ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు.!
Publish Date:Nov 24, 2026
Advertisement
ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రధాన నిందితుడి చుట్టూ సాగిన దర్యాప్తు.. ఇప్పుడు ఆయన సోదరుడి వరకు చేరింది. కీలక సాక్ష్యాలను దాచిపెట్టడం, నిందితుడి గుర్తింపు బయటపడకుండా సహకరించడం వంటి ఆరోపణలతో పోలీసులు ఆయన సోదరుడిని కూడా రెండో నిందితుడిగా (A-2) చేర్చారు. ఈ కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న సూసైడ్ నోట్ అసలు కాపీతో పాటు, బాధితురాలికి సంబంధించిన వీడియోలు ఉన్న ఐఫోన్‌ను దాచిపెట్టడంలో సోదరుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ప్రధాన నిందితుడు వాట్సాప్ సందేశాలు పంపేందుకు సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ సమకూర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి అసలు గుర్తింపు బయటపడకుండా కూడా ఆయన సహకరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల వయసున్న ఏ-2 నిందితుడు గత నవంబర్ 3న ఉప్పరపల్లి స్థానిక కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. కోర్టు ఆదేశాల మేరకు సుమారు 15 రోజుల క్రితం అత్తాపూర్ పోలీసుల ఎదుట విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే, తాజాగా అతడిని ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో గత జులై 18న లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలితో పాటు మరో నలుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 64(1) (అత్యాచారం), 109 (హత్యాయత్నం)లను అదనంగా చేర్చారు. ఓవైపు ప్రధాన నిందితుడు బెయిల్‌పై బయట ఉండగా.. మరోవైపు ఆయన సోదరుడిని కూడా నిందితుడిగా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సూసైడ్ నోట్, ఐఫోన్‌లోని డిజిటల్ ఆధారాల వ్యవహారం ఈ కేసులో కీలకంగా మారింది. సాక్ష్యాలను దాచిపెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. తదుపరి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా? ఈ కేసులో ఇంకెవరైనా పాత్ర ఉన్నట్లు బయటపడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. మీకు నచ్చవచ్చు: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.! మీకు నచ్చవచ్చు: నాన్న ప్రాణాలకు ముప్పు ఉందని ముందే చెప్పా..రాజీవ్ హత్యపై రాహుల్ భావోద్వేగం.!
[ Trainee IPS Case, Sexual Harassment Case, IPS Officer, Accused Brother, Second Accused, A2 Accused, Evidence Tampering, Suicide Note, iPhone Evidence, Digital Evidence, WhatsApp Messages, Attapur Police, Upparpally Court, Anticipatory Bail ]
http://www.teluguone.com/news/content/-trainee-ips-case-24-237888.html





