మావల్లే ఇరాన్ అణ్వాయుధ కల చెదిరింది.. ట్రంప్
Publish Date:May 28, 2026
Advertisement
అంతర్జాతీయ రాజకీయాల్లోనూ, ప్రపంచ చమురు వాణిజ్యంలోనూ అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఎవడబ్బ సొత్తూ కాదంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. హర్మేజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాశయమని, దీనిపై ఏ ఒక్క దేశానికీ పూర్తి నియంత్రణ ఉండటానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. వైట్ హౌస్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ గనుక ఈ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ జలసంధిని ప్రపంచ దేశాలన్నింటికీ అందుబాటులో ఉంచేలా అమెరికా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఏ దేశం కూడా హర్మూజ్ జలసంధిని తమ గుత్తాధిపత్యంగా మార్చుకోలేదన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతానికి పైగా ముడి చమురు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. అందుకే ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండగా.. అమెరికా తీవ్రంగా నిరోధిస్తోంది. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ అడుగుభాగానికి చేరుకుందని, వారి వైమానిక దళం, వైమానిక రక్షణ వ్యవస్థలు, రక్షణ పారిశ్రామిక కేంద్రాలు అమెరికా దాడుల వల్ల భారీగా దెబ్బతిన్నాయని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇరాన్ వద్ద క్షిపణులు ఉండొచ్చు కానీ.. ప్రస్తుతం వారు కొత్తగా క్షిపణులను గానీ, డ్రోన్లను గానీ లేదా యుద్ధ నౌకలను గానీ నిర్మించలేని స్థితిలో ఉన్నారన్న ట్రంప్.. ఇరాన్‌తో శాంతి ఒప్పందాలు లేదా ఇతర చర్చలు జరుగుతున్నాయనే వార్తల నడుమ.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తే ఖరాఖండిగా చెప్పారు. ఇరాన్‌కు ఎటువంటి ఆర్థిక మినహాయింపులు, నిధుల విడుదల ఉండబోదని, వారు పద్ధతిగా ప్రవర్తించి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ విషయం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా గనుక గతంలో బాంబర్లతో ఇరాన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేయకపోయి ఉంటే.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇరాన్ అణుబాంబును తయారు చేసి ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక చర్యల వల్లే ఇరాన్ అణ్వాయుధ కల చెదిరిపోయిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఇరాన్ మీడియా ప్రచారం చేస్తున్న కొత్త శాంతి ప్రతిపాదనల ముసాయిదాను శ్వేతసౌధం పూర్తిగా తోసిపుచ్చింది. అది కేవలం ఒక కల్పిత కథనం అని కొట్టిపారేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పూర్తిగా పునరుద్ధరించడానికి ప్రతిఫలంగా అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దుల నుండి ఉపసంహరించుకుంటుందనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ట్రప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాత్రం అమెరికాతో మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం లేదనీ.. బలహీనత వల్లే వారు వెనకడుగు వేస్తున్నారని అంటోంది. ఒకవేళ అమెరికా గనుక దురాక్రమణకు పాల్పడితే ఇరాన్ దక్షిణ భూభాగాన్ని శత్రువుల శ్మశాన వాటికగా మారుస్తామని హెచ్చరించింది.
http://www.teluguone.com/news/content/trump-say-iran--nuclear-dream-was-shattered-because-of-america-36-221100.html





