RTC బస్సు డ్రైవర్‌కు మూర్ఛ.. స్టీరింగ్ పట్టి 73 మంది ప్రాణాలు కాపాడిన యువకుడు.!
Publish Date:Nov 27, 2026
Advertisement
హనుమకొండ జిల్లా కాజీపేటలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్‌కు ఆకస్మికంగా మూర్ఛ రావడంతో వాహనం అదుపుతప్పినప్పటికీ, ఓ ప్రయాణికుడు చూపిన ధైర్యసాహసాలు 73 మంది ప్రయాణికుల ప్రాణాలను నిలబెట్టాయి. హనుమకొండ డిపోకు చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు 73 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వైపు బయలుదేరింది. కాజీపేటలోని బాపూజీనగర్ చౌరస్తా దాటిన కొద్దిసేపటికే డ్రైవర్ రాజు అస్వస్థతకు గురై మూర్ఛతో స్పృహ కోల్పోయారు. ఆ స్థితిలో ఆయన స్టీరింగ్‌ను ఒకవైపునకు తిప్పేయడంతో బస్సు అదుపుతప్పి ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన కండక్టర్ విజయ్ వెంటనే వాహనాన్ని నియంత్రించేందుకు ముందుకు వచ్చారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో, బస్సులో ప్రయాణిస్తున్న జనగామకు చెందిన రామకోటి తక్షణమే రంగంలోకి దిగారు. కండక్టర్ సహకారంతో డ్రైవర్‌ను సీటు నుంచి పక్కకు జరిపి, స్వయంగా స్టీరింగ్‌ను పట్టుకుని బ్రేకులు వేస్తూ బస్సును సురక్షితంగా ఆపారు. వాహనాన్ని నిలిపే ప్రయత్నంలో రోడ్డు పక్కన ఉన్న ఆగమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఘటనా స్థలి వద్ద ఆగి, అస్వస్థతకు గురైన డ్రైవర్ రాజును, గాయపడిన వృద్ధురాలిని తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇది కూడ చదవండి: కరెంట్ షాక్‌తో స్తంభంపైనే వేలాడిన లైన్‌మన్.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన వ్యక్తి.! విపత్కర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన రామకోటిని, కండక్టర్ విజయ్‌ను ఏసీపీ ప్రశాంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రామకోటికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజారవాణాలో ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది మరియు ప్రయాణికుల సమన్వయం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ల ఆరోగ్య తనిఖీలు, అత్యవసర భద్రతా చర్యలపై మరింత దృష్టి సారించాలని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీకు నచ్చవచ్చు: ఆస్తి రాయించుకుని తండ్రినే గెంటేశాడు.. కొడుకుకు షాకిచ్చిన బాంబే హైకోర్టు.! మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.!
[ Kazipet bus incident, RTC electric bus, 73 lives, Ponnam Prabhakar, Hanumakonda Hyderabad bus ]
http://www.teluguone.com/news/content/kazipet-bus-incident-24-238094.html




