శకపురుషుడు ఎన్టీఆర్!

Publish Date:May 28, 2026

Advertisement

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇలా అన్ని పాత్రలు గొప్పగా పోషించిన అనితరసాధ్యుడు,  మహామనీషి ఎన్టీఆర్.

ఇది.. తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం ఎన్టీఆర్ 103వజయంతి. ఆకర్షణకూ, సమ్మోహనత్వానికీ మరోపేరుగా భాసించిన తారకరాముడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న లక్ష్మయ్య, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన నోట ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా పలికాయి. 1942 మేలో పందొమ్మిది సంవత్సరాల వయసులో మేనమామె కుమార్తె బసవతారకంను పరిణయమాడారు. పెళ్లి తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్. శర్మ వంటి నటులతో కలిసి ఎన్నో నాటకాలు వేశారు. ఆయన కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయని ఆనాడే అందరూ ప్రశంసించారు. 

మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947లోనే బిఎ పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన 1100 మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు. అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా.. సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనీయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాస్ వెళ్లిపోయారు. కొన్ని కష్టాల తర్వాత లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో  1949లో విడుదలైన  మనదేశం చిత్రంలో చేసిన పోలీస్ సబిన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌తో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు. అప్పుడెవరూ ఊహించలేదు.. నందమూరి తారక రామారావు అనే యువకుడు సమీప భవిష్యత్తులోనే తన సమ్మోహన శక్తితో, అనితర సాధ్యమైన అభినయంతో తెలుగువారి ఆరాధ్య తారగా వెలుగొందుతాడని!  1951లో కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన  పాతాళభైరవి సినిమా ఎన్టీఆర్ నటజీవితాన్ని మలుపు తిప్పింది. తోటరామునిగా తారకరాముడు తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచాడు. తన రూపం, వాచకం, అభినయం, ఖడ్గచాలనంతో వారిని సమ్మోహితుల్ని చేసేశాడు. ఆయన నటన ఒక ఎత్తు, నడక మరో ఎత్తు. 

ప్రధానంగా పౌరాణిక చిత్రాలు తారాకరాముని తెలుగువారి ఆరాధ్య దైవంగా మార్చాయి. ఆయనే కృష్ణుడు, ఆయనే సుయోధనుడు.. ఆయనే రాముడు, ఆయనే రావణాసురుడు.. ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు.. ఆయనే భీముడు, ఆయనే బృహన్నల.. అన్నీ ఆయనే! తెరపై కనిపించేది ఎన్టీఆర్ కాదు, ఆయా పాత్రలే. శ్రీకృష్ణుడి వాచకం రసరంజితం, సుయోధనుడి వాచకం రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లు.  లవకుశ చిత్రంలో చేసిన అపూర్వాభినయంతో తెలుగువారి గుండెల్లో అవతారపురుషుడు శ్రీరాముడు ఆయనే అయిపోయారు. అంతకంటే ముందుగానే  మాయాబజార్ సినిమాతో శ్రీకృషునిగా నీరాజనాలు అందుకున్నారు. ఆ కాలంలో శ్రీరామ, శ్రీకృష్ణ వేషాల్లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు పటాలు, క్యాలెండర్లు.. అనేక తెలుగిళ్లలోని గోడలపై అలంకారాలయ్యాయి. ఆయనే రామునిగా, ఆయనే కృష్ణునిగా భావించి పూజలు చేసిన వాళ్లెందరో! 

తారకరాముడు కేవలం తెరపై గొప్పనటుడు మాత్రమే కాదు, తెరవెనుక మహా గొప్ప దర్శకుడు కూడా. 1961లో వచ్చిన  సీతారామ కల్యాణం  దర్శకునిగా ఆయన తొలి సినిమా. అయితే సొంత బేనర్ ఎన్ఏటీపై తీసిన ఆ సినిమా టైటిల్స్‌లో దర్శకుని పేరు వేయకుండా రిలీజ్ చేయడం ఆయనకే చెల్లింది. ఇందులో ఆయన రావణాసురుని పాత్రను పోషించారు. దర్శకునిగా తన ప్రతిభ ఏమిటో తొలి సినిమాతోనే ఆయన చాటిచెప్పారు. 1977లో విడుదలైన  దానవీరశూర కర్ణ చిత్రంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసి, మరో చరిత్ర సృష్టించారు.

పౌరాణిక పాత్రలతో తెలుగువారి అవతార పురుషునిగా రాణించిన ఎన్టీఆర్ జానపద, చారిత్రక చిత్రాల ద్వారానూ అమితంగా ఆకట్టుకున్నారు.  శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర  చిత్రం నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. టైటిల్ రోల్‌ను పోషిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లోనే పూర్తయినా, సెన్సార్ చిక్కుల్లో పడి, ఆయన ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తర్వాత 1984లో విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో జీవించి  తరించారు. తరగని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచారు.  మనదేశం తో మొదలైన మహానటప్రస్థానం  మేజర్ చంద్రకాంత్ వరకూ జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో..  తనకెంతో ఇష్టమైన  శ్రీనాథ కవిసార్వభౌమ పాత్ర కూడా పోషించి సంతృప్తిపడ్డారు.

నటునిగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైనందుకు తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో స్వీయానుభావంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం కించపరుస్తున్నదని గ్రహించి.. తెలుగువాడి సత్తా ఏమిటో తెలియజెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి..  కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ..  తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. 

చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగి, 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు ఎన్టీఆర్. తెలుగువారు ఈ నేలమీద ఉన్నంతవరకూ ఒక శకపురుషునిగా నందమూరి తారకరామారావు పేరు నిలిచే ఉంటుంది. ఇది సత్యం, ఇది తథ్యం.

By
en-us Political News

  
కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు రాబట్టి తృటిలో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును మిస్ చేసుకున్నాడు. అయితేనేం.. ఈ ఇన్నింగ్స్‌లో 334.48 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో సన్‌రైజర్స్ బౌలింగ్ లైనప్‌ను తుత్తునియలు చేసేశాడు. ఆస్ట్రేలియా పేస్ స్టార్ పాట్ కమిన్స్ వేసిన ఓవర్లలో సైతం హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి పవర్‌ప్లేలోనే రాజస్థాన్ జట్టు స్కోరును 80 పరుగులకు చేర్చాడు.
ఇరాన్ గనుక ఈ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ జలసంధిని ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులో ఉంచేలా అమెరికా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఏ దేశం కూడా హర్మూజ్ జలసంధిని తమ గుత్తాధిపత్యంగా మార్చుకోలేదన్నారు.
1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ మ‌హానాయ‌కుడిగా రాణించిన అరుదైన వ్య‌క్తి ఎన్టీఆర్‌.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో సుందరంగా అలంకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.