ఏపీ మైనింగ్ స్కాంపై ఈడీ దూకుడు
Publish Date:May 27, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టి బుధవారం పలుచోట్ల విస్తృత సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ, జైపూర్, కోయంబత్తూరు నగరాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. మాజీ మైన్స్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలు JPVL, GCKC ప్రాజెక్ట్స్, ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయాల్లో ఈడీ బృందాలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు సమాచారం. మైనింగ్ ఒప్పందాలు, టెండర్లు, అనుమతుల ప్రక్రియల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏసీబీ దర్యాప్తులో మాజీ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గనుల లీజులు, రాయల్టీలు, అనుమతుల జారీ ప్రక్రియల్లో నిబంధనలు ఉల్లంఘించి కొందరు ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్, అక్రమ ఆస్తుల బదిలీలు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. కోయంబత్తూరులో రెండు ప్రాంతాల్లో, జైపూర్‌లో మరో రెండు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ సోదాలతో ఏపీ రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. ఈ కేసులో మరికొందరు మాజీ అధికారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల పాత్రపైనా విచారణ విస్తరించే అవకాశముందని సమాచారం.
http://www.teluguone.com/news/content/ed-aggression-against-ap-mining-scam-36-221082.html





