వస్తోంది ప్లవం
posted on Apr 11, 2021
వస్తోంది ప్లవం
వికార ,శార్వరులను
నెట్టుకుంటూ,
చిరునవ్వులు చిందిస్తూ
ప్రవాహం లా వస్తోంది ప్లవం
ఒక ఒరవడి ఇది
చైతన్య స్రవంతి
చైత్రరథాన్ని ఆరోహించి
ఉత్సాహంగా, ఉల్లాసంగా
వస్తోంది ప్లవం
పుడమితల్లిని పులకరింపచేస్తూ
పూలపరిమళాలను వెదజల్లుతూ
ఆశయాలను అంకురింపచేసి
ఆశలను పండించటానికి
పరుగులిడుతూ
వస్తోంది ప్లవం
వికారి వికారాలను పోగొట్టి
శార్వరి కరోనా భయాలను
అరికట్టి
ఆనందోత్సాహాలను కలిగించ
ఒక ఒరవడియై
వస్తోంది ప్లవం
జీవిత గ్రంథంలోని
గతపేజీలను
కంట కానరాకుండ తిప్పేసి
సరికొత్త ఆశలతో
పరిగెత్తుకుంటూ
వస్తోంది ప్లవం
మల్లెల మొల్లలతో, కోయిల
కుహుకుహుగానాలతో
సహజ ప్రకృతి సొగసులతో
పచ్చపచ్చని పైరుల చేలాంచాలతో
తుమ్మెద ఝంకారాల సవ్వడులతో
ఉల్లాసంగా, ఉత్సాహంగా,
వస్తోంది ప్లవం
భవితకు చక్కని బాట వేస్తూ
వస్తోంది ప్లవం
పలుకుదాం స్వాగత వచనాలు
ప్లవానికి
పండుగుల ఆదికి, సంవత్సరాదికి
ప్లవనామ ఉగాదికి
స్వాగతం, సుస్వాగతం.
- డాక్టర్ కమలాదేవి