నామా, తుమ్మలకు తలంటిన చంద్రబాబు
Publish Date:Apr 13, 2012
Advertisement
ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారుకావటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికితోడు పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఉన్న విభేదాలతో పార్టీ పరిస్థితి చిందరవందరగా మారింది. దీంతో చంద్రబాబునాయుడు ఈ ఇద్దరు నాయకులను పిలిచి తలంటినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పార్టీకి ఈ ఇద్దరు నాయకులు రెండు చక్రాలవంటివారని, వీరి మధ్యనే సమన్వయము లేకపోతే ఎలా అని చంద్రబాబునాయుడు గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులూ ఎక్కువగా హైదరాబాదులో ఉంటూ ఖమ్మంజిల్లాలో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వీరిద్దరూ ఆ మధ్యన తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని బాబుకు చెప్పబోయారు. అయితే వారి మాటలకు చంద్రబాబు నాయుడు మధ్యలోనే అడ్డుతగులుతూ జిల్లాలో ఇటీవల వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల కటింగులను వారి ముందు పెట్టారు. మీరిద్దరూ సఖ్యతగా ఉన్నారంటున్నారు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం మీ ఇద్దరి పేరిట చెరో వర్గంగా నాయకులు, కార్యకర్తలు విడిపోయారు. ఒక వర్గం నాయకులు మరొక వర్గాన్ని దుమ్మెత్తిపోస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తలంటు కార్యక్రమం తరువాత ఇద్దరు నాయకులు ఇళ్ళకు వెళ్ళి తమ తమ వర్గాలకు చెందిన నాయకులకు ఫోను చేసి పత్రికల్లో ఎటువంటి ప్రకటనలు ఇవ్వొద్దని గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/khammam-district-telugudesham-party-24-13343.html





