ఊరి చెరువేమో తెప్పోత్సవానికి ముస్తాబు మా ఇలవేల్పులు సీతారామలక్ష్మణులు ఆంజనేయ సమేతంగా మేళతాళాలతో పురజనులను అశీర్వదించుటకు సిద్ధం! ధన్యులు దేవుళ్ళపల్లకీ వీధుల మోస్తుంటే దేవుళ్ళేమో వీధిలోని రంగవల్లుల ఆస్వాదిస్తూ రంగురంగుల రథాలు నెమళ్ళు అబ్బురంగా మైమరచిన తన్మయత్వంలో చెరువుకి! కొలనుచుట్టూ ప్రజలు పండగకి ముస్తాబై అమ్మలక్కలు దేవుళ్లనికొలువ కొత్తకోడళ్ళతో దేవుడేమో ఏ ముగ్గులు ఏ రమణులు వేశారో రమణుల రంగవల్లుల పోల్చుతూ సీతమ్మతో! ఉత్సవమూర్తుల ఊరేగించు భాగ్యము మాకంటూ ఎడ్లగిత్తలు దేవుళ్ళను బండిపై ఊరేగిస్తుంటే రంగవల్లులపై తనివితీరని సీతారాములు ప్రతిగడపనా ఆగి చూచి హారతులుగైకొని వరాలిచ్చి అలసిసొలసి ప్రభాతానెపుడో గుడికి! ప్రతిసారి ఒక్కోసంబరం ఊరేగింపు బండెనక ఓ సారి బుర్రకథ హరికథోసారి కోలాటమోసారి!   తెప్పోత్సవ తిరుణాలే మా బొమ్మల కొలువులు దోస్తుల చెరువున ముంచితేల్చి కవ్వించుటే మా పాలిట జూదమెయ్యని పందాలు పతంగులు! కొత్త అల్లుళ్ళకు అళ్ళెము తయారుజేస్తూ అత్తలు అయిన వాళ్లందరినీ పరిచయంజేస్తూ ఆలులు బావలిచ్చిన గిఫ్టులజూచి మురిసే బామ్మర్దులు బ్రహ్మాండమైన ఈ ఉత్సవానికి తరించె మా ఊరు!  — రవి కిషొర్ పెంట్రాల

సంక్రాంతి పిండివంటలు!

అమ్మడూ ఓయ్ వాట్సప్ మెసేజ్ అమ్మాయి అల్లుడూ పండక్కొస్తారంట బియ్యం పిండికి మిషనుకి పట్టకెళ్ళనా పట్నంనుండి స్వీట్స్ పట్టుకురానా! అహ్ ఏంటోనండి ఆరోజుల్లో అయితే...! ప్రభాతాల్లో మంచుముసుగేసుకొని హేమంతాన సొగసుతో పల్లెంతా చలిమంటలా మేనిముసుగు తొలగిస్తూ  అమ్మాపిన్నీ ఎల్లమ్మాపుల్లమ్మ చలికి బెదరక! రోలుకీరోకలికీ పసుపూ కుంకమతో పూజజేసి రామన్నా భీమన్నా క్రొత్తబియ్యం దంచేస్తుంటే పుల్లమ్మా ఎల్లమ్మలు ఛలోక్తులతో పిండిజల్లేసి పాకానికి చక్కెర బెల్లాలతో తయ్యారు! ఆరుబయట పెద్దపొయ్యిన మంటకి చలిపరారు అమ్మలక్కల సందడితో ఇల్లంతా పండగకళ గలగలసవ్వడికి పిల్లలంలేచి కల్లొత్తుకుంటూ పాకపుతయ్యారీ రుచిచూస్తూ నీటిన పరీక్షిస్తూ! సలిమిడి రుచిజూస్తూ అరిసెలుజేస్తూ ఓ వైపు చెక్కలూ కారాలూ బూందీ నములుతూ ఓ వైపు! రుసరుసమని అరిసెలు నూనెలో కాలుతుంటె బుసబుసమని చల్లనికట్టెలు పొయ్యిలో కాలుతూ! వాయలు వాయలు అరిసెలూ కారాలూ దింపుతుంటే వాయకోసారి హరిదాసులో గంగిరెద్దులవారో  గారడివాళ్ళో పిట్టలదొర్లో రావడం వాళ్ళెంట మేము! అమ్మేసిన పిండివంటల వాయలు కొన్ని వాళ్ళకూ  వాళ్ళిచ్చిన అశీర్వాదాలన్నీ మా కుటుంబాలకి! సూరీడికీ పిండివంటల సవాసన అందిందేమో నాకివ్వరూ కొన్ని రుచులంటూ లేకిరణాలతో మబ్బులు దాటుతూ మంచుపొరల చీల్చుతూ వంటలన్నీ సుతారముగా తడుముతూ సందడి రుచులు నేనూ చూస్తానంటూ మళ్ళీ దొరికేనోలేదో ఈ పండగ సిరులని! - రవి కిషొర్ పెంట్రాల

ఆరేడడుగులే!!

జీవన వాసంతంలో  అరుదైన గమ్యందారిని  రమ్యంగానే దొరకబుచ్చుకొని ప్రియంగానే ప్రయాణిస్తూ బాటసారి! పులకించే ప్రేక్షకవనాలను కూసేకోయిల్ల పొగడ్తలను సందరాభిమాన విరులను  సువాసనల సంపదలనుజూచి.. ఉత్సాహంతో ఉరకలేస్తూ  ఘనకీర్తినార్జించిన మేధస్సుతో  అవరోధాలను అధిగమించి  తారాతీరపుగమ్యంజేరే ఆశలో..! నడకల్ని దహించే గ్రీష్మాలు కలల్నిముంచి దోచుకెళ్లే వర్షాకాలం  యోచనల్ని మొద్దుబార్చే హేమంతం కోర్కెలనిరాల్చే శిశిరాలుండేననీ మరిస్తే… తారలసరసకు చేరినవీరుల అడుగులజాడలు ఒడిచిపట్టకపోతే  ఊహలసొనతీగ నింగినంటినా  బ్రతుకెదుగుతీరందర్లా ఆరేడడుగులేనేమో? మధుమాసమే శాశ్వతమనుకొని ఆశలపల్లకిలో హమేశా ఊరేగితే   విద్వత్తుకు విడువక సానపెట్టుకోకపోతే ఆరేడడుగులుమించి జీవితమెదగదేమో??! --రవి కిషోర్ పెంట్రాల 

మానస పద్మవ్యూహం!!

నీ మానస  పద్మవ్యూహంలోకి  నేరుగా చొరబడుటకు  పదివేలదారుల్లేవుగా ప్రేయసీ! అడుగడుగునా అతిరథ మహారథులెందరో  యుద్ధంలో అడ్డుపడుటకు నేనా ఒంటరినే నెచ్చెలీ! వలపు యుద్ధభూమికి  పరిచయంలేని పసివాడిని  నేర్పరులైన నేస్తులూలేరు యుద్ధసన్నద్ధంజేయుటకు చెలీ! వెన్నుచూపుటా నేర్వలేదు  దార్లు పదివేలుగానీ  కోటిపదారువేలదారులవనీ ఢీకొందునందరినీ నీకై ప్రియా! మునుపు క్రీగంటజూచి  ఓ చిరునవ్వు విడిచిపోతివి దొరుకునేమోనని దొంగగా నిల్చినవ్వినచోటే తెగవెతికితి సఖీ! విరహపు గ్రీష్మతాపంలోవేగి  తొలకరివర్షపు ప్రేమలేఖలకు పరవశించి పరిమళముల  మెండుగా వెదజల్లు పుడమిలా! నీ చిరుక్షణవీక్షణ భాగ్యమునకే  హృదిలో పులకల పదనిసలురేగేనని   చూపులభాషతోనే విన్నవించాలని తొలిప్రాయపు ప్రేమికుల తపన!  - రవి కిషొర్ పెంట్రాల

అభిలాష

  అభిలాష!! అఖిల తారలు నీ పదపద్మములనుజేరి  అమితానురక్తితో కొల్చుటజూచి  పూటపూటనా ఇలాగ  మినుకుమినుకుమని మెరుస్తుంటి! విశాలాకాశానున్న నక్షత్రమండలాన నేటికిలా చుక్కనై ఉదయించితి  ఇన్నాళ్లూ ప్రవేశం నిషేదించితివి   తగననా నీ పవిత్ర పాదపూజకు? తూర్పుదిశను దొరికించుకొని  ఆకాశానికి మిక్కిలి శ్రమతో ప్రాకిప్రాకి  పశ్చిమసంద్రంలో పడిమునిగి  మరలమరల ఉదయాస్తమయాల  చట్రంలో తిరగుతున్నా, ఇంతేనా బ్రతుకు? భవసాగరమును తప్పుకొనుటకు  తగిన ఉపాయం దొరకదా  ఊరట కలగదా నీకిష్టమైతే నీ చల్లని చూపు సోకితే మాత!   తారలందరూ నడిచిన త్రోవలను వారు చేసిన ఆరాధనల తీరునిజూచి  అనునిత్యం నీ సేవలో తరించాలని  తత్తరపడుతున్న పసితారకను! ఆత్మపీఠమందు సదా నిన్నుంచి నిష్ఠతో సర్వదా అర్చించదలచితినే   నా ఆశ పేరాసనకుమమ్మా నను కరుణించి బ్రోవుమమ్మా నువ్వు తప్ప నాకెవ్వరే దిక్కమ్మా? ఓ నిఖిలజననీ ఆదిశక్తీ పరాశక్తీ!! - రవి కిషొర్ పెంట్రాల

ద రోడ్ నాట్ టేకెన్!

నిలువునా చీల్చిన పచ్చటి చెక్కలా ఆ రెండు మార్గాలు క్షమించండి.. నేను ఆ రెండు మార్గాల్లోనూ ప్రయాణించలేను ఒక్క మార్గంలోనే నేను నిరంతరం నిలబడే వున్నాను ఒకచోట అకస్మాత్తుగా మార్గం ఒంపు తిరిగింది మార్గం కనిపించినంత వరకు చూస్తున్నాను ఇప్పుడు మరో మార్గంలోకి ప్రవేశించాను ఈ మార్గం ఏదో కాస్తంత బాగుందని అనుకున్నాను పచ్చటి గడ్డితో ఆహ్లాకరంగా వున్న మార్గం ఇది ఈ మార్గంలో వెళ్తే గమ్యాన్ని చేరుకుంటానని అనుకున్నాను నేను అనుకున్నట్టే జరుగుతుందని ఆశిస్తున్నాను కానీ, నేను ఆ మార్గంలో కూడా ప్రయాణించలేదు నేను ఎక్కడైతే వున్నానో అక్కడే వున్నాను ఇప్పుడు మళ్ళీ మొదటి మార్గం గురించి ఆలోచిస్తున్నాను మొదటి మార్గంలో ఆ మలుపు తర్వాత ఏమి వుంటుందో తిరిగి ఎప్పుడు వెనక్కి రావాలా అనే ఆలోచనలో వున్నాను -రాబర్ట్ ఫ్రోస్ట్ (1874-1963)