దోపిడి

ధనవంతుడికి పేదవాడికి
మధ్యన నింగికి నేలంతా దూరం
వాడు ఆకాశమై ఆనందంగా!
వీడు అగాధమై ఆవేదనగా!!

పేదవాడి రక్తాన్ని 
జలగలా పీల్చి 
శిఖరమై శాసిస్తాడు

ఉన్నోడి పాదాలకింద నలిగిపోతూ
ఎండిన డొక్కలతో అలమటిస్తాడు

ఎదురుతిరిగితే వెన్నుపూసలిరిచి
ఎంగిలిసిరేస్తాడు
ఏదైనా చేసేస్తాడు

వంగిన నడుము వణుకుతు
తలెత్తడమే మరుస్తడు 
జరిగే మోసం పసిగట్టలేడు
ఎదురుతిరిగే సత్తా లేనోడు


జీవన చదరంగంలో
వాడెప్పుడు రాజే
జీవన పోరటంలో
వీడెప్పుడైన బంటే

చమటంత చిందించి
అన్నం పండిస్తడు
కానీ..
ఎప్పుడూ కడుపునిండదు
బీదరికానికి చిరునామా

పండిందేదైనా తనే హక్కై నిలబడతాడు
అప్పుడే ఎగరేసుకుపోయే
రాబందై వాలిపోతాడు

కష్టపడుతూ 
కాలం గడపుతాడు పేదవాడు
కష్టానికింత వెలకట్టి
కోట్లెనుకేసుకుంటాడు 

ఎర్రటెండలో కాగిపోతూ
ప్రపంచాన్ని నిర్మిస్తాడు!
ఏ సి గదిలో విలాసాలబోతూ
విశ్వాన్నంతా శాసిస్తాడు!!

నాయకులెవరైనా వీరిచేతిలో
కీలుబోమ్మలే
డబ్బిసిరేసి దెబ్బకొడతారు
ధనవంతులై తరతరాలకు కూడబెడతరు

శాసించడమే తెలుసు ధనవంతుడికి
ఆశించడమే మ బాగా తెలుసు పేదవాడికి
మందుకు బానిసలు పేదవాళ్ళు
మత్తులో చిత్తై ఓట్లనమ్ముకుంటరు
డబ్బెంతైన వెదజల్లి అధికారం లాక్కుంటరు

 

సి. శేఖర్(సియస్సార్)