వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే

ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది.  అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.  ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం.  బాధ్యతల్ని ఎరిగిన తరం.  'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం.  డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం.  గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం.  ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.  కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం.  మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం.  TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం.  GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం.  సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం.  ACలు, కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.  మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి  ఆరోగ్యంగా బతికిన తరం.  పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం.  రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.  ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం.  ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం.  కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం.  క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం.  వీధి నాటకాలను,  తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం.  సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం.  ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.  పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం.  బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.  ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం.  ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.  భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.  వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం.  ఇతరుల మేలు కోరుకున్న తరం.  నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం.  రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం.  కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం.  హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం.  బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం.  లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.  కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం.  ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం.  ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం.  పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.  త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం.  కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.  అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది.  వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే! ( సేకరణ )                     

ఎట్టకేలకు తీరిన బాకీ

 ఎట్టకేలకు తీరిన బాకీ ​ 'DRK we are out!' అని అరిచాడు నా ఫ్రెండ్‌ సూర్యప్రకాష్‌. మరో పది సెకన్లలో మా స్కూటర్‌ కాలువ పిట్ట గోడకు బలంగా గుద్దుకుని ఎగిరి సగం నీళ్ళలో, సగం ఒడ్డున పడ్డాం. ఈ స్కూటర్‌ ఆక్సిడెంట్‌ కేరళలోని పాల్పాట్‌ పట్టణం దగ్గర గల చుంగమన్నం అనే గ్రామంలో జరిగింది. చచ్చిపోతాం అని తీర్కానించుకున్న నాకు బ్రతికి ఉండడం సంతోషాన్నిచ్చింది. చాలా ప్రాక్పర్లు అయి ఉంటాయనుకున్న నేను లేచి నిలబడి ప్రకాష్‌ దగ్గరకు వెళ్ళగలిగాను. అతని ముఖంలో బాధ కన్పిస్తోంది. లేవలేకపోతున్నాడు. మోకాలు నొప్పిగా ఉందని చెప్తున్నాడు. ఇంతలోనే బిలబిలమంటూ వచ్చేశారు చుట్టు ప్రక్కల ప్రజలు. ప్రకాష్‌ కాలు నొప్పిగా ఉందని మర్దనా చేయడం మొదలుపెట్టారు. అలా మర్దనా చేయకూడదని చెప్పడానికి నాకు మలయాళం రాదు వారికి తెలుగు రాదు. ఎలాగో అలాగు ఇతను డాక్టరు అని, పాల్పాట్‌ లోని డా. క్రిష్టన్స్‌ హాస్పిటల్‌ లో పనిచేస్తున్నాడని చెప్పాను. వెంటనే ఆ మర్ధనా ఆపేశారు. చెల్లా చెదురుగా పడిపోయిన నా ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ అన్నింటిని ఏరి జాగ్రత్తగా నాకు అప్పగించారు. వెంటనే ఒక టాక్సీని తీసుకువచ్చి నలుగురు కారులో మమ్మల్ని ఎక్కించుకుని డా. క్రిష్టన్స్‌ హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు. నాకు చిన్న చిన్న దెబ్బలే కానీ ప్రకాష్‌ కు ఒక మోకాలి చిప్ప ముక్కలయింది. ఈ విషయం తెలిసి బాధపడ్డారు. వారు వెళ్లిపోయేముందు టాక్సీకి డబ్బులు ఇవ్వబోతే ససేమిరా అంటూ తిరస్కరించారు. జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు స్కూటర్‌ తెచ్చుకోవడానికి వెళ్తే మళ్ళీ “టీ” ఇచ్చి మర్యాద చేశారు. కృతజ్ఞతలు ఎలా చెప్పాలో వారి భాష తెలియక భోరున ఏడ్చి నమస్కారం పెట్టి వచ్చాను. ప్రకాష్‌ తమ్ముడు మోహన్‌ గుంటూరు నుండి వచ్చి తనను తీసుకువెళ్లాడు.                                                  ***** ఇది 1982 జనవరిలో జరిగిన సంఘటన. ప్రకాష్‌ పాల్పాట్‌ లోని డా. క్రిష్ణన్స్‌ హాస్పిటల్‌ లో రెసిడెంట్‌ డాక్టర్‌ గా పనిచేస్తున్నాడు. నేనుకూడా ఆ ప్రాంతంలో ఉద్యోగం చేద్దామని వెళ్ళాను. నా ఉద్యోగ ప్రయత్నంలో భాగంగానే మేమిద్దరం స్కూటర్‌ పై ఒక ఊరు వెళ్తున్నప్పుడు దారిలో'చుంగమన్నం” అనే ఊరి వద్ద జరిగిన సంఘటన ఇది. ఆ ఊరి ప్రజలు మాకు చేసిన సహాయానికి 'చుంగమన్నం” గ్రామ ప్రజలకు “బాకీ”పడిపోయాం అని మా ఇద్దరికీ అనిపించేది. ఎప్పటికైనా ఆ ఊరికి వెళ్ళి వారందర్నీ కలిసి, వారు చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పాలని మాఆకాంక్ష. 1983 లో నేను, పద్మ పెళ్లి చేసుకు . హనీమూన్‌ కు ఊటీ, పాల్పాట్‌ లు వెళ్ళాం.    క్రిష్టన్స్‌ హాస్పిటల్‌ ముందు ఫోటో దిగాను. ఆ హాస్పిటల్‌ అప్పటికే మూతబడింది.  ఆ తరువాత మేము మా వృత్తి భవితవ్యంలో మునిగిపోయాం. ప్రకాష్‌ మోకాలుకి ఆపరేషన్‌ చేయించుకుని కోలుకున్న తర్వాతకొంతకాలం కొచ్చిన్‌ లో పనిచేశాడు. ఆ సమయంలోనే “గీత” అనే మలయాళీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమెరికాలోనూ, ఢిల్లీ లోనూ,హైదరాబాద్‌ లోనూ పనిచేసి 5 సంవత్సరాల క్రితమే విజయవాడకు వచ్చి స్థిర పడ్డాడు. అప్పటి నుండీ మేమిద్దరం 'చుంగమన్నం' వెళ్ళి ఆ గ్రామస్థులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటూనే ఉన్నాం. మధ్యలో కరోనా వచ్చిరెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం ఇద్దరం తప్పక వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు నాలుగు నెలల క్రితంస్కూటర్‌ నడుపుతున్న మా సూర్య ప్రకాష్‌ ను ఒక కారు వేగంగా గుద్దడం వలన అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నేనన్నాతొందరగా వెళ్ళి 'బాకీ” తీర్చుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాను. కానీ ఎవరిని సంప్రదించాలి? ఆ ఊర్లో మాకు ఎవ్వరూ తెలియదు. ఊరి ప్రెసిడెంట్‌ కు ఉత్తరం రాద్దాం అనుకుని గూగుల్‌ చేశాం. చుంగమన్నం అనే ఊరు “మాతూ ” అనే గ్రామ పంచాయితీలో ఉందని మాత్రం అర్థమయింది. “మాకు 1982 లో మీ ఊరి వద్ద ఒక స్కూటర్‌ ప్రమాదం జరిగింది. ఆరోజు మీ గ్రామస్థులు మాకు ఎంతో సహాయం చేశారు. మీ గ్రామస్థులకు ధన్యవాదాలు చెప్పడానికి అక్టోబర్‌ 21 వ తేదీ రావాలనుకుంటున్నాము. ఆరోజు మీరు, మీ పంచాయితీ మెంబర్లు, ఊరి పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం” అని ఆ ఊరి సర్పంచ్‌ కు ఒక రిజిస్టర్డ్‌ ఉత్తరం రాశాము. కేరళలో 40 సం. నుండి గైనకాలజిస్ట్‌ గా పనిచేస్తున్న మిత్రుడు డా. సుధాకర్‌ ఇంగ్లీషులో రాసిన ఆ ఉత్తరాన్ని మలయాళంలోకి తర్జుమా చేయించాడు. ఒక నెల ముందే ఈ ఉత్తరాన్ని ఫోస్ట్‌ చేశాము. కాకపోతే ఒక శంక! వారిని కలుసుకోవడానికి నేను చాలా ఉద్వేగంగా ఉన్నాను కానీ వారికి ఇదంతా చిత్రంగా - చాదస్తంగా అనిపించి చెత్త బుట్టలో పారేస్తారేమోనని. ఒక వేళ సమాధానం రాకపోయినా ఆ రోజు ఆ ఊరు వెళ్ళి ప్రమాద స్థలిని చూసి వద్దాం అనుకొన్నాం. ఓ రోజు 'మాతూర్‌” గ్రామ పంచాయితీ నుండి ఉత్తరం వచ్చింది. “అప్పటి సంఘటన మాకు తెలియదు. అప్పటి మనుషులు ఇప్పుడు ఉండకపోవచ్చు. మీరు తప్పకుండా మా ఊరు రండి” అని ఆ ఉత్తరం సారాంశం. సంప్రదించవలసిన నెంబర్లు ఇచ్చారు. ఎగిరి గంతేసినంత సంతోషం వచ్చింది ఆ ఉత్తరం చదవగానే! మా ఆక్సిడెంట్‌ జరిగిన రోజు విషయమంతా మరింత వివరంగా రాశాను. చల్లపల్లిలో పనిచేస్తున్న “అంబిలి” అనే కేరళ టీచర్‌ తో మలయాళం లోకి తర్జుమా చేయించాను. మలయాళం టైప్‌ చేసే  వాళ్ళు దొరక్క, అంబీలి దస్తూరి గుండ్రంగా ఉండడంతో ఆ రైటప్‌ ని స్కాన్‌ చేయించి ప్రింట్‌ చేసి తీసుకువెళ్ళాను. దాని స్కాన్డు కాపీని రెండు రోజుల ముందే వారికి వాట్సప్‌ లో పంపాను. . అక్టోబరు 20 వ తేదీ పాల్పాట్‌ సమీపంలోని హోటల్‌ లో బస చేశాం. ఆ మర్నాడు ఉదయం క్రిష్టన్స్‌ హాస్పిటల్‌ ఉన్న ప్రాంతాన్నిచూడడానికి వెళ్ళాం. గుర్తు పట్టేట్లు లేదు ఆ ప్రాంతం. అయితే జిల్లా ఆసుపత్రి ఎదురు గానే ఉండేది క్రిష్టన్స్‌ హాస్పిటల్‌. అదే బండ గుర్తు. ఒకమెడికల్‌ షాపు అతనికి ఆ హాస్పిటల్‌ పాత ఫోటో (1983 లో నేను, పద్మ వెళ్ళినప్పుడు తీసినది) చూపిస్తే“ఇదా ఎప్పుడో అమ్మేశారు గదా! ఇప్పుడు అందులో ఒక సహకార ఆసుపత్రి (Co-Operative Hospital) నడుస్తోంది” అని చెప్పాడు.అక్కడకి వెళ్ళి చూస్తే పాత బిల్లింగ్‌ ను రీ మోడల్‌ చేశారు. అక్కడ ఫోటోలు దిగాము.                                                అక్కడ నుండీ చుంగమన్నం వెళ్లాము. ఆక్సిడెంట్‌ చోటును తేలికగానే గుర్తు పట్టాను. ఆ వంతెన, మా స్కూటర్‌ గుద్దిన పిట్ట గోడ వద్ద నుంచాని ఫోటోలు దిగుతుంటే ప్రక్క ఇంటి నుండీ ఒకాయన వచ్చాడు. 41 ఏళ్ల క్రితం ఇక్కడ మాకు ప్రమాదం జరిగింది అన్నానో లేదో ఆ రోజు జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు చెప్పాడు. చాలా ఉద్వేగంగా అనిపించింది. అతని పేరు 'సిద్ధార్థన్‌' అట. బ్యాంక్‌ లో పనిచేసేవాడట. ప్రస్తుతం రిటైర్‌ అయిపోయా . ఆరోజు తాను లేడట. తన భార్య అంతా చూసిందని చెప్పాడు కానీ తానే చూసినట్లుగా వర్ణించాడు. మనిషి చాలా సీరియస్‌ గా ఉన్నాడు. సాయంత్రం 4 గంటలకు పంచాయితీ ఆఫీసులో మీటింగ్‌ ఉంది రండి అన్నాను నేను ఎంతో సంతోషంగా.                                                                                     “నేను రాను” అని ఖరాకండిగా చెప్పాడు. ఈ వయస్సులో మేం పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేం అన్నాడు. మేమేదో ఆ ప్రమాద దర్యాప్తుకి వచ్చాం అనుకుని కంగారుపడుతున్నాడని అప్పటికి అర్ధమయింది. “వీళ్ళు దర్యాప్తుకి వచ్చిన వాళ్లు |  కాదని, ఆరోజు ఆక్సిడెంట్‌ అయిన ఇద్దర్లో ఒక డాక్టరు ఈయనే' అని     మా డ్రైవర్‌ ఆయనకు మలయాళంలో అర్థం అయ్యేట్లు చెబితే అప్పటికినవ్వు ముఖం పెట్టాడు. “మీ భార్యతో మాట్లాడవచ్చా” అని అడిగాను.  కోవిడ్‌ వచ్చిన తర్వాత ఆవిడకు గుండె జబ్బు వచ్చిందని, చెకప్‌ కు పాల్గాట్‌ గ వెళ్ళిందని చెప్పాడు. అప్పటికే మీ ఇల్లు ఇక్కడ ఉందా అని అడిగితే పైన సిద్ధార్థన్‌ తో నేను షెడ్డు లేదు గానీ ఇల్లు అయితే అప్పటిదే అని చెప్పాడు. ఆయనతో ఫోటోలు దిగి వెనక్కి వెళ్లిపోయాం. సాయంత్రం 4 గంటలకు పంచాయితీ ఆఫీస్‌ కి వెళ్ళాలి కానీ 3.40 కే చేరుకున్నాం. మాతూర్‌ గ్రామ ప్రెసిడెంట్‌ శ్రీమతి ప్రవీదా మురళీధరన్‌”.ఆవిడే బయటకు వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆఫీసు లోపలికి తీసుకువెళ్లారు. అప్పటికే ఉప సర్పంచ్‌ ప్రసాద్‌, వార్డు మెంబర్లు, ఆఫీస్‌స్టాఫ్‌ ఉన్నారు. మేము లోన కూర్చొన్న కాస్సేపటికి ఊరి పెద్దలు ముగ్గురు నలుగురు వచ్చారు.పరిచయాలు అయిన తర్వాత హైదరాబాదు “ఆల్క్మండ్స్‌ స్వీట్స్‌” వారి 'కాజూ బర్ఫీ” లను వారికిబహూకరించాము. “ఆంధ్రా స్వీట్లు” అని సంతోషపడ్డారు. నేను రాసి, మలయాళంలో తర్జుమా   చేసిన రైటప్‌ ను ప్రెసిడెంట్‌ 'ప్రవిదిను చదవమని నా భార్య పద్మ అభ్యర్థించింది. ఆవిడ ఆ ఉత్తరం మొత్తం బిగ్గరగా అందరికీ వినపడేట్లు చదివింది. చదవడం పూర్తవగానే అందరూ చప్పట్లు కొట్టారు. నేను రాసిన రైటప్‌ ను చదువుతున్న ప్రెసిడెంట్‌ “ప్రవిది మురళీధరన్‌ వాళ్ళని చూసి మేమూ, మమ్ముల్ని చూసి వాళ్ళూ ఉద్వేగ భరితులమయ్యాం. ఊరి పెద్దలను పరిచయం చేశారు. 1982 లో ప్రమాదం జరిగితే 1983 లో మా ఇద్దరికీ పెళ్లయ్యింది. హనీమూన్‌ కు ఊటీ, పాల్పాట్‌ వచ్చాం మేం. అప్పుడు మీ ఊరు రాలేకపోయాం” అని నేనంటే “హనీమూన్‌ కు ఊటీ, కొడైకెనాల్‌, మున్నార్‌ వెళ్తారు కానీ పాల్హాట్‌ వచ్చిన వారిని మిమ్మల్నే చూశాం” అంటూ నవ్వాడు. ఒక కుర్రాయన. (పాల్పాట్‌ ఒక పట్టణమే కాని “హిల్‌ రిసార్ట్‌' కాదు కదా అని ఆయన ఉద్దేశ్యం) అందరం నవ్వుకున్నాం. ఇలా చాలా సరదాగా కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాం.మీ ఊరి అభివృద్ధికి మేం కొంత విరాళం ఇవ్వాలనుకున్నాం అని పద్మ 50 వేల రూపాయలు వారికి ఇచ్చింది. వారంతా చాలా ఆనంద - ఆశ్చర్యచకితులయ్యారు! అందరం కలిసి గ్రూపు ఫోటో దిగాం. మేం కూర్చున్న గది ఆధునికంగా ఉంది. ఆ మాటే అంటే ఇది  క్రొత్తగా నిర్మించింది అని, నిన్ననే పాల్పాట్‌ 31.4 దీన్ని ప్రారంభించారని చెప్పారు. మిగతా ఆఫీస్‌ కూడా చూడండి అని లోనికి తీసుకువెళ్లారు. ఆఫీసు చాలా బాగుంది. ఒక నోటీసు చూపించి “ఇది దేశంలోనే మొట్టమొదటగా  ఈ పంచాయితీ చేసిన తీర్మానం. సర్టిఫికెట్‌ కోసం వచ్చిన గ్రామస్తులెవ్వరూ ఈ ఆఫీసులో ఎవ్వరినీ సర్‌ అని గానీ మేడమ్‌ అని గానీ పిలవనవసరం లేదు. బ్రతిమిలాడుతున్నట్లుగా అప్లికేషన్లు రాయనక్కర లేదు” అని వివరించారు. ఈ విషయం నేను దినపత్రికలలో చదివాను గానీ అది ఈ ఊరిదని తెలియదు.అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి తిరిగి ప్రయాణమయ్యాం.    మేం కారెక్కిన ఐదు నిమిషాలలో మేం ఇచ్చిన రూ. 50,000కు  కంప్యూటరైజ్డ్‌ రశీదు QR కోడ్‌ తో సహా వాట్సప్‌ చేశారు. గతంలో జరిగిన ఆక్సిడెంట్‌ కు నా భార్యకు ఏమి సంబంధం లేకపోయినా తాను కూడా నాలాగానే ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. 41 ఏళ్ల క్రితం ఆ ఊరి వారు మాకు చేసిన సహాయానికి చేతులు జోడిస్తూ ధన్యవాదాలు చెప్పి, 50 వేల రూపాయల విరాళాన్ని ఆ గ్రామానికి ఇచ్చి నా “బాకీ'ని ఇలా తీర్చుకోగలిగినందుకు తేలికబడిన హృదయంతో తిరిగి వచ్చాం.ఆ మర్నాడు ఈ సంఘటన మొత్తం స్థానిక దినపత్రికలో ప్రచురింపబడిందని తెలిసింది. ఆఖరి మాట:    మానవ విలువలు అంటే...* శ్రమిస్తూ జీవించడం * నిజాయితీగా బ్రతకడం * తన పనులు తాను చేసుకోలేని వారికి మనకు ఉన్నంతలో సహాయం చేయడం - అని ఒక పెద్దాయన నిర్వచించారు.    పై లక్షణాలతో పాటు మనకు సహాయం చేసిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం కూడా చాలా అవసరం అని నా భావన. మిత్రుడు డా. సూర్యప్రకాష్‌ - డి. ఆర్‌.కె. 

ప్రపంచ మానవాళికి పెన్నిథి భగవద్గీత

ఉపనిషత్తులనే ఉద్యానవనం నుంచి ఆధ్యాత్మిక సత్యాలనే పుష్పాలను ఏర్చి కూర్చిన మాల  భగవద్గీత అన్నారు స్వామి వివేకనంద. అందుకే గీతను ప్రపంచ మానవాళికంతటికీ పెన్నిధి అంటారు. గీతలో భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం ఉన్నాయి. మనలోనూ భక్తిజ్ఞానాలు ఉన్నాయి. మనం ధ్యానం చేస్తాం. దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ కర్మలు (పనులు) చేయనిదే మన జీవితాలు ముందుకు సాగవు. మనకోసం, మన కుటుంబం కోసం పనులుచేస్తూ బతుకుతాం. జ్ఞానశూన్యమైన మానవేతర ప్రాణికోటీ అలాగే బతుకుతోంది. ఇలా బతకడం చెప్పుకోదగినదీ కాదు,     గొప్పదీ కాదు కొంచెం నిదానంగా ఆలోచిస్తే- మన జీవితాన్ని మహత్తరంగా మలచుకోవడం మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉందని అవగతమవుతుంది. అందుకోసం మన భక్తిజ్ఞానాలను, ధ్యానకర్మలను యోగాలుగా మలచుకోవాలి.  ఏ పనీ పాటూ లేకుండా, ఏ వ్యవహారమూ చేయకుండా మానవుడు వూరకనే ఉండడు. అలాగైతే మనిషి సోమరిగా, జడప్రాయుడిగా తయారవుతాడు. అప్పుడతడి జీవితం నిరర్థకమవుతుంది. అందుచేత, మన భావాల్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసేపని (కర్మ) మహాయజ్ఞంగా రూపొందుతుంది. దీనినే కర్మల (పనుల) ద్వారా పరమాత్మను సేవించడమంటారు, అర్చించడమంటారు. ఇందువల్ల ముక్తి లభిస్తుంది. కారణం? మన ఈ పనులవల్ల అన్ని ప్రాణుల్లోనూ ఉన్న పరమాత్మ సంతోషిస్తాడు కాబట్టి. పరహిత భావనతో మనం పనులు చేస్తే అందరి అంతఃకరణల్లోనూ అంతర్యామిగా వెలుగొందే ఆ పరమాత్మ ఆనందిస్తాడని అర్థం. లోకంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలంతా హాయిగా, ఆనందంగా ఉండాలనే కదా- తపోధనులైన మునీశ్వరులు ఆనాడు యజ్ఞాలు, క్రతువులు చేశారు... నేడు స్వాములు, ఆచార్యులు మొదలైన మనీషులు యజ్ఞయాగాదులు జరుపుతున్నారు. భగవంతుణ్ని ధ్యానిస్తూ, స్మరిస్తూ మనవృత్తిని (పనిని లేక కర్మను) ఫలాపేక్ష లేకుండా నిస్వార్థబుద్ధితో చేస్తే, అది కర్మయోగంగా మారుతుంది. ఇలా మన పనుల్లో మానవోచితమైన పరహిత భావన సైతం ఉన్నందువల్ల, భగవంతుడికి సన్నిహితులం, అయన కృపకు పాత్రులం కాగలుగుతాం. అందుకే కర్మయోగం దైవసన్నిధికి దగ్గరిదారి. కుటుంబంలో, సమాజంలో భాగమైనవ్యక్తి సొంత పనుల్లో నిమగ్నుడై ఉంటూనే భగవంతుని స్మరిస్తూ ఉండాలి. కర్మ ఫలితాన్ని ఆ అంతర్యామికే సమర్పించుకోవాలి. అలాంటప్పుడు ఆ వ్యక్తికీ సమాధి నిష్ఠలో ఉండే యోగికి లభించే ఫలితమే లభిస్తుంది. అంటే మన శరీరం ప్రవృత్తి మార్గంలో ఉన్నా, మనసు నివృత్తి మార్గంలో ఉంటే- అది కర్మయోగం అనిపించుకుంటుంది. అంటే ఆ వ్యక్తికి తానుచేసే పనివల్ల లభించే లాభనష్టాలతో సంబంధం ఉండదన్నమాట. దీనినే తామరాకుమీది నీటిబొట్టు చందంగా ఉండటమని అంటారు. జనక చక్రవర్తి రాజయోగం ఇదే. భగవంతుడి మ్రోల మన మనసు ఆవేశపూరితమై భక్తి పరవశమై ఉంటుంది. పూజ, ప్రార్థన, సంకీర్తన, నామస్మరణ, ధ్యానం, వందనాది తొమ్మిది విధాలైన భక్తి ప్రపత్తుల్ని అనుసరిస్తాం. ఈ భక్తిమార్గంలో పయనించి ముక్తిని పొందవచ్చు. ఇది భక్తియోగం. కొంతమంది ధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. బాహ్యమైన లోకవ్యవహారాలపై వీరికి ఆసక్తి ఉండదు. మనసును లేదా చిత్తాన్ని అంతర్ముఖంలోనే ఉంచుతారు. దీనినే ధ్యాన (ఆత్మసంయమ) యోగమని అంటారు. మరికొంతమంది వివేచనాపరులై ఉంటారు. విచారణ చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానులు సత్యాసత్యాలను, ఆత్మపరమాత్మలను గురించి వివేచిస్తారు. దీన్ని జ్ఞానయోగమంటారు. ఫలితం ఆశించకుండా నిష్కామంగా పనులు చేస్తే, అది కర్మయోగం అవుతుంది. భక్తి, జ్ఞాన, ధ్యాన యోగాదుల కన్నా కర్మయోగమే సామాన్యలకు సైతం ఆచరణ యోగ్యం, అనుసరణీయం. 

గురు దక్షిణ

డు,ము,వు,లు ప్రధమా విభక్తి, నిన్,నున్,లన్,కూర్చి, గురించి..ద్వితీయా విభక్తి. తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో.  తెలుగు మాస్టర్ గారంటే ఆక్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం. కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం. దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా.  “నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది.. నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది.. దివికి దివికి దిమాడి... గుబుకు గుబుకు గుమాడి... దివికి దివికి దిమాడి ... గుబుకు గుబుకు గుమాడి....” అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ, ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు…. పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడి పై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు.  “ఒరేయ్..ఇలా రారా!” మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి.  భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు.  పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత  ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని! అంతలోనే ధామ్...ధామ్  అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా.  “వెధవా..! నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే,  నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు  తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా?” మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు.  ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది.  తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక, పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు.  ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. ఆయనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు.  ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో, ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు. రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి.  ******* తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేశారు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు.  “అబ్బే... కుదరదండి. రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్  ప్రకారం అస్సలు కుదరదండి!” అంటూ పంపేశారు కలెక్టర్ గారు.  రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి. “మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా  చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి...” అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్. చేసేది లేక మాష్టారు, మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న  పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు.  “సర్.. ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు.. కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట.. ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.” అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ.  కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు. “రండి..! కూచోండి. మీ వివరాలన్నీ చూసాను.” అంటూ  మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు.  “ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు,” అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు.  మాస్టారు ఉప్పొంగిపోయేరు. “గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది.” అంటూ  కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు.  “అయ్యో...  మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం!” అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు. కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు  తెలుగు మాస్టారు.  “చేతన్, చేన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం.... తృతీయా విభక్తి...!” “కొఱకున్, కై ... ప్రజల కొరకు, ప్రజల కోసం పోరాడటం.. చతుర్ధీ విభక్తి ...!” “వలనన్, కంటెన్, పట్టి..... ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే..... పంచమీ విభక్తి ....!” “కిన్, కున్, యొక్క , లోన్, లోపల..... వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే..... షష్టీ విభక్తి...!” “అందున్, నన్....... అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను. సప్తమీ విభక్తి...!” “ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన  పాఠం! అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!” అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి.  “అవును మాస్టారు... నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి...” అన్నాడు మంత్రి శీనయ్య!!! నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు. కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు. అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ..... నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా..... చూస్తున్నారుగా......ఇపుడిలా” “మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా....... ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు.  మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి ....” “ఇది నా విన్నపం. కాదనకండి.” అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య  ఉరఫ్ శీను. గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు. “సార్ ..! మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట.” “మరేమి ఫరవాలేదు ... హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట ...” అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ... వచ్చి చెప్పాడు సెక్రటరీ. “మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారౌతున్నాడు ఈ మధ్య!” అంటూ ... తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు  మంత్రి గారు. ఆ ఇద్దరూ అంతలా పకా, పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.... షరా: అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను, కానీ అలాంటి మంత్రులను చూపమని అడగొద్దు.

సాంబారులో చందమామలు.

తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!...’ వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. ‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. ‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు. మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం. ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది! తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. ‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు. విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ. వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. ‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం!

దశకొద్దీ పురుషుడు… దానం కొద్దీ బిడ్డలు!

సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు .  మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది .  ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు .  పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు .  మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు .  పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు .  వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .   ప్రశ్న - సమాధానం  ---------------- ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ? స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం . ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ? స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం . ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు .  స : నిజమే స్వామీ ! ----------------- మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .  ఏ వివేక వాణి వచ్చి చెప్పాలి - మనది అకారణ బాధ అని .

సమస్త మానవాళికి ఆదర్శనీయుడు..హనుమంతుడు

  సకల సద్గుణ సంపన్నుడైన శ్రీ ఆంజనేయ స్వామీ  సమస్త మానవాళికి ఆదర్శనీయుడు.  హనుమంతుని గురించి ఎంత చెప్పినా తక్కువే..మూర్తీభవించిన సమగ్ర సమపూర్ణ స్వరూపమే శ్రీరామ దూత అయిన శ్రీ హనుమ రూపం.. మహీతలంపై ఎంత గిరులు, సరులు ఉంటాయో అంత వరకూ లోకాల్లో రామాయణ గాథ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది. హనుమంతుని  కీర్తించే ముందు రామ నామాన్ని జపించడం ముఖ్యం.  సేవ, త్యాగం, శక్తి, భక్తి, సమయస్పూర్తి అన్నీ కలిస్తే  హనుమంతుడు.   రామ భక్తుల గుండెల్లో కొలువై సుందర కాండకు బలమైన హనుమ పల్లె పల్లెకూ కూడళ్ళలో నిలిచి ధైర్యాన్ని ఇచ్చే పెద్ద దిక్కు. హనుమ గురించి రామాయణం అంతా చెప్పేది ఒకటే.. రాక్షసులకే కాదు భూత ..ప్రేత పిశాచాలు   కూడా ఆంజనేయుని నామం వింటే పరుగెత్తి పోతాయి. అటువంటి అంజనీసుతుడు సూర్యుని విద్యార్థి. సూర్యునితో పాటు సకల విద్యలూ నేర్చుకున్నాడు. సుగ్రీవునికోసం వెళ్లి రామాదుల దర్శనం చేసుకొన్నాడీ వాయునందనుడు. ఆ కేసరి తనయుని వాగ్దాటిని చూచి రాముడు అపశబ్దమే పలుకని ఇతడు నవవ్యాకరణ పండితుడని మెచ్చుకున్నాడు. అంతేనా పట్టుదలతో అనుకున్న పనిని చేయడంలో హనుమకు సాటి ఎవరు. ఇదిగో సుగ్రీవునితో స్నేహం కలుపు నీకు మేలు జరుగుతుందని రామునికి తెలిపింది హనుమే. చూచిన తోడనే సుశబ్దశోభితుడుగా కనబడ్డ సుందరుడు అంజనీసుతుడు ఆంజనేయుడు. కంటిని సీతమ్మను అని దుఃఖార్తిలో మునిగిపోయిన రామునికే సంతోషం కలుగజేసినవాడు. సీత జాడను తెలిపి  రామునికి దుఃఖాన్ని పోగొట్టడమే కాదు. సీతకు ధైర్యాన్ని ఇచ్చాడు. కాస్త ఓపిక పట్టుతల్లీ రాముడు నిన్ను యుధ్ధంలో గెలిచే అయోధ్యకు తీసుకువెళతాడని అభయాన్ని ఇచ్చాడు.  రాఘవుడున్నాడమ్మా నీ మనోభిరాముడు నీకోసమే ఎదురుచూస్తున్నాడమ్మా అంటూ శోకసముద్రంలో కొట్టుకొని పోయే సీతమ్మకు ఆసరాని ఇచ్చిన వాడు  హనుమంతుడే. ఎర్రపూలు, జిల్లేడు పుష్పాలు, తమలపాకులు అంటే అత్యంత ప్రీతి గలవాడు హనుమ. మంగళవారం నాడు వడమాలలిచ్చిన వారికి కోరిన కోరికలు తీర్చేవానిగా  ప్రసిద్ధుడు. పండు అనుకొన్నానంటూ సూర్యమండలానికి యెగిరి  సర్వదేవతల అనుగ్రహాన్ని వాత్సల్యాన్ని అందిపుచ్చుకున్నవాడు. తన బలం తనకు తెలియని అమాయకుడు. సురస సింహికల పోరాటంలో పోరాటపటిమనే కాదు బుద్ధికుశలత అవసరమని నిరూపించినవాడు. తన శక్తిని తెలియజేయగానే భీకర ఆకారుడై వందయోజనాల దూరం అవలీలగా లంఘించినవాడు. రాముని  శరణు పొందు బాగుపడతావు  అని రావణునికి ధైర్యంగా స్థైర్యంగా చెప్పినవాడు. శక్తి ఆయుధానికి మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం స్థావర్ణ్యికరిణి, సంజీవ కరణి, సంధాయనీకరణి లాంటి ఔషధులతో నిండి ఉన్న ఔషధీ పర్వతాన్నే తీసుకొచ్చినవాడు.శ్రీరామ జయరామ జయ జయ రామ.. అని రామ నామాన్ని జపిస్తూ, భజన చేస్తేచాలు ఒడలంతా పులకరించిపోగా నవోత్సాహంతో రామభక్తుల ఎదుట కనిపించే రామసేవాతత్పరుడు. అఖండ బ్రహ్మచర్య వ్రత పాలకుడు. వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణాలకు అతడు నిధియైనవాడు. ఇన్ని శుభలక్షణ సమన్వితుడు ఆంజనేయుడే కదా. ఈ రుద్రాంశసంభూతుడు, రామనామ జపనిరతుడు అయిన కేసరి నందనుడు వైశాఖ బహుళ దశిమినాడు అంజనీసుతుడుగా జన్మనొందాడు. జన్మించిన నాటి నుంచి అతులితబలశాలిగా ఎదిగాడు. ఆ హనుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హనుమజ్జయంతి సందర్భంగా రాముని మనసంతా నింపుకుని హనుమకు వందనం చేయడమే మనకు రక్ష. శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉన్నప్పుడే వాయు పుత్రుడైన హనుమంతుని ఆరాధన ఫలాన్ని ఇస్తుంది. హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఇది ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. హనుమ పూజలో ఎరుపు రంగు చాలా పవిత్రమైనదిగా చెబుతారు.జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్.

పొగడ్తా? అభినందనా?

పొగడ్తకి .. అభినందనకి తేడా ఏంటో తెలుసుకుందాం.. వైభవపురం జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఉత్తముడు.  జమీందారు విశ్వాసాన్ని  పొందిన ఉద్యోగుల్లో అతనొకడు.    ఒకరోజు  ఉత్తముడి  కొడుకు సూర్య   దివాణం చూడడానికి వస్తానంటే  అతణ్ణి తనతో తీసుకెళ్లాడు.  అతడికి పన్నెండేళ్ళు వయస్సు.  కానీ   చురుకైనవాడు.   వాళ్లిద్దరూ వెళ్లేసరికి జమీందారు  ఎవరో కొత్త వ్యక్తితో  మాట్లాడుతున్నారు.  జమిందారుకు నమస్కరించి   విధి నిర్వహణలో నిమగ్నమయ్యాడు  ఉత్తముడు. కొడుకును ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు.  అప్పుడే  గ్రామస్తుడొకడు వచ్చి   జమీందారుకి నమస్కరించి   ఇంట్లో బియ్యం నిండుకున్నాయని , సాయం చెయ్యమని   కోరాడు. పది రోజులకు సరిపడే  బియ్యం   అతడికివ్వమని సిబ్బందిని    ఆదేశించాడు జమీందారు.  జమీందారుకి నమస్కరించి వెళ్లిపోయాడు గ్రామస్తుడు.     జమీందారు  పక్కనున్న వ్యక్తి   మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు దేవుని చూసినట్టుంది.  దాన కర్ణుడు, శిబి చక్రవర్తి,  బలి చక్రవర్తి అంశతో పుట్టారు తప్ప మామూలు మనిషి  కాదు మీరు.   చేతికి ఎముక లేదన్నట్టు దానం చేయడం మీ దగ్గరే  చూశాను.  మీవంటి దానశీలితో మాట్లాడడం  సంతోషంగా ఉంది .  మిమ్మల్ని పొందడం  మీ ప్రజల అదృష్టం  అన్నాడు.   అతడి మాటలకు  జమీందారు   సంతోషించాడు.  అంతటితో ఆగకుండా   మీరు చేసిన దానధర్మాల గురించి బయటకు చెప్పకపోవడం గొప్పతనం. మీ వంటి  గుప్తదానాలు చేసేవారిని  ఇంతవరకు చూడలేదు   అన్నాడు. జమీందారు  సంతోషం రెట్టింపు అయింది.  అంత చిన్న సాయానికి  అదే పనిగా జమీందారుని పొగడడం ఉత్తముడికి నచ్చలేదు.  సొంత  పనేదో చేయించుకోవడానికి అతడొచ్చాడని గ్రహించాడు.     పొగుడుతున్న  వ్యక్తిని   చూసి   జమీందారు గారికి పొగడ్తలు  నచ్చవు.   ఇక ఆపండి  అన్నాడు ఉత్తముడు.  ఆ వ్యక్తి ముఖం మాడిపోయింది.  అతడిని ఆపి మంచి పని చేశావన్నట్టు  ఉత్తముడివైపు  మెచ్చుకోలుగా చూశాడు జమీందారు.   కాసేపటికి అక్కడకి కొందరు వ్యక్తులు  వచ్చి,   జమీందారుకి నమస్కరించి వాళ్లలో ఉన్న  మల్లయోధుడిని  చూపిస్తూ   ఇతడి పేరు భీముడు. మొన్న రాజధానిలో  జరిగిన  మల్ల యుద్ధ పోటీలలో ప్రథమ బహుమతి పొందాడు. అంతేకాకుండా  తిరుగు ప్రయాణంలో  బాటసారులను  దోచుకుంటున్న  దొంగల ముఠాను  ఎదిరించాడు.   ఎందరో బాటసారుల ధన.. మాన ప్రాణాలను కాపాడాడు. అతడిని   మీ చేతుల మీదుగా సత్కరించాలని  తీసుకొచ్చాము  అన్నారు.   వారి మాటలకు జమీందారు సంతోషించి   భీముడు వంటి మల్లయోధుడు మా దివాణంలో  ఉండడం  అదృష్టం.  అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాను.  మరెందరో  యువకులు  భీముడిని ఆదర్శంగా తీసుకొని మల్ల యోధులు, సైనికులుగా మారాలి. అందుకని భీముడి సన్మానం   నాలుగు గోడల మధ్య కాకుండా విశాలమైన వేదిక మీద.. ప్రజల మధ్య జరిపిద్దాం  అని వాగ్దానం చేసాడు.  ఉత్తముడు వారి  మధ్యకు వెళ్లి   జమీందారు  చెప్పినట్టు  భీముణ్ణి ఘనంగా  సత్కరించాలి.   ప్రజల మధ్య సత్కరించడమే అతడికి  సరైన గౌరవం. ఆ సన్మానం చూసి మరెందరో  యువకులు ప్రేరణ  పొందాలి. మల్ల వీరులు కావాలి. భీముడి  ధైర్య సాహసాలను వర్ణిస్తూ   గొప్ప  సన్మాన పత్రం కవుల చేత రాయించి బహూకరిద్దాం. తదుపరి  ఏర్పాట్లన్నీ పూర్తి  చేసి మిమ్మల్ని పిలుస్తాం  అని చెప్పాడు.  భీముడి అభిమానులు సంతోషంగా    వెళ్లిపోయారు.  ఉత్తముడు  తిరిగి ఆసనం దగ్గరకు వచ్చి కూర్చోగానే సూర్య  నాన్నా   నాదొక సందేహం. ముందొక  వ్యక్తి  జమీందారు దానగుణం గురించి మాట్లాడుతుంటే  పొగడ్తలు ఆపమన్నారు. ఇప్పుడు భీముడి ధైర్య సాహసాలను అదే పనిగా మీరు పొగిడారు.  ఎందుకలా  అనడిగాడు.  ఉత్తముడు  మొదట మాట్లాడిన  వ్యక్తిది  కేవలం పొగడ్త.  అందుకే  వద్దన్నాను. భీముడు గురించి మేము మాట్లాడింది అభినందన.  ఇది తప్పు కాదు  అని వివరణ ఇచ్చాడు.  పొగడ్తకి,  అభినందనకి తేడా ఉందా?  రెండూ ఒకేలా  ఉన్నాయి కదా అనడిగాడు సూర్య .  ఉత్తముడు అవసరమైన దానికంటే  ఎక్కువగా వర్ణించి ఎదుటి వ్యక్తిని మునగ చెట్టు ఎక్కించడం పొగడ్త. అవతల వారి నుండి ఏదో ఆశించైనా లేదంటే    పని జరిపించుకోడానికైనా  అలా పొగుడుతారు. నిజానికి  జమీందారు చేసిన  చిన్న సాయానికి అంత పెద్ద పొగడ్త  అక్కరలేదని భావించాను. అందుకే  అతణ్ణి వారించాను అని చెప్పాడు. అభినందన కూడా  మునగ చెట్టు ఎక్కించడం లాగే అనిపించింది  అన్నాడు  సూర్య.  ఎంతమాత్రమూ కాదు. మల్ల యోధుల పోటీల్లో  ప్రథమ బహుమతి  పొందిన భీముడి ప్రతిభను,  బాటసారులను కాపాడడం కోసం  ప్రాణాలకు తెగించి  పోరాడిన అతడి  ధైర్యసాహసాలను తప్పక ప్రశంసించాలి.  సమాజం కోసం పాటుపడే వారిని అభినందించినప్పుడే వారి  సేవలకు తగిన  గుర్తింపు దొరుకుతుంది. అందుకే  జమీందారుతో పాటు నేనూ  అభినందించాను. అభినందన అంటే ఉన్నదానికి విశేషణాలు అద్దటం . నిజానికి మంచి పనికి అభినందన ఎంతో అవసరం.  వారికి ప్రోత్సాహం అవుతుంది.  మరెన్నో మంచి పనులు చేయడానికి దోహదపడుతుంది.   భీముడిని చూసి మరెందరో   ప్రేరణ పొందుతారు  అన్నాడు  ఉత్తముడు. అయితే పొగడ్త మంచిది కాదా” అనడిగాడు సూర్య. గోరంతలు కొండంతలుగా చూపడమే పొగడ్త. అది మనిషి ఎదుగుదలకు అవరోధం అవుతుంది.  అహంభావం పెరగడానికి కారణమవుతుంది.  కాబట్టి పొగడ్త స్వీకరించకూడదు అని బదులిచ్చాడు  ఉత్తముడు.  ఇప్పుడు నాకు పొగడ్తకి,  అభినందనకి తేడా తెలిసింది. చిన్న చిన్న విషయాలకు లభించే పొగడ్తలకి పొంగి పోకుండా కష్టపడి చదివి గొప్ప స్థాయికి వెళతాను.  అప్పుడు మీ నుండి  అభినందన అందుకుంటాను  అని చెప్పాడు సూర్య.దాంతో   ఉత్తముడు..  సూర్య  తల  నిమురుతూ సంతోషం వ్యక్తపరిచాడు. ప్రతి ఒక్కరు  పొగడ్తల వాళ్ళ నష్టమే తప్ప ఒరిగేది  ఏమి లేదని తెలుసుకోవాలి.

జీవితం మీద విరక్తికి కారణం ఏంటో తెలుసా ?

  ఒక యువకుడికి తన సాధారణ జీవితం మీద విరక్తి కలిగింది. ఎక్కడో ఊరి బయట ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న జైన్  గురువును కలిశాడు. నాకు ఈ జీవితం విసుగెత్తిపోయింది. ఈ ప్రాపంచిక కష్టాల నుంచి బయట పడాలనుకుంటున్నాను. కానీ నేను కఠినమైన సాధనలేవీ చెయ్యలేను. ఏ పనీ ఏకాగ్రతతో చేయలేను. ఒక చోట కుదురుగా ఉండలేను. శాస్త్రాలు చదవడం, ధ్యానం చేయడం లాంటివి నాకు ఏమాత్రం సాధ్యం కావు. ఈ లౌకికమైన బంధాల నుంచి బయట పడడానికి..  నాలాంటి సామాన్యులు ఆచరించగలిగే పద్ధతులేవైనా ఉన్నాయా  అని అడిగాడు. నువ్వు ఇష్టంగా ఏ పని చేస్తూ ఉంటావు  అని ప్రశ్నించాడు గురువు. మేము ధనవంతులం. నేను ఎన్నడూ ఏ పనీ చెయ్యలేదు. ఎప్పుడూ చదరంగం ఆడుతూ గడిపేవాణ్ణి, అంతే అన్నాడు ఆ యువకుడు. అలాగా  ఆ ఆటే ఆడవచ్చు  అంటూ నౌకరును పిలిచి ఆ గదిలో ఉన్న సాధువును ఒక చదరంగం బల్లనీ, పావుల్నీ తీసుకురమ్మని చెప్పు  అని చెప్పాడు గురువు. కొద్ది సేపటికి ఆటకు అవసరమైన వస్తువులన్నటినీ తీసుకొని సాధువు అక్కడికి వచ్చాడు. అతనికి ఆ యువకుణ్ణి గురువు పరిచయం చేసి  ఇతనితో నువ్వు చదరంగం ఆడు  అన్నాడు. గురువర్యా! నేను ఎప్పుడో ఒకటి రెండుసార్లు ఆడాను. ఆ ఆట గురించి నాకు బాగా తెలీదు  అన్నాడు సాధువు. అలాగా  అంటూ తళతళా మెరుస్తున్న కత్తిని గురువు బైటికి తీసి  ఈ కత్తి ఎంత పదునుగా ఉందో చూశావా  ఆటలో ఓడితే ఈ కత్తితో నీ తల నరికేస్తాను. ఆ యువకుడు ఓడిపోతే అతని తల నరికేస్తాను. ఇక ఆట మొదలుపెట్టండి  అని ఆజ్ఞాపించాడు గురువు. వారిద్దరూ ఇక ఏం మాట్లాడలేక ఆట ఆరంభించారు. ఆ యువకుడికి వణుకు పుట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తన పరిసరాల్ని మరచిపోయాడు. అది అతనికి చావు బతుకుల సమస్య కావడంతో  ఏకాగ్రచిత్తంతో ఆడడం ప్రారంభించాడు. అతను ఆ ఆటలో మంచి నేర్పరి. తన గెలుపును నిర్దేశించే ఎత్తులన్నీ ఆలోచించి వేస్తూ  తన ప్రత్యర్థి అయిన సాధువును గమనించాడు. ఆ సాధువులో ఎలాంటి ఆందోళనా, అలజడీ లేవు. తను ఓడిపోతున్నానని తెలిసినా, ఓడితే తన తలను గురువు నరుకుతాడనే విషయం గుర్తున్నా  ఆ సాధువు ఏమాత్రం బెదరకుండా, ప్రశాంతంగా ఆట కొనసాగిస్తున్నాడు. ఇక కొద్దిసేపట్లో తన గెలుపు ఖాయమనే స్థితిలో ఉన్న ఆ యువకుడు  తన ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ముఖంలోకి చూశాడు.  ఆయన సర్వ సుఖాలనూ త్యజించి, పట్టుదలతో కష్టనష్టాలను ఎదుర్కొని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సాగిస్తున్నాడు. జ్ఞానాన్ని ఆర్జిస్తూ, దాన్ని ఇతరులకు పంచుతూ, పరోపకారిగా బతుకుతున్నాడు. అలాంటి వాడు ఆటలో ఓడితే మరణిస్తాడు. దానివల్ల లోకానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇక నా జీవితం ఎవరికీ ఉపయోగపడనిది. నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నాలాంటి వాడు ఆటలో గెలిచి బతికినా ప్రయోజనం ఏమిటి  అనుకున్నాడు ఆ యువకుడు. ఉద్దేశపూర్వకంగా ఆటలో తప్పులు చేశాడు. దీన్నంతటినీ జాగ్రత్తగా గమనిస్తున్న గురువు హటాత్తుగా ముందుకు వచ్చి.. చదరంగం బల్లను ఎత్తి విసిరేశాడు. మరికొద్ది నిమిషాల్లో విజేత ఎవరో తేలిపోయే సమయంలో  గురువు ఆటను చెడగొట్టి, ఇద్దరూ విజేతలేనని ప్రకటించాడు. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. జరిగినదాన్ని నిశితంగా గమనిస్తే  గురువు ఆజ్ఞను సాధువు ధిక్కరించకుండా, సంపూర్ణ శరణాగతితో, ఫలితాన్ని పట్టించుకోకుండా పోటీలో పాల్గొన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి మీద అర్జునుడు భారం మోపి, ఫలితాన్ని ఆయనకే వదిలేసి యుద్ధం చేసినట్టు శిష్యుడు వ్యవహరించాడు. కొత్తగా వచ్చిన యువకుడు ఏకాగ్ర చిత్తంతో ఆడాడు. విజయం వైపు అడుగులు వేశాడు. చివరి దశలో ప్రత్యర్థి మీద కరుణ కలిగింది. ఆ సాధువు బతకడం కోసం ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలనీ, తను మరణించాలనీ అనుకున్నాడు. అతనిలో  ఆ సమయంలో ఏకాగ్రత (ధ్యానం), కరుణ అనే ముఖ్యమైన రెండు గుణాలు వృద్ధి చెందాయి. వేల ఉపదేశాలు చేయలేని పనిని గురువు కల్పించిన ఆ పరిస్థితులు చేయగలిగాయి. ఆ తరువాత అతనికి జీవితంలో విరక్తి, విసుగు మాయమయ్యాయి.ఏ మనిషిలో  అయినా అపారమయిన మేధోసంపద ఉంటుంది. దాని సద్వినియోగ పరుచుకుంటే ప్రతి జన్మ ధన్యం అవుతుంది.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని మనం రక్షిస్తే ..ఆ ధర్మం మనని రక్షిస్తుంది..ఇది ఎప్పటినుండో వింటున్న మాటే అయినా పాటించేవారు యెంత మంది.. ధర్మం వైపు ఉన్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని మన ఇతిహాసాల్లో అనేక ఉదాహరణలున్నాయి. రామాయణంలో రావణుని తమ్ముడు విభీషణుడు రాముని పక్షం వహించినట్లే..   మహాభారతంలో కౌరవుల నుంచి ఒకడు పాండవ పక్షం వహించాడు. మహాభారత యుద్ధం ముగిసేనాటికి బతికి బట్టగట్టిన 11 మందిలో అతడూ ఒకడు. అతడే యుయుత్సుడు. కౌరవులలో మిగిలిన ఏకైక వ్యక్తి. ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుకకు కారకుడైన వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అతడు ఒకరోజు హస్తినాపురాన్ని సందర్శించాడు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఆయనకు భక్తిశ్రద్ధలతో అతిథి మర్యాదలు చేసింది. ఆమె సేవలకు మెచ్చి వ్యాసుడు వరం కోరుకోమన్నాడు.  నాకు వందమంది సంతానం కావాలని గాంధారి అంది. వ్యాసుడు ఆ వరమిచ్చి వెళ్ళిపోయాడు. వరాన్ని పొందిన రెండేళ్ల తర్వాత గాంధారి కౌరవులతోపాటు దుస్సల  అనే పుత్రికనూ కన్నది. కౌరవులు అనగానే దుర్మార్గత్వం. దుష్టత్వం గుర్తుకొస్తుంది.. కానీ కురు వంశంలోనే ధర్మాన్ని ఆచరించే యుయుత్సుడు అనేవాడు కూడా జన్మించాడు. ఇతడు గాంధారికి పుట్టిన వాడు కాదు. సుగధ అనే వైశ్య దాసి ద్వారా ధృతరాష్ట్రుడు కన్న పుత్రుడు. గాంధారికి సంతానం కలగడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆందోళన చెందిన ధృతరాష్ట్రుడు సుగధను చేరదీశాడు. దుర్యోధ నుడు, ఇతర కౌరవులు పుట్టిన రోజే యుయుత్సుడు కూడా జన్మించాడు. అయితే చిన్నప్పటి నుంచి దాసి పుత్రునిగా అతడికి అవమానాలు ఎదురయ్యాయి. అయినా వాటిని పట్టించుకోకుండా సకల విద్యలూ అభ్యసించాడు. 60 వేల మందిని ఒక్కసారిగా ఎదుర్కొన గలిగిన అతిరథుని హోదా అతడిది. కౌరవుల వైపు ఉన్న అతిరథుల్లో అతడు ఒకడు. అటువంటి యుయుత్సుడు మొదటి నుంచీ వారి చేతుల్లో అవమానాలు పడుతున్నందువల్ల  వారి దుష్టత్వం తెలిసినందు వల్ల కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాండవుల పక్షం వహించాడు. కౌరవులకు సంబంధించిన రహస్యాలు పాండవులకు చెప్పి వారి విజయానికి తోడ్పడ్డాడు.. కలియుగం ప్రారంభం అవ్వడంతో పాండవులు అర్జునుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి యుయుత్సుని అతడికి సంరక్షకునిగా నియమించి హిమాలయాలకు వెళ్లి. పోయారు. ఆ విధంగా ధర్మం వైపు నిలిచిన యుయుత్సునికి మేలు చేకూరింది.అందుకే ధర్మ పథంగా జీవించడం ప్రతి ఒకరికి అవసరం.

సకల సమస్యలకు పరిష్కారం ఆత్మ స్థైర్యం

  క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు కుంగిపోతే ఆ స‌మ‌స్య తీర‌దు స‌రిక‌దా న‌లుగురికి లోకువ అవుతాం. క‌ష్ట‌స‌మ‌యంలోనే ఒక మ‌నిషిలో ధైర్యం..ఆత్మ‌స్థైర్యం ఏంటో బ‌య‌టికి వ‌స్తుంది. ప్ర‌తీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఉండితీరుతుంది. నెమ్మ‌దిగా ఆలోచిస్తే ప్ర‌తీ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం ఉంటుంది..ఆత్మ‌స్థైర్యాన్ని ఎన్న‌డూ కోల్పొవ‌ద్దు. ఓ రోజు ఒక వనం లో ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ  అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది. దాంతో ఆ  పాము కోతిని కాటు వేయబోయింది.  భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకొని గట్టిగా అరవసాగింది.. చుట్టువున్న మిగతా కోతులన్నీ అక్కడకు వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం.. కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది.దాని  దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే.మనం దూరంగానే ఉండటం మంచిది అని అన్ని కోతులు వెళ్లిపోయాయి. దాంతో  తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన ఆ కోతికి నిరాశే ఎదురయ్యింది.అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకుని కూర్చుంది. అదే సమయంలో అటువైపుగా ఒక ముని వెళుతూ   కోతి ప‌రిస్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు. నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయి  అన్నారు. ఆ ముని మాటలు విని కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు పైకి ఎక్కేసింది. ఇందులోని నీతి ఏంటంటే.. నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు.కష్టాన్ని దూరంగా విసిరేసి ఆ స‌మ‌స్య‌కి  పరిష్కారం వెతకాలి. అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఎవ్వరూ నిన్ను రక్షించడానికి   నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు అని   గుర్తు పెట్టుకోవాలి. ఆ కష్టం తమను చుట్టుముడుతుంద‌ని భ‌య‌ప‌డి దూరంగా వెళ్ళిపోతారు.అందుకే ఎవ‌రైనా   కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు. కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు.ఆ కష్టాన్ని మంచి పరిష్కారంతో  తరిమికొట్టాలి. అప్పుడే ఎవ‌రైనా  ప్రశాంతంగా ఉండగలరు.. వారి  జీవితం సుఖమయం అవుతుందని గుర్తు పెట్టుకోవాలి.

ఆవకాయ... దేశభక్తి. దేహభుక్తి

ఆవకాయ... దేశభక్తి.  దేహభుక్తి  ఆవ‌కాయ‌కి దేశ‌భ‌క్తికి సంబంధం ఏంట‌నుకుంటున్నారా..ఓ బామ్మ త‌న మ‌న‌వ‌డికి చెప్పిన ఈ క‌థ వింటే ఆ సంబంధం ఏంటో తెలుస్తుంది. అంతేనా ఆవ‌కాయ‌కి..మ‌న జెండాలో ఉన్న రంగుల‌కి సంబంధం కూడా వివ‌రించింది ఈ బామ్మ‌.  ఒరేయ్ అబ్బిగా... నేను గమనించలేదు కానీ జెండా కనిపెట్టిన వాడు ఖచ్చితంగా మన తెలుగు వాడే అవుతాడు  అంది.    బామ్మోయ్... నీకెలా తెలిసే జెండా  కనిపెట్టింది నిజంగా  మన తెలుగు వాళ్లే  అన్నాడు అమాయకంగా పరమేశం . తెలుగువాడు కాకపోతే మరి ఎవరు కనిపెడతారు అంట,  ఆవకాయ తినేవాడికి మాత్రమే దేశభక్తి మెండుగా ఉంటుంది.  దేహభక్తి ఉన్న వాడు జాడీలో ఆవకాయ పెడతాడు.  దేశభక్తి వున్నవాడు జెండాని  కనిపెడతాడు.   ఆవకాయ తిన్న వాడికే జెండా  తయారు చేయడం వస్తుంది. వాళ్ళకి అదో లెక్కకాదు  అంది.   ఆవకాయకి జెండాకి ఏమిటే ముడి అన్నాడు .   ఓరి వెర్రి నాగన్న.  జెండాలో రంగులు చెప్పరా ఒక్కసారి  అనగానే వాడు పైన కాషాయం, మధ్యలో తెలుపు ,కింద ఆకుపచ్చ అన్నాడు .  చూసావా మన వాళ్ళకి ఎంత ముందు చూపు ఉందో  అంది బామ్మ . ఇందులో ముందుచూపు ,వెనక చూపు ఏమిటి  జెండా కోసం పింగళి వెంకయ్య గారు చాలా కష్టపడ్డారు .మధ్యలో నీలం రంగు చక్రం కూడా పెట్టారు  అన్నాడు.  అదీ విషయం .అలా చెప్పు .పింగళి వెంకయ్య గారు ఆవకాయ పెట్టడంలో లేదా తినడంలో దిట్ట అయి వుంటారు. లేదా వారి వంశస్తులు ఆవకాయ కనిపెట్టి వుంటారు.  అందుకే ఆయన మనసులో ఈ రంగులు కదలాడాయి అన్నమాట. ఇలా చూడు ఇవి ఆవకాయ దినుసులు. కనబడుతున్నాయా  అంది.  శుబ్బరంగా కనపడుతున్నాయి.  ఇవి మామిడికాయలు,అది ఉప్పు, ఇదిగో కారం.  ఇప్పుడు చెప్పవే బామ్మ  అన్నాడు పరమేశం . ఈ  మామిడికాయని చూడు ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతూ ఎంత బాగుందో, ఉప్పు తెల్లగా సున్నం వేసినట్టు లేదు .ఇక మిగిలింది బళ్ళారి కారం .కారం కాస్త కాషాయానికి దగ్గరలో ఉంటుందిలే .కాషాయం రంగులో కారం.. తెల్ల రంగులో ఉప్పు ఆకుపచ్చని రంగులో నవనవలాడే మామిడికాయలు మన జెండా కాదంటావా  అంది బామ్మ, జెండా  తానే  కనిపెట్టునట్టుగా.  మరి మధ్యలో చక్రమే  అన్నాడు పరమేశం.   ఇదిగో ఇవన్నీ పోసి  ఇలా గిరగిరా తిప్పడమే . అప్పుడు ఆవకాయ సిద్ధం. అదే చక్రం తిప్పడం .  ఇక ఆవాలు అంటావా  మన దేశ జనాభా     జెండా మన దేశం యొక్క ప్రతీక. ఆకాశంలో ఎగురుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది అనుకో. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటా ఆవకాయ్ జాడీలో ఊరుతూ ఉంటుంది. చూసావా జాడీకి జెండాకి కూడా అక్షరాలు ఎలా కలిసిపోయాయో అని బామ్మ అంటుంటే నోరూరించుకుంటూ వెళ్లిపోయాడు పరమేశం.  ఇలాంటి ఆలోచనలే వస్తాయి నిజంగానే పింగళి వెంకయ్య గారు ఆవకాయ పెట్టారా అందుకే ఆయనకి ఈ రంగులు గుర్తొచ్చాయా అనుకుంటూ నిద్ద ట్లోకి జారుకున్నాడు. మొత్తానికి ఆవ‌కాయ‌కి..భార‌తీయ‌జెండాకి సంబంధం ఉంద‌ని బామ్మ తేల్చిచెప్పేసింది. బామ్మ చెప్పిన ప్ర‌కారం చూస్తే ఒక‌ర‌కంగా ఉంద‌నే అనిపిస్తోంది.

మనిషి విలువ

మనిషి విలువ ఎంత విలువైన వ‌జ్రం  అయినా సాన‌పెడితేనే మెరుస్తుంది..అందుకే ఏ  మ‌నిషి విలువని ఎవ‌రూ అంచ‌నా వేయ‌డం అసాధ్యం..ప్ర‌తి ఒక్కరిలో ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది..ఏ మ‌నిషి అయినా వారిపై వారికి  అపార‌మైన విశ్వాసం ఉంటే ప్ర‌పంచాన్నే జ‌యించ‌గ‌ల‌రు. ఒక కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది. ఆ సందేహం అతన్ని నిలవలనీయలేదు, కూర్చోనీయలేదు. ‘మనిషి విలువ ఏమిటి? అన్నదే అతని సందేహం. తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే ఉంటుందనిపించింది ఆ కుర్రవాడికి. వెంటనే తాతయ్య దగ్గరకి పరుగు పరుగున వెళ్లాడు. ‘తాతయ్యా! తాతయ్యా! మనిషి విలువ, మనిషి విలువ అంటూ ఉంటారు కదా! అసలు మనిషి విలువ ఏమిటి?’ అని అడిగాడు. కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు కానీ చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు. ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరకి వెళ్లి, ఈ రాయి విలువ ఏమిటో ఒకొక్కరినీ అడిగి చూడు. కానీ పొరపాటున అమ్మవద్దన్నారు. ఎర్రగా తళతళా మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకుని కుర్రవాడు వీధిలోకి బయల్దేరాడు. ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది. దుకాణంలోకి వెళ్లి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘దీన్ని తీసుకుని మీరేం ఇవ్వగలరు, అని అడిగాడు. పండ్ల దుకాణదారుడు ఆ రాయిని ఎగాదిగా చూసి ఓ ఐదు డజన్ల యాపిల్స్ ఇస్తాను, అని గొప్పగా చెప్పాడు.ఆ తరువాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న రాయిని చూపించి ‘ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు  అని అడిగాడు. దానికి ఆ దుకాణదారుడు ‘నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధమ‌ని  చెప్పాడు. తన రాయికి పండ్లు, కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు. దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్లాడు. దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకుడు డంగైపోయాడు. ఈ రాయికి బదులుగా వంద గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం అనేశాడు. నగలవర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసిపారేయదగింది కాదనిపించింది ఆ కుర్రాడికి. దాంతో వాళ్లనీ వీళ్లనీ అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు.రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్లని తానే నమ్మలేకపోయాడు. ఓ ముఖమల్ వస్త్రం తీసుకుని బల్ల మీద పరిచి, కుర్రవాడి చేతిలోని రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు. ఇది మామూలు రాయి కాదు. ఇది ఓ గొప్ప పగడం. నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని నేను కొనలేను, అంటూ తలవంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు.రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన సంఘటనకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకుని అదెక్కడ చేజారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరుగుతీశాడు. తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు. ఇవాళ ఉదయం నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా! నీకు ఎదురుపడిన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. నువ్వు ఆ అమూల్యమైన పగడంలాంటి వాడివి. కానీ నీకు జీవితంలో ఎదురుపడేవారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం. వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి, విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు. జీవితంలో వాళ్లు విలువైనవి అనుకునేవాటికీ నీకూ పొంతన లేకపోవచ్చు. నిన్ను సరిగా అంచనా వేసే సామర్థ్యం వాళ్లకి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపారివంటివాడు నీకు ఎదురుపడతాడు. నీ విలువని అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు. కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం. అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి. అలాగే ఉండేందుకు ప్రయత్నించు. నీ మీద నువ్వు గౌరవం ఉంచుకో! పండ్ల వ్యాపారీ, కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చవకగా అమ్ముడుపోవద్దు అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మనిషి విలువ అమూల్యం అనేదే దీని అర్థం.

పరిపాలన

పరిపాలన                 అనగనగా ఒక దేశంలో ప్రజలందరూ కలిసి తమను పరిపాలించుకోవడానికి ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకు తెచ్చుకున్నారు. అందులో నియమాలు నిబంధనలు హక్కులు విధులు చట్టాలు అన్నీ ఉన్నాయి. ఆ దేశంలో ఒక 100 వరకు రాజ్యాలు ఉన్నాయి. వంద రాజ్యాల్ని పాలకులు చూడటం చాలా కష్టంగా అనిపించింది. అందుకని ప్రతి రాజ్యానికి ఒక రాజును ఎన్నుకోమని, అలాగే వంద రాజ్యాలకి వంద మందిని ఎన్నుకోమని ఒక ప్రకటన వెలువడింది.              అలా వెలువడిన ప్రకటనలో ప్రతి రాజ్యంలోనూ కూడా నేను ఉంటాను అంటే నేనుంటానని చాలామంది పోటీకి వచ్చారు. పోటీకి వచ్చిన తర్వాత, అలా కాదు.. అది జనాభా ప్రాతిపదికన ఎన్నుకోవాలి, లేకపోతే అందరూ కలిసి ఎవరు రాజుగా ఉండాలనుకుంటున్నారో వాళ్లు తమస్థాయిలను బట్టి వాళ్ళు చేసేటటువంటి పనుల్ని బట్టి వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అనగా నేను ప్రజల కోసం చెరువుల తవ్విస్తానని ఒకరు, నేను ప్రజల కోసం రోడ్లు వేస్తానని ఒకరు, నేను ప్రజలకి ఆర్థికంగా లాభాలు చేకూరుస్తానని మరొకరు, నేను ప్రజలకు విద్యను అందిస్తాను అని ఇంకొకరు, నేను ప్రజలకు వైద్యాన్ని అందిస్తానని మరొకరు.. ఇలాగా రకరకాలుగా తమ అభిప్రాయాలు తెలియజేశారు.               అలాగే రాజ్యంలో ఎన్నికలు జరిగి వంద రాజ్యాలకి వంద మందిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నిక కాబడినవాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత తాము చేస్తామన్న పనులు మాని తమ స్వలాభం కోసం కోట్లాది రూపాయలు కూడపెట్టుకుని వందల ఎకరాలు భూములు స్వాధీనం చేసుకుని తాము చేస్తామన్న పనులు మర్చిపోయారు. ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలా జరుగుతూనే ఉంది. వచ్చిన వాళ్ళు ఈవిధంగా అబద్ధపు వాగ్దానాలు, డాబు కబుర్లు చెప్పడం, తనని ఎన్నుకోడానికి ప్రజలకి అవి ఇవి ఇస్తానని చెప్పడం, తాత్కాలిక అవసరాలు తీర్చి ప్రజలను మభ్యపెట్టి పదవులు పొందడం.. అలా చేస్తూ ఉండేవారు. అయితే ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత ప్రజలలో కొంత మార్పు వచ్చింది.     ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే ప్రజల్లో వంద రాజ్యాలకి ఎన్నుకోబడేవాళ్లు బాగా చదువుకుని ఉండాలి. ఏ ఉద్యోగం లేకుండా ఉండి ఆస్తిపాస్తులు లేని వారై ఉండాలి. వారి పదవీకాలం పూర్తి అయ్యేసరికి వారి జీతానికి సంబంధించిన ఆస్తులు తప్ప ఎలాంటి ఆస్తులు వారికి ఉండకూడదు. వారికే కాదు ముందుగా తెలుపబడినటువంటి విధంగా బంధువులకు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులకి గాని, అంతకుమించి ఆస్తులు ఉండకూడదు. ఎన్నుకోబడినవారికి ఇచ్చే జీతం కూడా మామూలు జీతం కంటే ఎక్కువ ఇవ్వబడుతుంది. వీళ్ళు కేవలం ప్రజా సంక్షేమ దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. అలా చేయటం వల్ల వీళ్ళు ఒక రూపాయి కూడా ఆశించకుండా ప్రజల అవసరాలను సక్రమంగా తీర్చాలి. లేదంటే వీళ్లు శిక్షార్హులవుతారు.     బాగా డబ్బున్న వ్యక్తులకి రాజ్యాధికారం అప్పచెప్తే వాళ్లు ప్రతిదీ డబ్బుతో కొనడం అన్యాయాలు అక్రమాలు ఇలాంటివి చేయడం జరుగుతుందని ప్రజలు గమనించారు. కాబట్టి ఈసారి ఎన్నుకునే వ్యక్తుల్ని అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న తర్వాత ఒక్కొక్క రాజ్యానికి ఒక వ్యక్తిని బాగా చదువుకుని ఎటువంటి ఆస్తిపాస్తులు లేని, తమకే కాక తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా ఆస్తిపాస్తులు లేని వ్యక్తులను వంద రాజ్యాలకు వంద మందిని ఎన్నుకున్నారు.     ఎన్నుకోబడిన వందమంది వ్యక్తులు తమ పరిపాలనని ప్రారంభించారు. ముందుగా ప్రజలకు కావలసినటువంటి నిత్యావసరాలు ఏంటో వారు తెలుసుకున్నారు. వాటిని తీర్చడానికి ఆర్థిక ఆదాయ వనరులను వారు గుర్తించారు. ఆదాయం పెరిగితే ఆ పెరిగిన ఆదాయాన్ని బట్టి ప్రజల యొక్క అవసరాలను తీర్చవచ్చు అని ముందుగా ఆదాయం పెరిగేటటువంటి వాటిపై వారు దృష్టిపెట్టారు. మామూలుగా ఇచ్చేటటువంటి జీవితం కంటే రెట్టింపు జీతం వారికి ఇవ్వబడింది కాబట్టి వారు ఎటువంటి అవినీతికి పాలుపడలేదు. ఇలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందజేయబడ్డాయి. ప్రజలకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు ఖర్చు పెట్టడం వల్ల ఎలాంటి అవినీతి జరగకుండా ప్రజాపాలన చక్కగా కొనసాగింది. ఎన్నుకోబడ్డ పాలకులు వందమంది కూడా ఒక్క రూపాయి ఆశించకుండా తమకు ఇచ్చేటటువంటి ప్రజల సొమ్ములో రెట్టింపు జీతాన్ని తాము అనుభవిస్తూ ప్రజల కోసం కష్టపడడం, కష్టపడి పనిచేయటం ప్రారంభించారు. అలా అతికొద్దికాలంలోనే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అయింది. అనేక సౌకర్యాలు ఆ దేశంలో సమకూర్చబడ్డాయి. ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు.         ప్రపంచంలో అన్ని దేశాలకు అది ఆదర్శదేశంగా నిలిచింది. ప్రజలను పాలించేటటువంటి ప్రభుత్వం, ప్రజలు తీసుకున్నటువంటి చక్కటి నిర్ణయం వారి జీవితాలను మార్చేసింది . అలా ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటే, వారికి పాలన అప్పగించడం కంటే ఏమీ లేని వారిని తీసుకొచ్చి ఏమీలేని తెలివైనవారిని చదువుకున్న వారిని తీసుకువచ్చి వాళ్ళకి మామూలుగా ఇచ్చే దానికంటే కొంచెం ఎక్కువ జీతం ఇచ్చి వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎంక్వయిరీ చేసి, ఎలాంటి బినామీ ఆస్తులు ఏర్పరచుకోకుండా ఉండేలాగా నీతిగా నిజాయితీగా పనిచేసేవారిని ఎన్నుకుంటే దేశం అత్యద్భుతమైన రీతిలో పేరు ప్రఖ్యాతులుగాంచి సకల సౌకర్యాలతో ప్రజల సుఖంగా జీవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.          ప్రజల ఆలోచనలు బట్టి ప్రభుత్వం అనేది ఉంటుంది. ప్రజల ఆలోచన బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది. పరిపాలన బాగుంటుంది. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది. తీసుకునే నిర్ణయం నీతిగా న్యాయంగా ఉండాలి తప్ప కులమత వర్గ ప్రాంత భేదాలును బట్టి ఉండకూడదు. ఒకరి స్వార్థం వందమందికి నష్టం కలిగిస్తుంది. ఒకరి స్వార్థం వందమందికి బాధలు కలిగిస్తుంది. మన స్వార్థం వలన అమాయకులైన ప్రజల నోటికాడి తిండిని మనం లాక్కుని మనము, మన కుటుంబ సభ్యులు అనుభవిస్తే అది ఏదో ఒక రీతిన మన కుటుంబానికి తీరని నష్టం చేకూరుస్తుంది కాబట్టి పాలించే పాలకులు తమకు వచ్చిందాన్ని బట్టి పనిచేయడం తప్ప అక్రమంగా దోచేయాలంటే దానికి పైనున్న భగవంతుడు మనకి తీరని శిక్ష విధిస్తాడు. ఇది వాస్తవం. - వీధి దుర్గారావు

నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక

నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.  ఆమె పిల్లలు పడుకున్నారు! భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు. చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు! "ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.  నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని. "అయితే...?" "ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!" భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?" హెడ్డింగ్ ఇలా పెట్టాడు నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక. అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు! వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!! నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు! అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు! కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ... నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు! వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు! వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!  అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే! అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు! అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు! ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు! దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు! దాన్ని చాలా ఇష్టపడుతారు!! దానితో రిలాక్స్ అవుతుంటారు!! దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!! దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు  రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!! ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!! కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!  భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా... "ఎవరు రాశారది? " అడిగాడు భార్యని. "మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా! వస్తువులను ఉపయోగించుకోవాలి! బంధాలను ప్రేమించాలి!! అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!...... ఇది నిజంగా జరిగిన కథ..  కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి .. దయచేసి ప్రతిఒక్కరూ ఆలోచించండి మీ గుండెను తాకితే ... మరికొన్ని గుండెలకు చేర్చండి ,,, కొంతమందైనా మారే అవకాశం కల్పించండి.  

దిద్దుబాటులో వెలుగుబాట!!

దిద్దుబాటులో వెలుగుబాట!! తెలుగు సాహిత్యంలో ఎంతో గొప్పగా చెప్పుకునే రచయితలు, సామాజిక, సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో గురుజాడ అప్పారావు గారు కూడా ఒకరు. ఈయన రచయితగా, కవిగా, సంఘసంస్కర్తగా తెలుగు వారి గుండెలో ఎంతో బలమైన ముద్ర వేశారు.  ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి, బాల్యవివాహాలు అణిచివేయడానికి, సామాజిక చైతన్యానికి తన అక్షరాలనే అస్త్రాలుగా మలచి ప్రజల్లోకి వదిలి, ఆలోచనలను రేకెత్తించినవాడు గురజాడ అప్పారావు. ఈయన కన్యాశుల్కం నాటకం ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలిసిందే. శతాబ్ద కాలం దాటినా దాని ప్రభావాన్ని కోల్పోని, నేటి కొత్త సాహితీకారులు తప్పకుండా చదవాల్సినది కన్యాశుల్కం. అయితే ఈయన రచించిన వాటిలో దిద్దుబాటు అనే చిన్న కథ సూక్ష్మంలో ఎంతో గొప్ప సారాన్ని చెబుతుంది.  అసలు ఏమిటీ దిద్దుబాటు!! శీర్షికలోనే అర్థమంతా ఉంది. ఇందులో ఎలాంటి ఘోడార్థం లేదు. చేసిన తప్పును సరిదిద్దుకోవడం, తను చేసింది తప్పు అని గ్రహించడం. క్లుప్తంగా ఇదీ కథ. అయితే దాన్ని కథగా చూడలేము, ఎందుకంటే అన్నీ వాస్తవ జీవిత సదృశ్యాలే అందులో కనబడతాయి. ఈ కాలానికీ….. దిద్దుబాటు!! అవును కాలానికి సంబంధం లేని కథ ఇది. కాలాలు ఎన్ని మారినా ఎప్పటికీ నిలిచి ఉండే కథ.  చదువు ఆవశ్యకతను ఎంతో చక్కగా చెప్పిన కథ, బంధాలు ఎలా చక్కదిద్దుకోవాలో ఎంతో చక్కగా తెలియజెప్పే కథ. చదువుకున్న వాడు, సామాజిక చైతన్యం కలవాడు, పురుషాధిక్యత చూపించనివాడు కథలో పాత్రధారి గోపాలరావు. కానీ ఒకటే మచ్చ, మీటింగులు, బయట ఏవో పనులు అంటూ రాత్రిళ్ళు ఎప్పుడో ఒంటిగంటకు ఇంటికి వెళ్తున్నాడు. గోపాలరావు భార్య కమలిని ఎంతో చక్కనిది, భర్త అంటే ఎంతో గౌరవం, అంతకుమించి ఆరాధనా!!  ఒకరోజు గోపాలరావు రాత్రి ఒంటిగంటకు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా చీకటి, దీపము లేదు, దీపం పెట్టే ఇల్లాలు కనిపించలేదు, పనివాడు రావుడు, వాడిలో పితృస్వామ్య వ్యవస్థ తొంగిచూస్తుంది. భార్యను భర్త అణగదొక్కడం లేదా బెదిరించడమనే వృత్తంలో ఉంచాలని చెప్పినట్టుంటాయి వాడి మాటలు.  పంతులుగారికి బుద్ధి వచ్చిందని, ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పాడని పుట్టింటికి వెళ్లిపోయిన భార్యకు చెప్పి తీసుకురమ్మంటాడు గోపాలరావు. అక్కడ కూడా ఎన్నో ఏళ్లుగా పనివాడిగా ఉన్నాడనే నమ్మకంతోనే వాడికి ఆ పని చెబుతాడు. అదొక బాధ్యతాయుతమైన నమ్మకం. తప్పు చేసినపుడు మగవాడు అహంకారం చూపించకుండా వైవాహిక జీవితాన్ని సరిచేసుకునే మార్గం. "ఆడవాళ్లకు చదువు చెప్పించగానే ఇలాగే చేసి పోతారు" అనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడతాడు రావుడు. కానీ గోపాలరావు అంటాడు "ఓరీ మూర్ఖుడా భగవంతుడు సృష్టించిన ఉతృష్టమైన వస్తువు చదువుకున్న అడపిల్లనే" అంటాడు.  అంటే ఆడపిల్లకు చదువు ఎంత ముఖ్యమో 1910 సంవత్సరంలోనే ఈ కథలో గురజాడ గారు అందరికీ అర్థమయ్యేలా ఎంతో చక్కగా వివరించారు.  కాయహ ఆసాంతం చదివిన పాఠకులకు అయ్యో ఈ గోపాలరావు మంచోడే, ఈయనను వదిలేసి  కమలిని అలా ఎలా వెళ్లిపోయిందో, గోపాలరావు తప్పు చేసాడు నిజమే, కానీ ఆ తప్పు మినహయిస్తే అతడు ఎంతో మంచివాడు కదా అనుకుంటారు చదువరులు. కానీ….. గోపాలరావు బుద్దొచ్చిందన్నాకా, కమలినిని తీసుకురమ్మని రావుడికి చెప్పాకా, ఆ గదిలో మంచం కింద నుండి కమలిని కిలకిల నవ్వులు పాఠకులకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతాయి. ఎలాంటి అనవసర హంగామా లేకుండా సాగిపోయే ఈ  కథలో  ఎదుటి మనిషిని అర్థం చేసుకోడంముఖ్యంగా ఎదుటి వారి ఆలోచనలకు, ప్రవర్తనకు గౌరవం ఇవ్వడం ఇంకా చెప్పాలంటే పనివాడని రావుడుని కొట్టినా మళ్లీ మానవత్వంతో లోపలికి తీసుకెళ్లి ఎంతో ఆత్మీయంగా మాట్లాడటం ఇలా చూసే ప్రతి కోణంలోనూ ఎంతో గొప్ప కథగా అన్ని కాలాల మీధా నిలబడుతుంది. ఈ దిద్దుబాటు పిల్లల ఆలోచనకు ఓ మంచి వెలుగుబాట!! ◆వెంకటేష్ పువ్వాడ.

అమ్మతనం

అమ్మతనం                                                                                    “అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్ స్టిచ్ కుడ్తున్న ప్రతిమ ఉలిక్కిపడింది.సూది ఎడమచేతి బొటనవేలులో కసుక్కున దిగి రక్తపుచుక్క తెల్లటి చీరపైకి ఎగజిమ్మింది. సూది గుచ్చుకున్న బాధకన్నా తెల్లటి చీరపై ఎర్రటి రక్తంమరక ప్రతిమ సహనాన్ని చంపేసింది.అర్ధగంటనుండీ గమనిస్తూనే ఉంది.ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం,రిమోట్ లాక్కోవడమో,దాచేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.ఏదో సెలవులలో టి.వి.ని కాసేమయినా చూడనీ పాపం,ఎందుకు కట్టడి చెయ్యాలి అని ఊరికే వుంది కాని,ఆమె ఓర్పును పరీక్షిస్తున్నారు ఎనిమిదేండ్ల పెద్దకొడుకు సాత్విక్,ఆరేళ్ల చిన్నకొడుకు రుత్విక్. ‘చక్కగా అమ్మాయిలే నయం, ఇంతరొద ఉండకపోను,అయినా చిన్నాడెందుకు అబ్బా అని అరిచాడు? ’   “మీరిద్దరు అన్నదమ్ములేనా,వాలిసుగ్రీవులా? ”అని అరచింది ప్రతిమ. “వాలిసుగ్రీవులు అన్నదమ్ములే మమ్మీ! ”కిసుక్కుమంటూ పెద్దకొడుకు సాత్విక్ తాను నిద్రపోకముందు తండ్రి దగ్గరవిన్న పురాణాల సారాన్ని తల్లికి వివరించబోయాడు. “రామలక్ష్మణులలాంటి అన్నదమ్ములా లేక వాలిసుగ్రీవులలా బద్ధవైరులా అని నా అర్థం.ఆ సంగతి వదిలేయ్,ఇంతకీ వాడినేం చేసావు అంతలా అరిచాడు! ” తీవ్ర స్వరంతో గద్దించి మరీ అడిగింది ప్రతిమ. “నేనేం చేయలేదు”. రోషంగా తలెగరేసాడు సాత్విక్.   -2- “అన్నీ అబద్ధాలే మమ్మీ ఇక్కడ చూడు చేతిమీద గోరుతో గిచ్చాడు. ” గాటుపడిన చేతిని చెయ్యిచాపి చూపించాడు రుత్విక్.  “మరి నా చెయ్యి చూడు మమ్మీ ఎలా కొరికాడో!దద్దురు తేలిన చేతిని తల్లికన్నుల దగ్గరకు చాపి చూపించాడు రుత్విక్.పంటిగాట్లు కూడా లోతుగానే పడ్డట్లున్నాయి.రక్తం రాలేదుకాని గూడు కట్టినట్లయింది. “ఏరా ఒకటివ్వాలా!ఐనా పెద్దవాడివి సర్దుకుపోలేవూ-రిమోట్ దగ్గర గిచ్చి కొరుక్కుంటారా కాట్లు పడేటట్లు! ఛీ..ఛీ మీతోవేగలేకపోతున్నాను” అంటూ టి.వి. ఆఫ్ చేసింది ప్రతిమ. వేసవి సెలవులయినా,పండుగ సెలవైనా పిల్లలకు ఆటవిడుపే కాని పిల్లలతో వేగాలంటే ఒకింత కష్టమే1 ఇక వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లల అల్లరి భరించి మళ్లీ బడికి వెళ్లేదాకా  పిల్లలతో వేగాలంటే  ఇల్లాలికి ఓ తట్టెడు ఓర్పు,బుట్టెడు సహనం ఉండాల్సిందే! “అమ్మా ఇప్పుడు చూడు వాడే కొడుతున్నాడు. ”సాత్విక్ మళ్లీ కేక పెట్టాడు. టి.వి. ఆపేసాక యుద్ధం మరింత సులువయింది.కొట్లాడుకోవద్దని, చక్కగా నెమ్మదిగా ఆడుకొమ్మని చెప్పిచెప్పి విసిగి పోతుంది ప్రతిమ.ఇంకా ఇలాగే ఎన్నాళ్లు వేగాలి? ఏం చేయాలి దేవుడా!అని ఆలోచించసాగింది ప్రతిమ....ఫ్లాష్! అవును ఆపని చెయ్యాలి.అప్పుడువీళ్లఅల్లరి వుండదు ఆగడము ఉండదు. తాత్కాలికంగా ఊరట చెంది ప్రతిమ నిట్టూర్చింది. “ఏమంటున్నారు పుత్రద్వయం?ఎక్కడా సందడే లేదే! ”ఆఫీసునుండి వచ్చిన రఘు ,రోజూ పిల్లల గొంతులనుండి వెలువడే గలగలల ఆహ్వానం వినబడక ప్రతిమను ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.                             -3-  డిజైన్ కుట్తున్న చీరను చిరాగ్గా ప్రక్కకు పడేసి “ఇద్దరికీ రెండు తగిలించాను.ఏడ్చి పడుకున్నారు. ” అంది ప్రతిమ. “అయ్యో! ఎండకు తోడు డోలు కూడా వాయించావా మరి నిన్ను నువ్వు కొట్టుకున్నట్టు అలా వున్నావేం? ”నవ్వాడు రఘు  “మీకు నవ్వులాటగానే వుంటుంది.నా అవస్థ మీకేంతెలుసు ? ” “సెలవులుకదా!చిన్నపిల్లలకు తోచదు మరి. ”టై విప్పి టేబిల్ మీద పడేస్తూ బెడ్ రూమ్ లో నిద్రపోతున్న పిల్లలను ముద్దుపెట్టుకున్నాడు రఘు. “మీకేం తీరికగా సాయంత్రానికి వస్తారు.సెలవులనేకాదు,బడి వున్న రోజులయితే మాత్రం ఏమి తక్కువ!బడికి పంపాలంటే యజ్ఞం,బడినుండి వచ్చాక చదువుల హోమం! అన్నీ భుజాన వేసుకుని మోసే భారంనాది. ” నిష్ఠూరమాడింది ప్రతిమ. “సరిసరి దండకమేనా ,కాఫీలాంటిదేమైనా వుందా? ”భార్య మాటలకు అడ్డుకట్ట వేసాడు రఘు. వేడికక్కుతున్న కాఫీకన్నా మరింత మండిపడుతున్నట్టుంది ప్రతిమ.భార్య అందించిన కాఫీ త్రాగుతూ,   “కూల్ డౌన్ ప్రతిమా,ఏమిటి ఈ వేళ వర్క్ లోడ్ పెరిగిందా?పైగా ఎంబ్రాయిడరీ ఎక్స్ ట్రా వర్క్ పెట్టుకున్నావు” సానుభూతిగా అన్నాడు రఘు. “ఆ...... నా మానసికానందానికి చేసే పని మాత్రం మీకు ఎక్స్ ట్రాగా కనబడుతుంది.మీ పిల్లల అల్లరి మాత్రం ముచ్చటగా ఉంటుంది.అసలు ఎగ్జామ్స్ రాయించేసరికి దేవుడు కనబడ్డాడు.ఇక ఈ సెలవులలో నాకు పిచ్చెక్కేటట్లుంది. ”అంది ప్రతిమ విసుగ్గా.        -4- “ఏం చేయమంటావ్ మళ్లీ పాత పాట మొదలెట్తున్నావ్ ”అన్నాడు విసురుగా. ఆ విసురును కాఫీ కప్పు పెట్తున్న వైనంలో చూపాడు రఘు. “నాది పాటలాగే వుంటుంది మీకు.నా పాట్లు మాత్రం అర్థం చేసుకోలేరు.నేను మాత్రం తల్లినికానా? పిల్లలను క్రమశిక్షణలో పెంచాలనుకోవడం తప్పా?ఈ సంవత్సరం నామాట వినండి.ఆ తరువాత చూడండి మన పిల్లలలో మార్పు.! ” అంటూ తన మనస్సులో కోరికను బయటపెట్టింది.భర్త అంగీకారం కోసం ఆశ,అర్థింపు కలగలిపి కోరుతోంది ప్రతిమ. “అబ్బ నీ ఫ్రెండ్ వార్డెన్ అయితే అయింది కానీ నీకు మాత్రం భలే ఉబలాటంగా ఉంది నీ కొడుకులను హాస్టల్ లో చేర్పించాలని” నిష్ఠూరంగా అన్నాడు రఘు. “ఈ ఒక్కసారికి నా మాట వినండి. నా ఫ్రెండ్ వార్డెనే కాదు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా! చాలా స్ట్రిక్ట్ మనిషి.డిసిప్లిన్ కు పెట్టింది పేరు.ఏమంటారు? ”ఆసక్తిగా భర్త వంక చూసింది ప్రతిమ. రఘు ఆలోచనలో పడ్డాడు. ‘కనీసం రోజుకొక్కసారైనా హాస్టలు ప్రసక్తి రాకుండా గడవడం లేదు.ప్రతిమ తనను జీడిపాకంలా పట్టుకుంది.పిల్లల అల్లరి శృతి మించుతోందని తల్లిదండ్రులకు దూరంగా ఉంటేనే క్రమశిక్షణతో పెరుగుతారని నొక్కి మరీ చెప్పే ప్రతిమ భావాన్ని తాను మార్చగలనా! ’ అనుకున్న రఘు,సరే చూద్దాం పిల్లలు మారఢం ఎలా వున్నా ప్రతిమ మారుతుంది,విసుగు,చిరాకు తగ్గుతుంది అనుకుని ప్రతిమను కావాలసిన ఏర్పాట్లు చేసుకోమన్నాడు. ఎట్టకేలకు భర్త ఒప్పుకున్నందుకు ప్రతిమ చాలా సంతోషపడింది.పిల్లలు హాస్టల్లో స్వతంత్రంగా అన్నీ చేసుకోవడం నేర్చుకుంటారని,బుద్ధిగా హోం వర్క్ చేసుకుంటారని,క్రమశిక్షణ నేర్పే స్నేహితురాలు వార్డెన్ గా వుండటం తన అదృష్టం అని ,ఆమెదగ్గర పిల్లల అల్లరి    -5- తగ్గిపోయి,బాగుపడి వృద్ధిలోకి వస్తారని తలపోస్తూ పిల్లల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోసాగింది. పిల్లల అల్లరి,ప్రతిమ అరుపులు చర్వితచర్వణంగా సెలవులు గడిచిపోయి స్కూళ్లు తెరిచే టైమయింది.హాస్టలుకువెళ్లాలి అని తల్లి బట్టలు సర్దుతుంటే  పిల్లలు కూడా సంబరంగా సహాయం చేయసాగారు.బట్టలన్నీ సర్దుకుని బ్రష్, పేస్టు, దువ్వెన,సబ్బులు వంటి వస్తువులు ఎవరివి వారు చక్కగా సర్దుకుంటూ ఎవరి వస్తువులు వారికి సమానంగా దొరకుతుంటే సాత్విక్,రుత్విక్ అమితానందపడిపోతున్నారు.పైగా కారులో ప్రయాణం.కొత్త ఊరికెళ్తున్న సంబరం.పిల్లలు కేరింతలు కొడ్తుంటే ప్రతిమకూ సంతోషంగానే వుంది కొద్దిగా బాధనిపించినా  పిల్లల బాగు కోసమే కదా తను వాళ్లను దూరంగా వుంచాలనుకుంటుంది అని మనసుకు సర్ది చెప్పుకుంది.పిల్లల అల్లరి సహజగుణం కదా అన్న అంతరాత్మ ప్రశ్నకు ఉలిక్కిపడి సర్దుకుంది ప్రతిమ. పిల్లలకోసం చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కొని తెచ్చాడు రఘు.ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు.రోజూ ఆఫీసునుండి ఇంటికొచ్చేసరికి పిల్లలగొంతులు ఇంట్లో ఇక వినబడవు అని తలచుకుంటేనే రఘుకి ఎంతో బాధగా ఉంది. రుత్విక్,సాత్విక్ మాత్రం రెట్టించిన ఆనందంతో బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టెల్లో దాచేసుకున్నారు. ఇవన్నీ దొరుకుతాయని అమ్మ చెప్పినందుకే వాళ్లు హాస్టలుకు వెళ్తామని సిద్ధమయ్యారు. ప్రయాణంలో పాటలు,రైమ్స్ ఒకటేమిటి తల్లి దగ్గర అప్పజెప్పిన పద్యాలు, పాఠాలతో సహా వల్లెవేసి వినిపించేస్తున్నారు.కొత్తబాటలో మరిన్ని  కొత్త పాటలు నేర్చుకుంటారని      -6- ప్రతిమ కలలు కనసాగింది.రఘు మాత్రం పిల్లల ఎడబాటును మౌనంగా దిగమ్రింగుతున్నాడు. పగలంతా ప్రయాణం చేసినట్లే వుంది.ప్రతిమ ముందే ఫోనుచేసినా పెద్దగా వివరాలమీ చెప్పలేదు.భర్తతో,పిల్లలతో వస్తున్నానని ఫ్రెండ్ తో చెప్పింది. “చాలా రోజులకు కనబడ్డావు ప్రతిమా!అయినా మీవారిని,పిల్లలను చూడ్డం  దే ఫస్ట్ టైం. ”ప్రతిమను,రఘును సాదరంగా ఆహ్వానించి ముద్దులు మూటగడ్తున్నట్లున్న రుత్విక్,సాత్విక్ ల బుగ్గలు పుణికి ముద్దెట్టుకుంది ప్రతిమ నేస్తం వెరసి వార్డెన్ ఇందుమతి. “నువ్వలా ముద్దుచెయ్యకు,ఆ తరువాత నీకే కష్టం” ప్రతిమ హెచ్చరించింది. “అదేమిటి! ” అని ఇందుమతి అర్థంకానట్టు చూసింది. “నన్ను కాదు అటు చూడు” ప్రతిమ చూడమన్న వైపు చూసిన ఇందుమతికి రఘు వెంట బరువైన సూట్ కేసులు రెండు మోసుకొస్తున్న వాచ్ మెన్ కనిపించాడు.రఘు తనచేతిలోని బ్రీఫ్ కేస్ ప్రతిమకందించాడు. బ్రీఫ్ కేస్ తెరచి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు,ఫోటోలు చూపించింది ప్రతిమ. “ఏమిటి ప్లాన్ మీదున్నావ్” అనుమానంగా అడిగింది ఇందుమతి. “ఇక నీదే భారం వీళ్ల అల్లరిని నేను కంట్రోలు చేయలేకపోతున్నాను. వీళ్లకు క్రమశిక్షణ నేర్పి ఒక దారికి తెచ్చే మార్గం నీవే చూపాలి ”ప్రతిమ వేడుకోలుగా అంది. “అంటే హాస్టల్లో పెట్టేస్తున్నావా” అని ఇందుమతి ఆశ్చర్యంగా అడిగింది. “నీ గురించి అంతా విన్నాను ఇందూ!పైగా కొందరు పేరెంట్స్ మాఊరి వాళ్లు కూడా చెప్పారులే నువ్వు పిల్లలను చాలా స్ట్రిక్ట్ గా కంట్రోలు చేస్తూ అల్లరి చెయ్యనియ్యవని,ఏ          -7- వేళకు చేసే పని ఆ వేళకు మాత్రమే చేయిస్తావని పిల్లలంతా రీడ్ వైల్ యు రీడ్ అన్నట్లు నీ గొంతు వింటేనే పుస్తకాలకు జిగురులా అతుక్కుపోతారని ..... ”నవ్వుతూ చెప్తోంది ప్రతిమ. “ఆ..ఆ...ఇక ఆపు తల్లీ నన్నో వార్డెన్ లా చెప్పావా లేక విలన్ గా చెప్పావా నీ పిల్లలకి” అంటూ ఇందుమతి ప్రతిమ నవ్వుతో శృతి కలిపింది. రఘు స్నేహితురాండ్రనిద్దరినీ గమనిస్తున్నాడు. ‘పాపం పిల్లలు రేపటినుండి తమకు దూరంగా,ఏం చేద్దాం?ప్రతిమకు బి.పి పెరిగిపోతోంది.ఇక ఇలా రాజీ పడక తప్పలేదు.మనసులో దిగులుగా అనిపించింది.ఆఫీసునుండి ఇంటికి రాగానే కనిపించే పిల్లల అమాయక వదనాలిక కరువే’ అనుకుని నిట్టూర్చాడు. తమ కాలేజీ కబుర్లు,తాముండిన హాస్టలు కబుర్లతో కాలాన్నిఐస్ క్రీంలా కరిగించేస్తున్నారు.రఘు పేపరు అడ్డం పెట్టుకుని ఒకటి అరా మాటలలో మాత్రం రెస్పాస్స్ ఇస్తున్నాడు. పిల్లలిద్దరూ తల్లి చెప్పినట్లు అల్లరి చెయ్యకుండా బుద్ధిగా కూర్చున్నారు. కూర్చుని కూర్చుని నిద్రలోకి జారిపోతున్నారు. “మీవారు పిల్లలు అలసిపోయినట్లున్నారు.నేను భోజనాల సంగతి చూస్తాను. ఇక ఈ రాత్రికి రిలాక్స్ అవండి.మీకు గెస్ట్ రూం సిద్ధంగా వుంది.బైదిబై అప్లికేషను ఫారాలు రేప్పొద్దుటే ఇస్తాను.పూర్తిచేసి ఇద్దురుగాని. ”అని కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది ఇందుమతి. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది, “మీ వారు, పిల్లలు” అనుమానిస్తూనే అడిగింది ప్రతిమ. “వాళ్లా !వదిలేసా.....అదే ఈ పూటకు వదిలేసా.మా ఆడబిడ్డ ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లారు.నువ్వు వినిపించుకోలేదేమో,మీ పిల్లలతో అన్నాగా !కాస్త ముందొచ్చి వుంటే         -8- మీరు పార్టీకివెళ్లి వుండేవారని.వచ్చేస్తార్లే మీరు భోంచేసి రిలాక్స్ అవ్వండి. ”అంటూ డైనింగ్ ఏర్పాట్లకై లేచింది ఇందుమతి. కొత్తవాతావరణం,అసలే ప్రిన్స్ పాల్,పైగా వార్డెన్! సాత్విక్,రుత్విక్ క్యాబేజి కూర ఇష్టంలేకపోయినా వద్దనలేదు.మారాము చెయ్యలేదు. భోజనాలయ్యాయి. ఇందుమతి ఏవో ఫైళ్లు చూసుకుంటోంది .గుడ్ నైట్ చెప్పి వచ్చి పడుకుంది ప్రతిమ.పిల్లలప్పుడే నిద్రలోకిజారుకున్నారు.రఘు నిద్ర నటిస్తున్నాడని తెలుసు. ‘తప్పదు పిల్లలకోసం తనలోని అమ్మ మనసు చంపుకోక తప్పదు. ’ పిల్లలకు బెడ్ షీట్ కప్పింది,తమ వెంట తెచ్చుకున్న జెట్ మ్యాట్ ప్లగ్ లోపెట్టి ఆన్ చేసింది.పిల్లలు రేపటినుండి అన్నీ స్వంతంగా చేసుకుంటారు. రఘు నిద్రలోకి చేరుకున్నట్లు సన్నని గురకే చెప్తోంది.భర్త ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని అనుకున్నప్రతిమ హమ్మయ్య అని నిట్టూర్చి నిద్రలోకి జారిపోయింది. తెల్లారినట్లుంది.గోలగోలగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడి లేచింది ప్రతిమ.గోడకున్న గడియారం ఎనిమిది గంటలు సూచిస్తోంది. ‘అయ్యో ఇంతగా  నిద్రపొయ్యానా! ’ఇటు తిరిగి చూసింది. పిల్లలింకా మంచి నిద్రలో వున్నారు. ‘ఇదేమిటి ఇలా అయ్యింది? క్రమశిక్షణ ఈ రోజే మొదలవు తుందనుకుంటే తనే  ఆలస్యంగా లేచిందే అనుకుంటూ మెల్లగా లేచివెళ్లి హాల్లోకి తొంగి చూచింది. ఇందుమతి టి,విలో న్యూస్ చూస్తున్నట్లుంది. రఘు ఎప్పటిలానే  పేపరు తిరగేస్తున్నాడు.ఇక పిల్లలు,వార్డెన్ ఇందుమతి పిల్లలు! అల్లరి, ఏడుపు దట్టించి మరీ ఆడుకున్నట్లుంది. హాలంతా రంగు రంగుల కాగితాలు,బెలూన్లు, పిల్లలు ఆడించినట్లు ఆడుతున్నాయి.ఒకరు ఊదిన బెలూన్లు మరొకరు పుల్లతో పొడిచి ఫట్     -9- మనిపిస్తున్నారు.రంగుకాగితాల కంటించిన జిగురు నేలను కూడా ఒలికి హాలంతా అశుభ్రంగా తయారయ్యింది. ఇందుమతివేపు చూసింది ప్రతిమ.క్రాఫ్ట్ క్లాసులో వున్నట్లుగా ఫీలవుతున్నట్లుంది.టి.వి చూస్తూనే పిల్లల అల్లరిని తనే సంభ్రమంగా చూస్తోంది.చిరునవ్వుతో వాళ్ల అల్లరిని ప్రోత్సహిస్తున్నట్లే వుంది.వార్డెన్ లో వున్న నిజమైన అమ్మను చూస్తోంది ప్రతిమ.పిల్లల అల్లరిని మనఃపూర్తిగా భరిస్తోంది. టి.వి ఆఫ్ చేసి ఇటు తిరిగిన ఇందుమతి,ప్రతిమను చూసి నవ్వింది. “లేచావా రాత్రడిగావే ఇదిగో వీళ్లే నా సుపుత్రులు. ”రఘు ప్రక్కనే కూర్చుని వున్న ఇందుమతి భర్త “మా సుపుత్రులు” అని సవరించాడు. అందరు నవ్వుకున్నారు. “ప్రతిమా నేనోగంటలో స్కూలుకు బయలుదేరుతాను.అడ్మిషన్లు చూసుకోవాలి కదా.టీపాయ్ మీద అప్లికేషను ఫారాలు పెట్టాను.ఫిలప్ చేసి స్కూలుకు రండి.వెయిట్ చేస్తుంటాను” అంది ఇందుమతి. ఇందుమతి మాటలను వినిపించుకోనట్లే వుంది ప్రతిమ.ఏదో మార్పు కనబడుతోంది ప్రతిమలో. ఇల్లెగిరిపోయేలా అరుస్తున్న ఇందుమతి పిల్లలవంకే రెప్పవాల్చకుండా చూస్తోంది. ‘తన ఇంటికి ఏమాత్రం భిన్నంగా లేని సన్నివేశం.!ఇంకాస్త అధ్వాన్నంగానే ఉన్నట్లుంది.కొత్తవాళ్లున్నారని కూడాలేదు.తనపిల్లలే నయం. ఎవరింటికెళ్లినా ఎవరైనా వచ్చినా అల్లరి మానేసి బుద్ధిగా ఉంటారు. ’ గదిలోకి వెళ్లి పిల్లలవైపు ప్రేమగా చూసింది.వంగి ఇద్దరి నుదుటి మీద క్రాఫు సవరించి ముద్దులు పెట్టుకుంది. ‘ప్రయాణం సంబరంలో తనవెంటబడి వచ్చారే గాని వీళ్లు తనని వదలి ఉండగలరా?అసలు తనుండగలదా? ’ప్రతిమ ఆలోచనలో పడింది.          -10- “కిటికీ ఊచలకంటుకు పోయి ఆ ఆలోచనలేమిటి ప్రతిమా,నువ్వేం వర్రీ కాకు,నాకప్పచెప్పావుగా ,ఇంతకీ మీ ప్రోగ్రాం ఏమిటి? ”ప్రతిమ భుజంపై చెయ్యివేసి ఆప్యాయంగా అడిగింది ఇందుమతి. “మరోగంటలో బయలుదేరుతాం ఇందుమతీ” అని నిశ్చయంగా అంది ప్రతిమ. “అదేమిటి పిల్లలకు యూనిఫాం,పుస్తకాలు కొనవా? నీవు దగ్గరుండి కొంటే బెటర్ కదా!” ఇందుమతి సలహా ఇచ్చింది. “లేదులే ఇందుమతీ !ఇప్పుడు మేము తయారుగా రాలేదులే” అంది ప్రతిమ. రఘుకేం అర్థం కావడంలేదు.పదివేలు తెచ్చిచ్చాడు.ప్రతిమ మరిలా చెప్తోందేమిటి? ఏదో మాటలాడబోయిన రఘును కళ్లతోనే వారించింది ప్రతిమ. కాఫీ, టిఫన్లు పూర్తయాయి. సాత్విక్, రుత్విక్ లేవగానే గబగబా తయారయిపోయారు.ఇందుమతి పిలల్లు రంగుకాగితాలకై కొట్టుకుంటుంటే తమ అల్లరి గురించి మరచిపోయి చూస్తుండిపోయారు  సాత్విక్, రుత్విక్. కిటికీ ఊచలనుండి తోటలోకి చూస్తోంది ప్రతిమ. సీతాకోక చిలుకలు పువ్వులను పలకరిస్తూ హయిగా విహరిస్తున్నాయి.ప్రతిమ మనసు తేలికై విహంగమైంది. ‘నిద్రపోతున్న పిల్లలను వదలి వెళ్లాలనుకున్న తన కఠిన నిర్ణయాన్ని మనసు వేలెత్తి ప్రశ్నిస్తోంది.కళ్లు తుడుచుకుంది ప్రతిమ.’తన బ్రీఫ్ కేసుతోపాటు పిల్లల సూట్ కేసులను కూడా కారులో తిరిగి పెట్టేస్తుంటే ప్రతిమలో మూసపోసిన అమ్మతనాన్ని కడు వేడుకగా తిలకిస్తున్నాడు రఘు.    రచన: సి. ఉమాదేవి

ఎవరు దాత..

ఎవరు దాత?   రామచంద్రాపురంలో రామయ్య, సోమయ్య అనే ధనిక రైతులు ఇద్దరు వుండే వాళ్ళు. ఇద్దరూ మంచి వాళ్ళు; తమకు చేతనైనంత వరకూ ఇతరులకు సాయం చేసేవాళ్ళు. అందరూ వాళ్ల దాతృత్వం గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ప్రతి సంవత్సరమూ పంట కోతలకు ముందు, గ్రామదేవతలకు ప్రీతిగా అక్కడ ఒక జాతర జరుగుతుంది. ప్రతిసారి లాగానే ఈసారి కూడ రామయ్య, సోమయ్య ఇద్దరూ జాతరకోసం భూరి విరాళం ఇచ్చారు. ఆ సమయంలో గ్రామ దేవతలకు వీళ్లిద్దరిలో నిజంగా ఎవరు గొప్పవాళ్ళో కనుక్కోవాలని ఒక కోరిక కలిగింది. ఆ సమయానికి కోతలు అయ్యి రామయ్య, సోమయ్య పంటలు చేనులో ఉన్నాయి. వీళ్లని పరీక్షిద్దామనుకున్న గ్రామదేవతలు ఆ పంట మొత్తాన్నీ మాయం చేసేసారు. చేతికి అంది వచ్చిన పంటని 'దొంగలు ఎత్తుకెళ్ళారు' అనుకున్నారు ఇద్దరూ. 'ఇలా జరిగిందేమి?’ అని నిండా విచారంలో మునిగి ఉన్నాడు సోమయ్య. అతను ఇంకా ఆ బాధలో ఉండగానే పొరుగూరు నుండి రైతులు కొందరు వచ్చారు. "అయ్యా! ప్రతి ఏడాదీ తమరు ఇచ్చే ధాన్యం పుణ్యాన మా ఊళ్ళో ముసలివారికి అన్నదానం జరుగుతున్నది. ఈసారి తమరి పంట చేతికి అందలేదని తెలిసింది. ఈ కార్యక్రమం మరి ఎలా జరపాలో తెలీకుండా ఉంది" అని బాధ వ్యక్తం చేసారు. సోమయ్య తన అశక్తతని చెబుతూ "ఈసారికి కుదరదు. అన్నీ అనుకూలిస్తే, వచ్చే ఏడాది ఏమైనా సాయం చేస్తాను" అని చెప్పేసాడు వాళ్లకు. వాళ్ళు నిరాశగా బయటికి వచ్చి, సాయాన్ని అపేక్షిస్తూ రామయ్య ఇంటికి పోయారు. రామయ్యకు కూడా పంట చేతికి అందలేదన్న బాధ ఉండింది కానీ, ముందు అనుకున్న ప్రకారం అతను ఇంట్లో పూజా కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు; దానికి ఊళ్ళో వాళ్లను అందరినీ భోజనానికి పిలిచి ఉన్నాడు.   ఆ సమయంలో‌ వీళ్ళు వచ్చి సాయం అడిగితే "అన్ని ఖర్చుల్లో ఇదీ ఒక ఖర్చు.. కానివ్వండి. ఎలాగో ఒకలాగా మీకు అయిదారు నెలలకు సరిపడా ధాన్యం ఇస్తాను; రబీ పంటలోంచి మిగతాది చూద్దాం. ముందైతే మీరంతా భోజనం చేసి వెళ్ళండి!" అన్నాడతను. ఇంట్లో వాళ్ళు ఆ సరికే సైగలు చేస్తున్నారు- "ఇంకా వంట పూర్తవలేదు" అని. "దానిదేముంది, ఏముంటే అది పెట్టండి" అంటూ దేవుడికోసం ప్రత్యేకంగా చేసిన వంటకాలను తెప్పించి వాళ్లకు పెట్టి, తృప్తిగా సాగనంపాడు రామయ్య. ఆ తర్వాత గ్రామదేవతలే మారువేషంలో వచ్చి "రామయ్యా! దేవుడికి చేసిన వంటలు తెచ్చి ఎవరికో పెట్టేసావే, దేవుడంటే అంత తిరస్కారం అయితే ఎలాగ?" అన్నారు. "అయ్యో, తిరస్కారం ఏమీ లేదు. వాళ్ళని చూస్తే పాపం ఆకలిమీద ఉన్నారని తెలుస్తూనే ఉంది. దేవుడిని ఆకలితో పంపితే ఎలాగ అని, ఆయనకోసం చేసినవి ఆయనకే ఇచ్చాను" అన్నాడు రామయ్య. లేమిలో కూడా దానశీలతను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న రామయ్యని మెచ్చుకున్న గ్రామదేవతలు నవ్వి, "నువ్వు ఎలాంటివాడివో తెలుసు-కుందామని, ఇట్లా ఓ పరీక్ష పెట్టాము. నీ ధాన్యమూ, సోమయ్య ధాన్యమూ ఎక్కడికీ పోలేదు. మీ గాదెల్లోకే చేరి భద్రంగా ఉంది. సోమయ్యకు కూడా చెప్పు- మీరు ఇద్దరూ మీరు చేసే మంచిపనుల్ని కొనసాగించండి. మంచి పనులు చేసేటప్పుడు కూడా "నేను" అన్న అహంకారపు భావన రాకుండా చూసుకోండి. మీకు మేలవుతుంది" అంటూ మాయం అయిపోయారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నీతి చంద్రిక

నీతి చంద్రిక     గంగా నది ఒడ్డున పాటలీ పుత్రం అనే పట్టణం ఒకటి ఉండేది. అది సర్వ సంపదలతో తులతూగుతుండేది. ఆ పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఒకనాడు వినోదంకోసం పండితులతో శాస్త్ర చర్చలు చేస్తూ ఉండగా, సందర్భవశాత్తు ఎవరో రెండు పద్యాలు చెప్పారు: "యౌవనము, సంపద, అధికారము, తెలియనితనము అన్న ఈ నాలుగింటిలో ఏ ఒక్కటైనా చాలు, కష్టాలు కొనితెచ్చేందుకు. మరి, ఈ నాలుగూ ఒక్కచోట చేరాయంటే, ఇక ఏం చెప్పాలి?" అనీ, "అనేక సందేహాలను పోగొట్టేదీ, తెలియని వస్తువుల స్వభావాలనూ తెలియపరచేదీ, మనుష్యులకు చూపువంటిదీ చదువే. అది ఎవ్వరికి అలవడదో, అట్లాంటి వాడు గుడ్డివాడితో సమానం" అనీ వాటి భావం. ఆ పద్యాలు వినగానే, రాజుకు తన కొడుకులు గుర్తుకు వచ్చారు. వాళ్ళు నలుగురూ చదువులేక, మూర్ఖులై, కేవలం ఆటల పట్ల ఆసక్తితో, ఊరికే తిరుగుతున్నారు. రాజుగారు వాళ్ళను తలచుకొని, "అయ్యో! తల్లిదండ్రులు చెప్పినట్లు విని, చదువుకొని, అందరిచేతా మంచివాడు అనిపించుకున్నవాడే కొడుకు అవుతాడు గానీ, అలాకానివాడు కొడుకు అనిపించుకుంటాడా అసలు? మూర్ఖుడు తల్లిదండ్రులకు బరువై వాళ్ళకు ఎల్లకాలమూ దు:ఖం కల్గిస్తుంటాడు. అట్లాంటివాడు చచ్చిపోతే, తల్లిదండ్రులకు ఆనాటినుండీ బరువు తగ్గి, దు:ఖం తీరుతున్నది. వంశానికి మంచిపేరు తెచ్చినవాడే కొడుకు- తల్లి కడుపున చెడబుట్టిన వాడు అసలు కొడుకే కాడు. మంచివాడు కాని కొడుకును కన్న తల్లిని అసలు తల్లి అనచ్చా? మంచి గుణాలు కల కొడుకు ఒక్కడు చాలు- మూర్ఖులైన కుమారులు వందమంది ఉండీ ఏమి ప్రయోజనం? ఒక్క రత్నంతో గంపెడు గులకరాళ్ళైనా సరిపోలవు. 'విద్యావంతులు, సద్గుణవంతులు అయిన కొడుకులను చూసి సంతోషించటం' అనే భాగ్యం అందరికీ లభించదు- దానికోసం చాలా పుణ్యం చేసుకోవాలి కాబోలు!" అనుకున్నాడు. ఇలా ఆయన ఇంకొంత ఆలోచించి, విచారంగా తల ఊపుతూ "నేను ఊరికే ఇలా ఎందుకు బాధపడుతున్నాను? నా కొడుకులేమైనా 'చదవము' అని మొండికేశారా? ఏంచేస్తున్నారోనన్న సరైన ఆలోచనలేక, నేనే కదా, వాళ్లను సరిగ్గా చదివించనిది? పిల్లల్ని చదివించకపోవటం తల్లిదండ్రుల తప్పు. తల్లిదండ్రులు సరిగా శిక్షణనివ్వటం వల్ల పిల్లలు పండితులౌతారు తప్ప, పుట్టగానే ఎవ్వరూ పండితులు అవ్వరు. మానవప్రయత్నం వల్లనే పనులు సమకూరతాయి- ఒట్టి కోరికలవల్ల ఏమీ ఒరగదు. నిద్రపోయే సింహం నోట్లోకి జంతువులు తమంత తాము వచ్చి చేరవు. కాబట్టి, కనీసంఇప్పుడైనా నా కొడుకుల విద్యాభ్యాసానికి తగిన ఏర్పాట్లు చేయాలి" అనుకొని, అక్కడ సమావేశమైన పండితులను- " నా కొడుకులు చదువుకోక, ఆటపాటల్లో వృధాగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. మీలో ఎవరైనా వాళ్లకు నీతిశాస్త్రం బోధించి, వాళ్లను మంచిదారికి మరల్చగలరా?" అని అడిగాడు. ఆ సమయంలో విష్ణుశర్మ అనే పండితుడు అక్కడే ఉన్నాడు. ఆయన ముందుకు వచ్చి, "మహారాజా! ఇది ఎంతపాటి పని? మీవంటి గొప్ప మహారాజుల వంశంలో పుట్టిన పిల్లలను నీతివేత్తలుగా చేయటం అసలు కష్టం కానేకాదు. కొంగను మాట్లాడించటం కష్టం - కానీ, చిలుకను మాట్లాడించటం ఏమంత కష్టం? మంచి వంశంలో సుగుణాలు లేనివాడు పుట్టడు. విలువైన మాణిక్యాలు పుట్టే గనిలో గాజు పుడుతుందా? ఎంతటి రత్నమైనా సాన పట్టనిదే ప్రకాశించదు. అదే విధంగా పిల్లవాడు ఎంతటి ఘనుడైనా సరే, గురువుల శిక్షణ లేనిదే వెలుగొందలేడు. కాబట్టి నేను ఆరు నెలల్లో రాజకుమారులను నీతికోవిదులుగా చేసి తమకు సమర్పిస్తాను" అన్నాడు. రాజుగారు చాలా సంతోషించి "పువ్వులతో కలిసి ఉన్న నారకు సువాసన అబ్బినట్లు, సజ్జనులతో సహవాసం చేయటంవల్ల మూర్ఖుడికి కూడా సహజంగానే మంచి గుణాలు సంక్రమిస్తాయి. అంతేకాదు, మంచివాళ్ల సాంగత్యం వల్ల అంతా శుభమే కల్గుతుంది." అని గౌరవంగా పలికి, ఆయనకు బస, ధనం ఇప్పించారు. ఆపైన తన కుమారులను పిలిపించి విష్ణుశర్మకు పరిచయం చేస్తూ, "చదువు అనే సువాసన అంటక, వీళ్ళు నలుగురూ పుట్టు గుడ్డివాళ్ళ లాగా ఉన్నారు. వీళ్ళకు చూపు తెప్పించి కాపాడే భారం మీదే" అని, వారిని ఆయనకు అప్పగించారు.     ఆ తరువాత ఆ పండితుడు వాళ్లను అందమైన ఒక భవనానికి తీసుకొనిపోయి, తన చుట్టూ కూర్చోబెట్టుకొని, "మీకు సంతోషం కలిగేటట్లు, ఒక కథ చెబుతాను. ఆ కథలో మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు భాగాలుంటాయి, వినండి." అన్నాడు. మిత్రలాభం:- "సంపదను సాధించుకునే శక్తి తమకు లేకపోయినాకూడా, తెలివైనవాళ్ళు 'కాకి, తాబేలు, జింక, ఎలుక' మాదిరి, పరస్పర స్నేహం ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటారు-" అని విష్ణుశర్మ అనగానే, రాజకుమారులు "కాకి, తాబేలు, జింక, ఎలుక ఏ ఏ పనులను చక్కబెట్టుకున్నాయి? మాకు వివరంగా చెప్పండి" అన్నారు ఉత్సాహంగా. సంతోషించిన విష్ణుశర్మ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు...   "గోదావరి ఒడ్డున గొప్ప బూరుగు చెట్టు ఒకటి ఉండేది. అనేక దిక్కులనుండి వచ్చిన రకరకాల పక్షులు రాత్రివేళల్లో ఆ చెట్టుని ఆశ్రయించుకొని ఉండేవి. ఒకరోజున, అప్పుడే తెల్లవారుతుందనగా,'లఘుపతనకం'అనే కాకి ఒకటి మేలుకుని, చెట్టునుండి క్రిందికి చూసింది. అక్కడ వేటగాడొకడు కనిపించాడు దానికి. పరమ భయంకరంగానూ, 'మరో యముడేమో' అనిపించేటట్లుగానూ ఉన్నాడు వాడు. అప్పుడది "అయ్యో! ప్రొద్దున్నే లేచి వీడి ముఖం చూశాను. ఇవాళ్ల ఏమి కీడు రాబోతున్నదో, తెలీదు. వీడు వచ్చినచోటున ఇక ఉండ కూడదు. ఆలస్యం చేయకుండా ఈ చోటును వదిలి పోవాలి"అ ని పారిపోయేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. ఆలోగా వేటగాడు ఆ చెట్టు సమీపంలో నేలమీద నూకలు చల్లి, వల పన్నాడు. తను పోయి, దగ్గరలోనే ఒక పొదలో దాక్కొని, పొంచి చూడసాగాడు. ఆ సమయానికి, పావురాల గుంపొకటి ఆకాశంలో సంచరిస్తున్నది. వాటి రాజు చిత్రగ్రీవుడు నేలమీద చల్లిఉన్న నూకల్ని చూసి, తనతోటి పావురాళ్లతో ఇలా అన్నాడు- "జనాలెవ్వరూ సంచరించని ఈ అడవిలోకి నూకలు ఎలావచ్చాయి? మనం ఈ నూకలకు ఆశపడకూడదు. గతంలో బాటసారి ఒకడు ఒక బంగారు కంకణానికి ఆశపడి, పులిచేత చిక్కి మరణించాడు. మీకు ఆ కథ చెబుతాను, వినండి- "ముసలి పులి ఒకటి, ఒకనాడు స్నానంచేసి, దర్భ గడ్డి పోచలు చేతబట్టుకొని, ఒక కొలను గట్టున కూర్చొని, దారిన పోయే వాడినొకడిని "ఓ! బాటసారీ! ఇదిగో, నాదగ్గర బంగారు కంకణం ఉన్నది, ఒకటి. రా! వచ్చి తీసుకో!" అని పిలిచింది.     ఆమాటలు విని, "నా అదృష్టం పండింది- కనుకనే ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఎదురైంది. ఇందులో అనుమానించాల్సినదేమున్నది?" అనుకుని, బిగ్గరగా "ఏదీ, కంకణం చూపించు?" అన్నాడు బాటసారి.  "ఇదిగో, బంగారు కంకణం, చూడు కావలిస్తే!" అని చేయి చాచింది పులి. "నువ్వు కౄరజంతువువు కదా, నిన్నెట్లా నమ్మేది?" అన్నాడు బాటసారి. "ఒరేయ్, బాటసారీ! విను. ఇదివరకు, నా యౌవనంలో- నేను చాలా చెడ్డగా ఉండేదాన్ని. ఎన్నో ఆవులను, మనుషులను చంపి, లెక్కలేనంత పాపాన్ని మూట కట్టుకున్నాను. ఫలితంగా నా భార్యాపుత్రులను అందరినీ పోగొట్టుకొని ఏకాకిగా బ్రతకవలసి వచ్చింది. అప్పుడొక మహాత్ముడు నాపై దయ తలచి, "ఇకమీదట ఆవులనుగాని, మనుషులను గానీ చంపకు! మంచి పనులు చేయి!" అని చెప్పాడు. ఆనాటినుండి నేను చెడుపనులను మానివేసి, మంచి పనులే చేస్తున్నాను. అంతేకాక నేను ముసలిదాన్ని, బోసినోటిదాన్ని, గోళ్ళు పోయినై, శక్తిలేదు. నన్ను నువ్వెందుకు నమ్మవు? నువ్వు పేదవాడివిలా తోస్తున్నావు. అందుకనే నీకు దీన్ని దానం చేయబుద్ధయింది, నాకు. అందుకని, ఇక సందేహించకు. ఈ కొలనులో స్నానం చేసి రా, వచ్చి బంగారు కంకణాన్ని తీసుకో" అన్నది పులి. ఆ బాటసారి దురాశకు లోనయ్యాడు. స్నానం చేసేందుకని గబగబా కొలనులోకి దిగబోయి, అక్కడ నడుములోతు వరకూ ఉన్న బురదలో కూరుకుపోయాడు. అప్పుడు పులి అతన్ని చూసి, "అయ్యయ్యో! పెద్ద ఊబిలోనే దిగబడ్డావు కదా!? నేను వచ్చి, నిన్ను లేవనెత్తి,రక్షిస్తానులే, భయపడకు!" అని మెల్లగా వాడి దగ్గరకు వచ్చి, వాడిని పట్టుకున్నది. వాడట్లా పులి చేత చిక్కి, "అయ్యో! కౄరజంతువును నమ్మకూడదు. నమ్మి, ఈ పరిస్థితిని కొనితెచ్చుకున్నాను. గడచిపోయినదానికి ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం? ఎవరికైనాగానీ తలరాతను తప్పించుకోవటం సాధ్యం కాదు" అని బాధపడుతూ పులికి ఆహారమయ్యాడు- కాబట్టి, అన్ని విధాలుగానూ ఆలోచించిగానీ ఏ పనీ చేయకూడదు. చక్కగా ఆలోచించి చేసిన పనివల్ల ఎన్నటికీ కీడు కలుగదు." అని ముగించాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు.    

ప్రమోషన్

     మళ్ళీ అదే సమస్య. ఆనాడు యెదురైన అదే విధమైన ఇరకాటం. నుదుటిపైన చేతినుంచుకుని ఆలోచనలో పడ్డాడు ఉప కార్యాలయ అకౌంట్స్ క్లర్కు సిధ్ధరామయ్య. రెండేళ్ళ క్రితమేమో—యు.డి.సి.డిపార్టుమెంటు పరీక్షలకు పోటీ పడి చదువుతున్న ప్పుడు తన తల్లి సౌభాగ్యమ్మ మంచాన పడింది. వర్షాలూ రోగాలు చెప్పి రావుగా? వాటిష్ట ప్రకారం అవి వస్తాయి. వాటిష్ట ప్రకారం అవి పని ముగించుకుని పోతాయి. ఐతే కొన్ని రోగాలు వర్షాలలా కాకుండా పిలవని పేరంట్రాళ్ళలా దూసుకు వచ్చినట్టు తిష్ట వే సుక్కూర్చుండిపోతాయి. అంతు చూడకుండా విడిచి పెట్టవు.  తన తల్లి విషయంలో అలాగే జరిగింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎందరు వైద్యులచుట్టూ ప్రదక్షిణలు చేసినా తగ్గని ఖళ్ళ దగ్గులా రోగం నయంకాలేదు. అటువంటప్పుడు కన్నకొడుకు సిధ్ధరామయ్య ఎలా ఏకాగ్రతతో శాఖాపరమైన పోటీ పరీక్షలకు చదివగలడు? పూనకం వంటి పట్టుదలతో చదివినా ఎలా కుదురుగా పరీక్ష హాలులో కూర్చుని వ్రాయగలడు? అవేమిటి, పాఠ్య పుస్తకాలలోని అంశాలా యేమిటి క్రిందా మీదా పడి కంఠతా పట్టి అప్పచెప్ప డానికి? అవన్నీ శాసన బధ్దమైన పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు కదూ! కచ్చితంగా కొన్ని సందర్భాలలో నియమాల రిఫరెన్సు గుర్తింపులను ప్రస్తావించే తీరాలికదా! గోరు ముద్దలుపెట్టి పెంచి పెద్దచేసిన అమ్మ మంచాన పడి చెప్పలేనంత విపరీతంగా యెగశ్వాస దిగశ్వాసగా అవస్థ పడుతున్నప్పడు తనెలా యెగ్జామ్ హాలులో కుదురుగా కూర్చుని పరీక్ష వ్రాయగలడు?  తీవ్ర అసహనానికి గురయాడు సిధ్ధరామయ్య. అంతేకాక-పైకి కనిపించని కౌకు దెబ్బలా సిధ్ధరామయ్య మరొక పెను నష్టానికి లోనయాడు. అదేమంటే- తన వెనుక జూనియర్ క్లర్కుల్లా కార్యాలయంలో చేరి తన వద్ద పని నేర్చుకున్న కొందరు జూనియర్ స్టాఫ్ డిపార్టుమెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులై పైకి యేగబ్రాకి తనను క్రిందకు తోసి యుడిసీలుగా ఎదిగిపోయారు. మరైతే తన వంటి నష్టజాతకులకు ఇలా జరగడం లోకరీతేగా! తను కూడా పరీక్ష వ్రాసుండి మెరిట్ కేటాయింపు ఆధారంగా ప్రమోషన్ పొంది ఉంటే తనుకూడా చాలామందినే దాటుకుంటూ ఎదుగుదలనే నిచ్చెనెక్కి వెళ్లిపోయుండే వాడే-- జీవితమంటే బ్రతుకు మైదానంలో సంభవించే ఆటలో అరటి పండేనేమో! చిట్టచివరకు అతడికి సీనియారిటీ వరస క్రమంలోనే యుడిసీ పదో న్నతి వచ్చింది. అదీను యెప్పుడని-చాలా మందికి జూనియర్ గా మారిన తరవాతనే! ఏది ఏమైతేనేమి- అతడికిక మిగిలిందే ముంది- ఏమీ లేదు. తన తల్లి సౌభాగ్యమ్మ అదే సంవత్సరం అందరినీ దు:ఖ సముద్రంలో ముంచి పరలోక  ప్రాప్తి చెందింది. తన అనారోగ్య కారణంగానే కొడుకు శాఖాపరమైన పరీక్షలు వ్రాయలేకపోయాడని తెలిసుంటే యెంత బాధపడేదో! అంతా ఒక విధంగా మంచికే జరిగిందేమో-- అమ్మ ప్రశాంతంగా కళ్ళు మూసింది అతను ప్రక్కనుండగానే చేతిలో చేతినుంచి. ఇదిగో--ఇప్పుడు మళ్ళీ అదే గడ్డు పరిస్థితి! నిజానికి అంతకంటే దారుణమైన పరిస్థితి. వయసు మరలి వర్క్ షాపుకి వెళ్ళడం మానుకున్న బాబు అనారోగ్యానికి లోనయాడు. స్వతహాగా తండ్రిది దృఢ శరీరం. రోగం రొష్టులనూ ఆమడ దూరాన ఉంచగల గంభీర రూపం. మరెందుకలా నీరసించి నిస్సహాయుడై ఇంటిపట్టున ఉండిపాయాడో సిధ్ధరామయ్యకు అంతు పట్టడం లేదు. అంతే కాదు- వర్క్ షాపులో పని చేస్తున్నప్పుడే ఆయన రెండు మూడు సార్లు పడిసెం పట్టి ఖళ్ళెతో బాధ పడ్డాడు. జాగ్రత్త తీసుకోవడం మరిచాడు. అప్పటికి దేవుడి దయవల్ల కాలం కలిసొచ్చి తను సీనియారిటీ ప్రకారం కుంటుతూ దేకుతూ యుడిసి ఐపోయాడు. జేబులు కాసుల గలగల చప్పుడుతో నిండి ఉన్నాయి. కావున దేనికీ వెనుకాడకుండా వైద్యుడు వ్రాసిచ్చిన మందులూ టానిక్కులూ పకడ్బందీగా కొనిచ్చాడు.  మరెందుకో మరి బాబు మందులు తీసుకోవడం తరచుగా మరచిపోతూనే ఉన్నాడు. మందులెందుకు వేసుకోలేదని అడగడానికి వెళితే బాబు దేనినో ఎవరినో దీర్ఘంగా వెతుకుతున్నట్టు ఆకాశంలోకి తేరి చూస్తూ కనిపించే వాడు. తనకు నిజంగానే చిరాకు వచ్చేది. ఆ అసహనాన్ని తండ్రిపైన చూపించలేక భార్య ప్రేమవతి పైన చూపించేవాడు కూకలు వేస్తూ- “ఇవన్నీ నువ్వు చూడవద్దా! నీ పనులు నువ్వు చూసుకోవడమేనా? అసలు మాఁవగారికి అనారోగ్యంగా ఉందన్నదైనా గుర్తుందా?” ఈ మాట తను  కావాలనే కస్సుమన్న గొంతుతో అనేవాడు; తండ్రి చెవిలో పడేటట్టు.  కాని తను ఎన్నాళ్ళని ఇటువంటి నాటకం చూపిస్తూ ఉండగలడు? ఎన్నిసార్లు నెపం పెట్టి తండ్రి చేత మందులు తినిపిస్తూ ఉండగలడు? ప్రేమవతి తిరు పతయ్యకు కోడలు కావచ్చు-తనకు భార్య కావచ్చు-కాని ఆమె కూడా మనిషేగా--ఆమెకు కూడా గాయపడే మనసుంటుంది కదా! అంచేత తను సాధ్యమైనంత మేర తండ్రి మందులు తీసుకునే సమాయనికి స్వయంగా దగ్గరుండి సపర్యలు చేయిడానికి ప్రయత్నంచేవాడు. మరి దానికి కూడా ఒక హద్దుంటుంది. ఆయననే అహర్నిశలూ అంటి పెట్టుకుని ఉండటానికి ఉద్యోగస్థుడైన తనకు ఎంత వరకు సాధ్యపడుతుందని? అందరిలాగే తనకూ అర్జంటు పనులు తగుల్తుంటాయి. తను కూడా నెలజీతం పైన ఆధారపడి జీవించే సగటు మనిషేగా!     మరైతే తండ్రి అలా రాను రాను నీరసించిపోవడానికి— నిర్జీవితకు లోనుకావడానికి మరొక కారణం ఉండవచ్చున్నది  అతడు తరవాత తెలుసుకోగలిగాడు. అదెలా తెలుసుకోగలిగాడంటే— మాఁవగారికి వంజిరం చేప అంటే ఇష్టమని  ప్రేమవతి ఆది వారం పూట వంజిరం చేపల పులుసు చేసింది.ఏమైందో మరి-మంచం పైన తింటున్నవాడల్లా చప్పున ఆగిపోయి కొడుకుని దగ్గ రకు రమ్మనమని పిలిచాడు తిరుపతయ్య. అదేదో అర్జంటు మేటర్ గురించి పిలిచాడనుకుని తింటూన్న గిన్నెనుండి చప్పున లేచి వెళ్ళాడు సిధ్దరామయ్య- “చెప్పు బాబూ!” అంటూ.  తిరుపతయ్య వెంటనే బదులివ్వలేదు. అన్నం ముద్దను కొడుకు నోటికి అందిస్తూ అన్నాడు- “నిన్నెప్పుడూ ఇలాగే దగ్గర్నించి చూస్తూ ఉండాలనుందిరా కొడకా!” ఆ మాట విని అతడికి దిగ్గుమని పించింది. ఎందుకంటే ఆ మాట అతడి చెవికి వింతగా తోచింది,దిగులు నిచ్చింది. మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూడ సాగాడు. ఎందుకని అడగాలనిపించలేదు. "మీ అమ్మను చూస్తున్నట్లే ఉందిరా!" ఆమాటతో అతడికి దు:ఖపు తెర గొంతు వరకూ తన్నుకు వచ్చింది. తనను తను అదుపు చేసుకుంటూ వెళ్లి గిన్నెముందు కూర్చున్నాడు. ఇన్నాళ్ళూ ఇంటి దూలంలా నిల్చు ని కుటుంబాన్ని ఆదుకున్న చెట్టంత  మనిషి భార్య పోయిన జ్ఞాపకం తెచ్చుకుని ఎంతగా నీరసించి పోతున్నాడు! బ్రతికుండడమేమిటి- లేకుండా పోవడమేమిటి- భార్యా భర్తల మధ్య ఉన్న అనుబంధం అటువెంటిది మరి-- కనిపించీ కనిపించని విధంగా తనువెళ్లా పెనవేసుకున్న మానవాత్మల్లా— గత స్మృతుల పవ్వళింపులా--      మగటిమితో తను ఆపుకున్నాడు దు:ఖం. కాని ప్రేమవతి ఆపుకోలేక పోయింది. కన్నీరు కార్చేసింది. చేపల పులుసుతో అన్నం జుర్రుకుతింటూన్న కొడుకూ కూతూరూ తల్లిని బిత్తరపోయి చూడసాగారు. ఆ చిరు వయసులో హృదయ మనోరాగ వలయాల గురించి వాళ్ళకేం తెలుసు! ఇకపోతే- డిపార్టుమెంటల్ పరీక్షలు సాధారణంగా ఎక్కువ భాగం దైనందిన కార్యాలయ కార్యకలాపాలపైనే ఆధారిపడి ఉంటాయి. ఇంకా చెప్పాలంట్- సగ భాగం అధికార పూర్వక వర్క్ మ్యాన్యువల్ పైన ఆధారపడి ఉంటే మిగతా సగం దైనందిన ఆచరణీయ పధ్ధతులపైన ఆధారపడి ఉంటాయి. ఈ కారణం చేత కష్టపడి పని చేసే శ్రమజీవి కావటాన సిధ్ధరామయ్యకు పని తనపు పధ్థతులపైన మంచి పట్టు ఉంది. ఈ తరహా ఉద్యోగులు శాఖా సంబంధిత పోటీ పరీక్షల్లో త్వరగా తేరుకోగలరు. పదోన్నతి  నిచ్చెనను అవలీలగా అందుకోగలరు.  కావున—చాలామంది ఆఫీసు సిబ్బంది పరీక్షలకు అనుగుణమైన పని పధ్ధతుల గురించి  లోతుగా తెలుసుకోవడానికి సిధ్ధరామయ్య ఇంటికి రాసాగారు. వాళ్ళందరూ భర్తకు ఇరుగు పొరుగున అదే ఆఫీసులో పని చేసేవారు కాబట్టి విసుగుదలకు చోటివ్పకుండా అల్పాహారాలు టీలు కాఫీలు అందిస్తుండేది ప్రేమవతి. ఆ రీతిన సూపర్ వైజర్ పోస్టు పోటీ పరీక్షలు దగ్గరకు వచ్చేసాయి. ప్రయత్నాలు ముమ్మరమయాయి. అందుకోబోయేది అందని  మ్రాని పండులా ఊరించే హెడ్డు గుమాస్తా పోస్టు కదూ! కలసి రావాలే గాని-- పోస్టుగాని అందుకోగలిగితే ఎంతోమందికి పైగా వెళ్ళి, ఇంకెంతో మందికి సీనియర్ కూడా కావచ్చు. డైరక్ట్ మెరిట్ కోటా ప్రమోషన్ కి ఉన్న మహత్యం అటువంటిది మరి. ఆపైన  తదుపరి ప్రమోషన్ లు మోచేతి నుండి తాగే నీళ్ల ప్రాయమే,వద్దంటే పెళ్ళన్నట్టు-- ఆ కోవన మూడు నెళ్ళ ముందే ఇచ్చిన  ధరఖాస్తు ప్రకారం అందరికీ ఎగ్జామ్ సెంటర్లు కేటాయించినట్టే సిద్ధరామయ్యకు వనస్థలి పురం కేటాయించారు. ఓపెన్ పోటీ పరీక్షలు కావు కాబట్టి, వ్రాసేవారందరూ ఒకే కార్యాలయానికి చెందిన డిపార్టుమెంటు సిబ్బందే కాబట్టి, అందరూ అలా ఆఫీసు చేరుకుని అక్క ణ్ణించి అలానే వాళ్ళ వాళ్ళకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు వెళ్ళవచ్చు. పిమ్మట తిన్నగా ఇండ్లకు చేరుకోవచ్చు.అంటే పరీక్ష కేంద్రనుండి మళ్ళీ ఆఫీసుకి వెళ్ళనవసరం లేదన్నమాట. ఆరోజు రాత్రి భోజనాలయిన తరవాత సిధ్ధరామయ్య అలా ఆరుబయట చిన్నపాటి నడక సాగించి వచ్చిన తరవాత తిరుపతయ్య కొడుకుని  పిలిచాడు.పిలిచి అడిగాడు-“మీ ఆఫీసు పరీక్షలు ఎలా వ్రాసావురా కొడకా!” “బాగానే వ్రాసాను బాబూ! అందరూ కష్టంగా ఉందన్నారు గాని నాకు  మాత్రం అలా అనిపించలేదు.పెట్టిన పేనా దించకుండా దంచేసాననుకో! ఆ మాటకు వస్తే నాకిదంతా నీళ్ళ ప్రాయం బాబూ!" తిరుపతయ్య ఏమీ మాట్లాడకుండా కొడుకు కళ్ళలోకి నిదా నంగా చూస్తూ ఉండిపోయాడు. "అదేంవిటి బాబూ అలా తేరి చూస్తున్నావు!నేను బాగా వ్రాసానంటే నమ్మకం కుదరటం లేదా?”    ఆమాట విని తిరుపతయ్య నీరసంగా నవ్వి కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు- “నాకు తెలుసురా నువ్వు రాత్రంతా కళ్లు తుడుచుంటూ నిద్రలేమితో అవస్థ పడుతున్నప్పుడే అనుకున్నాను నువ్వు పరీక్షకు వెళ్ళవని--" తెల్లబోయి చూసాడు సిధ్ధరామయ్య. "మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు బాబూ!నేనెందుకు పరీక్ష వ్రాయకుండా ఉంటాను? చూస్తూ చూస్తూ హెడ్ క్లర్కు పోస్టుని ఎవడైనా చేతులార వదులుకుంటాడా బాబూ!” తిరుపతయ్య తల అడ్డంగా ఆడించాడు తను నమ్మలేనట్టు.  "నా వద్ద దాగుడు మూతలు ఆడకురా కొడకా!అన్నీ తెలుసుకునే నిన్ను అడుగుతున్నానురా కొడకా! హెడ్డు పోస్టు  పెద్ద పోస్టట  కదా— అదిచ్చిన వెంటనే మరొక జిల్లాకో లేదా మరొక మండలానికో ట్రాన్సుఫర్ చేస్తారటగా! నాకు దూరం కాకుండా ఉండటానికేగా నువ్వు ప్రమోషన్ పరీక్షలు వ్రాయకుండా ఉండిపోయావు? రేపో మాపో చచ్చే పీనుగుని కాబో తూన్న నాకోసం నీకు నీవు అన్యాయం చేసుకుని పెళ్ళాం పాపలకు అన్యాయం చేసుకుని పరీక్షలు మానుకుంటావా!"  ఆ మాటతో సిధ్ధరామయ్య ఉగ్గబట్ట లేక పోయాడు. భళ్ళున ఏడ్చేసాడు. ఏడుస్తూనే ఆగి ఆగి బదులిచ్చాడు. "లేదు బాబూ!నాకు నువ్వు వేరు అమ్మవేరు కాదు. నాకిప్పుడు నువ్వే బాబువి నువ్వే అమ్మవి.నేను గాని ప్రమోషన్ కోసం ఆశపడి నిన్ను ఈ పరిస్థితిలో  విడిచి దూరంగా వెళ్ళిపోతే అమ్మ ఆత్మ నన్నెప్పటికీ క్షమించదు.అమ్మేకాదు, రేపు  నా ఆత్మసాక్షే నన్ను క్షమించ కపోవచ్చుబాబూ!” తిరుపతయ్య‌ ఇక మాట్లాడలేదు. కొడుకుని గుండెలపైకి తీసుకున్నాడు. అతడికి తెలియకుండానే కన్నీరు కారుతూంది. ఇటు వంటి కొడుకుని ఇచ్చినందుకు తన దివంగత భార్య సౌభాగ్యమ్మకు చేతులు ఎత్తి నమస్కరించాలని పించింది. నిజానికి తనిప్పుడు సిధ్ధరామయ్యకు తండ్రికాడు. సిధ్ధరామయ్యే తనకు తండ్రి!      - పాండ్రంకి సుబ్రమణి