ఓట్ల కోసం దోశెలు వేస్తాం ... ఇస్త్రీ చేస్తాం ... !
Publish Date:May 17, 2012
Advertisement
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ మహిళా నేత, సినీనటి రోజా నెల్లూరులో చేసిన ప్రచారం కొత్తపుంతలు తొక్కింది. కుటుంబసభ్యులతో మమేకమై ఓటు అడగాలన్న పాలసీని ఆమె అక్షరాలా అమలు చేశారు. అందుకే ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా వారిని వదిలిపెట్టకుండా ముద్దులిచ్చారు. రజకుల ఓట్లు అభ్యర్థించ టానికి వెళ్ళినప్పుడు ఆమె కాసేపు సరదాగా ఇస్త్రీ కూడా చేశారు. అంతటితో ఆగకుండా ఓ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దోశెలు వేసుకుంటుంటే వారిని ఆగమని చెప్పి రోజానే స్వయంగా దోశెలు పోశారు. వారికి తినటానికి ఇచ్చి తానూ తినేసి ఓటెయ్యమని అభ్యర్థించారు. ఈమె తనతో పాటు వచ్చిన కార్యకర్తలనూ ఈ తరహాలోనే ఉండాలని సూచించారు. ఇంతటితో ఆగకుండా చివరాఖరున మీ అభిమానులమని ఎవరైనా చెబితే చాలు వారిని తొందర చేసి మరీ పుస్తకాల్లో ఆటోగ్రాఫ్ లు ఇచ్చేశారు. యువకులను నవ్వుతూ పలకరించి మీరంతా మాకు ఓటు బ్యాంకులాంటివారని పొగడ్తలతో ముంచెత్తారు. చివరాఖరుగా తాను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత అని గుర్తుకు వచ్చినట్లుంది కాబోలు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండింటినీ నమ్మద్దని విమర్శనాస్త్రాలను సంధించారు. చిరంజీవి పేరు చెబితేనే మహిళలు మండిపడుతున్నారన్నారు. వందరూపాయలకు వంద వంట సరుకులు ఇస్తామనన్ చిరంజీవి తన వాగ్దానాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పి అమలు చేయించాలని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ సారికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను రోజా అభ్యర్థించారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-women-leader-roja-24-14100.html





