తెలంగాణలో 35 మంది జూనియర్ లెక్చరల్లు ఊస్ట్: మరో 320 మంది స్కృూటినీ.. ఎందుకో తెలుసా?
Publish Date:Oct 6, 2026
Advertisement
తెలంగాణలో నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్ల వ్యవహారం మరో సారి కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 35 మంది జూనియర్ లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చాలాకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ లెక్చరర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. 2023లో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ ప్రక్రియలో కొందరు లెక్చరర్లు సమర్పించిన విద్యార్హతల ధ్రువపత్రాలపై అనుమానాలు వ్యక్తమవడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీలకు పంపించి అధికారులు క్రాస్ వెరిఫై చేశారు. రెగ్యులరైజేషన్ పొందిన సుమారు 360 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లను అధికారులు పునఃపరిశీలించారు. ఆయా యూనివర్సిటీల నుంచి క్లారిఫికేషన్ కోరారు. ఈ పరిశీలనలో 37 మంది సమర్పించిన సర్టిఫికెట్లపై యూనివర్సిటీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం సంబంధిత లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు సంబంధిత లెక్చరర్లు వివరణలు ఇచ్చినప్పటికీ.. యూనివర్సిటీలు తమ రికార్డుల్లో ఆ ధ్రువపత్రాలను జారీ చేయలేదని స్పష్టం చేయడంతో 37 మందిలో 35 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, కామర్స్, హిందీ వంటి వివిధ సబ్జెక్టులు బోధించే జూనియర్ లెక్చరర్లు ఉన్నట్లు సమాచారం. ఇలా ఉండగా ఇప్పుడు ఊస్ట్ అయిన 35 మందే కాక మరో 320 మంది జూనియర్ లెచ్చరర్లు ఇచ్చిన సర్టిఫికట్లపై కూడా అనుమానాలు ఉన్నాయి. వారు సమర్పించిన సర్టిఫికెట్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 320 మందిలో కొందరు ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి పొందినట్లు పేర్కొన్న సర్టిఫికెట్లను సమర్పించినట్లు సమాచారం. ఆయా వర్సిటీలకు ధ్రువపత్రాలను పంపించి వాటి ప్రామాణికతను అధికారులు నిర్ధారిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించి గతంలో కూడా కొందరు జూనియర్ లెక్చరర్లపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా 35 మంది తొలగింపుతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, నకిలీ సర్టిఫికెట్లను గతంలోనే ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇంటర్ విద్యా జేఏసీ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
[Fake Certificates 35 Junior Lecturers Removed, Telangana Education Department, Department of Intermediate Education, Junior Lecturers Telangana, Fake Certificates, Telangana Jobs, Lecturer Regularisation, Telugu One]
http://www.teluguone.com/news/content/fake-certificates--35-junior-lecturers-removed-24-233570.html




