కోవూరు ఫలితం పై దామోదర ఘాటైన వ్యాఖ్యలు
Publish Date:Mar 22, 2012
Advertisement
హైదరాబాద్ : కోవూరు ఉప ఎన్నిక ఫలితం పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక లాంటిదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఉపఎన్నికల ఫలితాలకు కాంగ్రెస్ నేతలందరూ బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని తప్పులు సరిదిద్దుకోవాలని లేదంటే పదవుల నుంచి తప్పుకోవాలని రాజనరసింహ ఘాటుగా మాట్లాడారు. తెలంగాణలో ఓటమికి సెంటిమెంటే కారణమని దామోదర రాజనర్సింహ విశ్లేషించారు. తెలంగాణ అంశాన్ని అధిష్టానం పక్కనపెట్టలేదని, సంప్రదింపుల ద్వారా సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి అన్నారు.
కాగా, విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరు ఫలితంపై అన్నారు. కోవూరులో తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పందించారు నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగానే కోవూరు ఉప ఎన్నిక ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అందించిన విజయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. వైయస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని ప్రజలు ఓటేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
http://www.teluguone.com/news/content/kovuru-24-12839.html





