మామిడి రైతులకు నష్టాలు
Publish Date:Apr 8, 2012
Advertisement
కృష్ణాజిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో సుమారు లక్షా 80వేల ఎకరాల్లో రైతులు మామిడిసాగు చేస్తున్నారు. ఇటీవల ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడి బాగా తగ్గింది. దీనికితోడు దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టన్నుకు రూ. 25వేల నుంచి రూ. 30వేల రూపాయల ధర పలుకుతుందని రైతులు ఈ సీజన్ లో ఆశించారు. అయితే ఢిల్లీ శేట్ లు వారి దళారులు రూ. 15నుంచి రూ. 20వేల ధర మాత్రమే చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్ముక్కు అవడంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 15వేల నుంచి రూ. 20వేల ధర కూడా ఎక్కువకాలం ఉండకపోవచ్చు నని, ఈ ధర రూ, 10వేలకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదని రైతులు అంటున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఖర్చులకు ఇతర ఆదాయాలు లేక దళారులు చెప్పిన రేటుకే మామిడిని అమ్ముకోవలసి వస్తుందని రైతులు ఆవేదన చెందు తున్నారు. గతంలో బిఆర్ మీనా జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు దళారీల బెడద నుంచి రైతులను కాపాడారు. వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. ఆయన తరువాత ఎవరూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నించలేదు. ప్రజాప్రతినిధులు కూడా రైతులకు సహకరించడం లేదు. దీంతో జిల్లాలో రైతులు కోట్లాది రూపాయల ఆదాయాన్ని నష్టపోతున్నారు.
http://www.teluguone.com/news/content/mangoes-cultivating-farmers-24-13237.html





