కరువు ప్రాంతాల్లో నకిలీనోట్ల చెలామణి?
Publish Date:May 16, 2012
Advertisement
రాష్ట్రంలో కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ఇటీవల వరకూ గుర్తించిన ప్రదేశాల్లో నకిలీనోట్ల చెలామణి యథేచ్చగా సాగుతోంది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణాలోని మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు నకిలీనోట్ల చెలామణికి అడ్డాగా మారుతున్నాయి. ఈ నకిలీనోట్లను మహారాష్ట్రలో ముద్రించి తీసుకువస్తున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అక్కడ ముద్రించటమే కాకుండా విదేశీయులు కూడా ముఠాలుగా ఎపడి వీటిని రవాణా చేస్తున్నారని సమాచారం. అలానే సంతలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ఈ నోట్లు చెలామణి సాగుతోందని తెలుస్తోంది. ఎటిఎంల్లో కూడా నకిలీ నోట్లు వస్తున్నాయి. మెదక్ జిల్లా బల్లారంలోనూ నకిలీనోట్ల చెలామణి సాగుతోంది. మంజీరా గ్రామీణబ్యాంకుకు వెళ్ళిన ఓ ఖాతాదారుడు ఇచ్చిన నోట్లలో ఒకదాన్ని నకిలీదని గుర్తించిన అకౌంటెంట్ దాన్ని రెడ్ ఇంకుతో కొట్టేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఖాతాదారునికి విషయం చెప్పి ఆ నోటు తిరిగి ఇచ్చేశారట. అలానే అక్కడికి సమీపంలోని ఎటిఎంల్లో నకిలీ, దొంగనోట్లు వస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరులోనూ రూ.500 నకిలీనోట్లు చెలామణి జరుగు తోంది. ఇక్కడ నాపరాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలోనూ ఈ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఈ నోట్లు బ్యాంకుకు చేరాక కానీ ప్రజలు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ నోట్లను పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారు రవాణా చేస్తున్నారని పోలీసులు ధ్రువీకరించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ లోనూ ఇదే తరహాలో పశ్చిమబెంగాల్ కు చెందిన ముగ్గురు పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలుగువన్.కామ్ రీడర్స్ కు తెలిసిందే. ఇలా కరువుప్రాంతాలపై కన్నేసిన ఈ ముఠాలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/fake-notes-circulating-in-draught-areas-24-14075.html





