రోజుకు 550 కోట్ల రూపాయల నష్టాలు.. ఎవరికి? ఎందుకు?
Publish Date:May 27, 2026
Advertisement
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, దేశీయంగా సామాన్య వినియోగదారులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ భారాన్ని పూర్తిగా ప్రజలపై మోపడం లేదు. ఫలితంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై ప్రతిరోజూ దాదాపు రూ. 550 కోట్ల మేర భారీ నష్టాలను భరిస్తున్నాయి. గతంలో ఈ రోజువారీ నష్టం సుమారు వెయ్యి కోట్లు కాగా, ఇటీవలి కాలంలో లీటరుకు దాదాపు ఏడున్నర రూపాయల వరకూ ధరలను పెంచిన తరువాత ఈ నష్టాల తీవ్రత 550 కోట్ల రూపాయలకు తగ్గింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత. అయితే పారిశ్రామిక అవసరాల కోసం బల్క్ కొనుగోళ్లు జరిపే పారిశ్రామికవేత్తలకు ఈ రాయితీ వర్తించదు. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారమే పరిశ్రమలు ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు పారిశ్రామిక వినియోగదారులు బల్క్ ఛానెళ్లను వదిలేసి, తక్కువ ధరలకు లభిస్తున్న సామాన్యుల రిటైల్ బంకుల నుంచి ఇంధనాన్ని తరలిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా పారిశ్రామిక రంగానికి చెందిన వారు రిటైల్ బంకులపై పడటం వల్ల స్థానికంగా ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చమురు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ ధరల వ్యత్యాసం కారణంగా మార్కెట్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రైవేట్ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను ఎక్కువగా నిర్ణయించడంతో.. మే నెలలో వాటి డీజిల్ అమ్మకాలు ఏకంగా 38 శాతం పడిపోయాయి. ప్రైవేట్ బంకుల్లో ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ వినియోగదారులంతా ప్రభుత్వ రంగ చమురు సంస్థల రిటైల్ బంకుల వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బల్క్ కొనుగోలు చేసే పారిశ్రామిక పరిమాణం కూడా దాదాపు 29 శాతం క్షీణించింది. ఈ బల్క్ కస్టమర్లు రిటైల్ బంకుల నుంచే డీజిల్ సేకరించడం ప్రారంభించడమే ఇందుకు కారణం. ఈ అక్రమ తరలింపు, నిల్వలపై కేంద్ర ప్రభుత్వం త సీరియస్ అయింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద నల్లబజారు దారులు, హోర్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక నిఘా స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. భారతదేశంలో ఇంధన నిల్వలకు కొరత లేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పెట్రోలియం పేర్కొంది.
http://www.teluguone.com/news/content/rs550crores-losses-to-government-oil-companies-36-221094.html





