ఏపీలో కోకో సాగుకు కొత్త ఊపు.. మోండెలేజ్‌తో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన.!
Publish Date:Nov 12, 2026
Advertisement
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో విస్తరిస్తున్న చాక్లెట్ ప్లాంట్.! ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానించి రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ చాక్లెట్ తయారీ సంస్థ మోండెలేజ్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో కోకో మిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్థానికంగా పండించే కోకోతో పాటు ఇతర ముడిసరుకులను కూడా రాష్ట్రంలోనే కొనుగోలు చేయాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా మోండెలేజ్ ఇండియా అధ్యక్షుడు సమీర్ జైన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ భేటీలో శ్రీసిటీలో చాక్లెట్ తయారీ ప్లాంట్ విస్తరణ, కోకో సాగు ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి, రైతులకు మార్కెటింగ్ అవకాశాలపై చర్చించారు. రూ.1,800 కోట్లతో చాక్లెట్ ప్లాంట్ విస్తరణ.! శ్రీసిటీలో ఉన్న తమ చాక్లెట్ తయారీ యూనిట్‌ను రూ.1,800 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు మోండెలేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విస్తరణతో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 90 శాతం పెరగనుందని తెలిపారు. పనులు పూర్తయితే శ్రీసిటీలోని యూనిట్ ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుందని వెల్లడించారు. ప్లాంట్ విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వపరమైన సహకారం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్థానిక రైతుల నుంచే ముడిసరుకుల కొనుగోలు.! మోండెలేజ్ సంస్థ తన ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకులను వీలైనంత వరకు స్థానికంగానే సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. కోకో, పాలు, చక్కెర, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను రాష్ట్రంలోని రైతులు, తయారీదారుల నుంచి కొనుగోలు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని వివరించారు. రైతులు, డ్వాక్రా మహిళలను సంస్థ సరఫరా వ్యవస్థలో భాగస్వాములను చేయాలని కోరారు. ముఖ్యంగా ప్యాకేజింగ్ పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కోకో సాగు విస్తరణకు కోకో మిషన్.! రాష్ట్రంలో కోకో సాగును మరింత విస్తరించేందుకు మోండెలేజ్ భాగస్వామ్యంతో కోకో మిషన్ ప్రారంభించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ప్రతి ఏడాది 10 వేల హెక్టార్లలో కోకో సాగును విస్తరించి, 2040 నాటికి 50 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నాణ్యమైన కోకో సాగును ప్రోత్సహించేందుకు తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో కోకో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. పాలీక్లోనల్ గార్డెన్స్ అభివృద్ధి, నాణ్యమైన విత్తనాల సరఫరా, ఆధునిక సాగు పద్ధతులపై పరిశోధనల ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక యువతకు శిక్షణపై సీఎం అభినందనలు.! తాము స్థానిక యువతకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల గురించి మోండెలేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. సంస్థ చేపడుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను చంద్రబాబు అభినందించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 కార్యక్రమంలోనూ మోండెలేజ్ సంస్థ భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి కోరారు. కోకో సాగు నుంచి చాక్లెట్ తయారీ వరకు స్థానిక రైతులు, యువతకు ప్రయోజనం చేకూరేలా సంస్థ సహకరించాలని సూచించారు.ఈ సమావేశంలో మోండెలేజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ వెనెపల్లి, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఆడబిడ్డ పుట్టిన 24 గంటల్లోనే రూ.1.5 కోట్ల లాటరీ.. నిజంగా ఆ ఇంటి మహాలక్ష్మే.! [ Mondelez India, Cocoa Mission, Andhra Pradesh Investments, CII Partnership Summit 2026, Visakhapatnam Summit, CM Chandrababu ]
http://www.teluguone.com/news/content/mondelez-india-43-236948.html




