ఏపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి ఈడీ?
Publish Date:Mar 26, 2025

Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా? ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు లావు అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో భేటీ కాలేదనీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే స్వయంగా లావును పిలిపించుకుని మద్యం కుంభకోణంపై ఆరా తీశారు.
ఆ సందర్భంగా ఎంపీ ఇచ్చిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఇది జరిగిన తరువాత ఎంపీ లావు బుధవారం (మార్చి 26) అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరుసగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ఎంపీ డిమాండ్ కు కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారనీ, ఈడీని రంగంలోకి దించేందుకు అంగీకరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. జగన్ మద్యం పాలసీ దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నది. ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని తెలుగుదేశం వాదిస్తోంది. ఏపీ మధ్యం కుంభకోణం వేల కోట్లేనని అంటోంది. ఏపీలో మూడు మద్యం విషయంలో మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని లోక్ సభ వేదికగా లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు.
ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్.. మూడింటినీ వైసీపీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని అక్రమాలకు పాల్పడ్డారని లావు లోక్ సభలో సోదాహరణంగా చెప్పారు. అంతే కాకుండా ఈ మద్యం కుంభకోణం సొమ్ము దాదాపు 4 వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించేశారని లావు ఆరోపించారు. మొత్తం మీద లావు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన తరువాత కేంద్రం కూడా ఏపీ మద్యం కుంభకోణం నిగ్గు తేల్చాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనీ, ప్రస్తుతం ఏపీ మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణలో విదేశాలకు మద్యం సొమ్ము తరలినట్లు నిర్ధారణ కావడంతో ఇక ఈడీని కూడా రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఆ కారణంగానే కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/enforcement-directorate-to-investigate-andhra-pradesh-madyam-scam-39-195025.html












