సోషల్ మీడియా ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
Publish Date:May 2, 2026
Advertisement
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌ను ఆయుధంగా ఉపయోగించి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్న ముఠాపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.ఈ ముఠాలో కీలక సభ్యుడైన అర్జున్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని సోదరుడు రాజీవ్ ను బెంగళూరులో పట్టుకున్నారు. ఇద్దరూ కలిసి పదిమంది సభ్యులతో ప్రత్యేక గ్యాంగ్ ఏర్పాటు చేసి ఆపరేషన్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన అమ్మాయిలను ప్రేమలో పడేసి, వ్యక్తిగత ఫోటోలు, చాట్స్ సేకరించి తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు కనీసం పది మంది యువతులు ఈ ముఠా బారిన పడినట్లు గుర్తించారు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సంపన్న కుటుంబాల పిల్లలను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ట్రాప్ చేసి రూ.13 లక్షలు వసూలు చేసిన ఘటన కేసు కీలకంగా మారింది. ఈ కేసులో అర్జున్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అర్జున్ పై కేసులు నమోదు అయ్యాయి. మరికొంత మంది బాధితులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sensational-details-surface-in-the-social-media-trap-case-36-218794.html





