ఊపిరి పీల్చుకున్న తార..బెయిల్ మంజూరు
Publish Date:Apr 13, 2012
Advertisement
హైదరాబాద్: సినీ అవకాశాలు, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపిందనే ఆరోపణలతో అరెస్టైన సినీ నటి తారా చౌదరికి హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. పోలీసులను నెట్టివేసిన కేసులో గురువారం ఆమెకు బెయిల్ మంజూరయింది. ఒక యువతి ఫిర్యాదుతో గత నెల 31న ఆమెను అరెస్ట్ చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే అరెస్ట్ చేసేందుకు తన ఇంటికి వచ్చిన పోలీసులను తారా చౌదరి నెట్టివేసిందట. నెట్టివేసిందంటూ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. మరో కేసులోనూ ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చింది. బంజారాహిల్స్ పోలీసులు తారా చౌదరిపై మొత్తం మూడు కేసులు పెట్టారు. మూడు కేసులలో రెండు కేసులలో ఆమెకు బెయిల్ లభించింది. రూ.5వేల సొంత పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపిందనే ఆరోపణల నేపథ్యంలో పది రోజుల క్రితం తారా చౌదరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా, తనను రాజకీయకంగా అంతం చేసేందుకు సొంత పార్టీకి చెందిన కొందరు కుట్ర పన్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. సెక్స్ రాకెట్‌కు కేంద్ర బిందువుగా ఉన్న సహాయ నటి తారా చౌదరి కేసులో రాయపాటి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. పైపెచ్చు.. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణపై దురుద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేయాలంటూ తారాను బెదిరించినట్టు పోలీసులు కనుగొన్న ఆడియోపై ఎంపీ రాయపాటి స్పందించారు. వార్తా ఛానెల్స్‌లో తనకు వ్యతిరేకంగా ప్రసారమైన తారాచౌదరి ఫోన్ సంభాషణలను కొట్టిపారేసారు. తనపై కావాలనే కుట్ర పన్నారని ఆరోపించారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణను అప్రతిష్టపాలు చేసేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని రాయపాటి స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా, సినీ నటి తారా చౌదరి ఎవరో తనకు తెలియదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. తారా చౌదరి కేసు విచారణపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయని మంత్రి కన్నా అన్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-13340.html





