ఐ.పి.ఎల్. మ్యాచ్ ల పేరిట కోట్లు మింగుతున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా
Publish Date:May 4, 2012
Advertisement
ఐ.పి.ఎల్. మ్యాచ్ ల పేరిట కోట్లు మింగుతున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం రాష్ట్రంలో మరో ప్రమాదకర మాఫియా గుట్టుచప్పుడు కాకుండా ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నా ఐ.పి.ఎఎల్. క్రికెట్ మ్యాచ్ లపై ఈ మాఫియా రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పకడ్బందీగా బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నిత్యం కోట్లాదిరూపాయలు ఈ బెట్టింగ్ ద్వారా చేతులు మారుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ బెట్టింగ్ నిర్వాహకులు పకడ్బందీ వ్యూహంతో ముందుకు పోతున్నారు. "తెలుగువన్.కామ్'' పరిశోధనల్లో ఈ బెట్టింగ్ జరుగుతున్న తీరుపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ మాఫియాలో జిల్లాల వారీగా ప్రధాన బుకీలు, ఆథరైజ్డ్ ఏజెంట్లు, కొరియర్లు, బెట్టింగ్ వ్యసనపరులు అనే నాలుగు సెక్షన్లు ఉంటున్నాయి. ప్రధాన బుకీలు జిల్లాల వారీగా ఆథరైజ్డ్ ఏజెంట్లను నియమిస్తున్నారు. ఏజెంట్లు కోరియర్లను నియమిస్తూ వారి ద్వారా బెట్టింగ్ చేసే వ్యక్తుల ఫోను నెంబర్లు తీసుకుంటున్నారు. ఈ నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లు మాత్రమే ఏజెంట్లు లిఫ్ట్ చేసి బెట్టింగ్ ఖాయపరుస్తారు. ఫోనునెంబరుతో బుక్ చేసుకున్న వ్యక్తి బెట్టింగులో పాల్గొనాలంటే ముందు లక్షరూపాయలు డిపాజిట్ గా కొరియర్ కు చెల్లించాలి. ఈ విధంగా సాగే బెట్టింగ్ లో కేవలం కాగితాల మీద అంకెల రూపేణమాత్రమే బెట్టింగ్ జరుగుతుంది. డబ్బు లావాదేవీలు తరువాత జరుగుతాయి. ఈ బెట్టింగ్ లు పలు అంశాలపై జరుగుతుండటం విశేషం. మొదట బుకీలు ఐ.పి.ఎల్. 20-20 మ్యాచ్ కు సంబంధించి గెలుపు ఓటములపై డెసిషన్ బెట్టింగ్ ప్రారంభిస్తారు. దీనిపై బెట్టింగ్ రాయుళ్ళు మ్యాచ్ గెలుపు, ఓటములపై మాత్రమే పందెం కాస్తారు. గెలుపుపై కాసే బెట్టింగ్ ను 'లే' అని ఓటమిపై కాసే బెట్టింగ్ ను 'ఈటింగ్' అని కొద నేమ్ తో పిలుస్తారు. ఇదీ కాక జాక్ పాట్ అనే గేము బాగా పాపులర్ అయ్యింది. దీనిలో పోయేది తక్కువ, వచ్చేది ఎక్కువ అని బెట్టింగ్ రాయుళ్ళ నమ్మకం. ఈ గేమ్ లో మూడువేల రూపాయలు బెట్టింగ్ కట్టాల్సి ఉంటుంది. పొతే మూడు వేల రూపాయలు పోతాయి. వస్తే లక్షరూపాయలు వస్తాయి. మ్యాచ్ చివరి గంటలో ఆఖరి ఐదు ఒవర్లపై కూడా పందెం జరుగుతుంది. దీనికి 'కేసుసైట్' అనే పేరు పెట్టారు. చివరి ఐదు ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్న టీమ్ కు ఉన్న వికెట్లు చేయాల్సిన రన్ ల టార్గెట్ ను బట్టి పందెం ఉంటుంది. టార్గెట్ ను బుకీ నిర్ణయిస్తాడు. ఆ లక్ష్యానికి చేరితే 'ఎస్' అనీ లేదంతే 'నో' అని చెబుతారు. ముందుగా చెల్లించిన లక్షరూపాయాల్ డిపాజిట్ లో 75వేల రూపాయలు ఆటముగిసేలోపు అయిపోతే అదనంగా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అత్యంత పకడ్బందీగా జరుగుతున్నా ఈ క్రికెట్ బెట్టింగ్ రివార్డులకు రాష్ట్రంలోని కొంతమంది పెద్దల ఆశీస్సులున్నాయని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/teluguonecom-special-story-24-13828.html





